Bhanupriya: జ్ఞాపకశక్తి తగ్గడంతో.. సెట్‌కు వెళ్లి డైలాగ్స్‌ మర్చిపోయా: భానుప్రియ

తన కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు అలనాటి నటి భానుప్రియ (Bhanu Priya). ప్రస్తుతం సహాయనటిగా రాణిస్తోన్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Published : 05 Feb 2023 14:12 IST

హైదరాబాద్‌: చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి అగ్ర కథానాయకుల సరసన నటించి, కొన్నేళ్లపాటు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు భానుప్రియ (Bhanupriya). ప్రస్తుతం తల్లి పాత్రల్లో నటిస్తున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన కెరీర్‌ ఎలా మొదలైంది, స్టార్‌ హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం.. ఇలా ఎన్నో విషయాలను ఆమె వెల్లడించారు. కొంతకాలంగా తాను మతిమరుపుతో బాధపడుతున్నట్లు చెప్పారు.

‘‘వైవాహిక బంధంలో ఇబ్బందులు ఏర్పడి.. నేనూ, నా భర్త విడిపోయామని గతంలో వచ్చిన వార్తల్లో నిజం లేదు. మేమిద్దరం అన్యోన్యంగా ఉండేవాళ్లం. కొన్నేళ్ల క్రితం ఆయన మరణించారు. ఆ తర్వాత నేనూ అనారోగ్యానికి గురయ్యాను. జ్ఞాపకశక్తి తగ్గింది. నాకెంతో ఇష్టమైన డ్యాన్స్‌ను కూడా కొంతవరకూ మర్చిపోయాను. అందుకే డ్యాన్స్‌ స్కూల్‌ పెట్టలేకపోయాను. ఇటీవల ఓ సినిమా షూట్‌లో పాల్గొని.. డైలాగ్స్ మర్చిపోయి ఇబ్బందిపడ్డా. కొంత బ్రేక్‌ తీసుకుని సెట్‌ అయ్యాక మళ్లీ షూట్‌ కొనసాగించా’’ అని ఆమె (Bhanupriya) వివరించారు. తల్లి పాత్రలు పోషిస్తున్నందుకు తాను ఏమాత్రం బాధపడలేదని చెప్పారు. అయితే, ‘నాట్యం’ సినిమాలో మంచి పాత్ర అని చెప్పి తనని తీసుకున్నారని.. తర్వాత చూస్తే తన పాత్రకు అంత ప్రాధాన్యం లేదని ఆమె తెలిపారు.

‘సితార’తో కెరీర్‌ను ఆరంభించి.. పదేళ్లపాటు టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేశారు అలనాటి నటి భానుప్రియ. తెలుగులో అగ్రహీరోలందరి సరసన ఆమె నటించి ప్రేక్షకులను అలరించారు. ‘విజేత’, ‘స్వర్ణకమలం’, ‘పెదరాయుడు’, ‘త్రినేత్రుడు’, ‘దొంగ మొగుడు’, ‘పల్నాటి పులి’ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు నిచ్చాయి. హీరోయిన్‌గా కెరీర్‌ ముగించిన తర్వాత తల్లి పాత్రల్లో ఆమె నటిస్తున్నారు. ‘ఛత్రపతి’, ‘దమ్ము’, ‘3’ చిత్రాల్లో అమ్మ పాత్రలో ఆమె కనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని