Jamuna: ‘గుండమ్మ కథ’.. జమున కోసం మూడేళ్లు ఎదురు చూశారట..!

జమున (Jamuna) పేరు చెప్పగానే తెలుగువారికి గుర్తుకు వచ్చే చిత్రాల్లో ‘గుండమ్మ కథ’ (Gundamma Katha) ఒకటి. ఆ సినిమాకు 60 ఏళ్లు అయిన సందర్భంగా గతంలో ఆ చిత్రం గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. ఆమె కన్నుమూసిన సందర్భంగా వాటిని ఓసారి గుర్తు చేసుకుందాం.

Updated : 27 Jan 2023 10:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అలనాటి నటి జమున (Jamuna) ఇక లేరు. హైదరాబాద్‌లో ఆమె కన్నుమూశారు. ఆమె పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే సినిమాల్లో ‘గుండమ్మ కథ’ (Gundamma Katha) ఒకటి. అంతలా ఆమెకు పేరు సంపాదించి పెట్టిందీ సినిమా. ఈ సినిమా పేరు వినగానే వినసొంపైన మాటలు, పాటలు, పాత్రల చిత్రీకరణ, హావభావాలు గుర్తుకొస్తాయి. రామారావు, నాగేశ్వరరావు పాత్రల తీరు.. సావిత్రి సౌమ్యతనం, జమున కొంటెతనం, గుండక్క గయ్యాళితనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ సినిమా విడుదలై అరవై ఏళ్లు అయిన సందర్భంగా గతంలో జమున ఈటీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడా విషయాలు మీ కోసం...

‘గుండమ్మ కథ’ టైటిల్‌ చూడగానే అప్పట్లో స్పందన ఎలా ఉంది..?

జమున: ‘గుండమ్మ కథ’ సినిమా పేరు పెట్టినప్పుడు పెద్దగా స్పందన లేదు. ఎన్టీఆర్‌ (NTR), ఏఎన్నార్‌ (ANR)తో అప్పటికే నాకున్న వివాదాన్ని ‘గుండమ్మ’  సినిమా కాంప్రమైజ్‌ చేసింది. ఆ హీరోలతో దాదాపుగా మూడేళ్లు నేను మాట్లాడలేదు. వేరే వాళ్లయితే మునిగిపోతారు. నేను కాబట్టి వగరు, పొగరుతో మూడేళ్లు వాళ్లతో సినిమాలు చేయనని భీష్మించుకున్నాను. ఈ క్రమంలో జగ్గయ్య లాంటి వాళ్లతో సినిమాలు చేసి సూపర్‌హిట్‌ ఇచ్చా. పాత రోజుల్లో ఆత్మాభిమానం ఎక్కువ. కాంచనమాల, కన్నాంబ.. తర్వాత కృష్ణవేణి, వరలక్ష్మి తరం తర్వాత మేం వచ్చాం. ఒక్కొక్కరం 20, 30 ఏళ్లు నటించాం. ఇప్పటి హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్తున్నారు.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌తో సంబంధాలు సరిగ్గా లేనప్పుడు ‘గుండమ్మ కథ’లోకి ఎలా వచ్చారు? సరోజగా మీరే చేయాలని ఎందుకు కోరారు?

జమున: ఆత్మాభిమానంతో ఉండాలనుకుంటే ఎవరితోనైనా గొడవలు వస్తాయి. నాగేశ్వరరావుతో ఇబ్బంది వచ్చి ఆయనతో సినిమాలు చేయలేదు. ఏ రంగంలోనైనా ఆత్మాభిమానం పొగొట్టుకోకూడదు అనుకుంటే స్త్రీ తప్పక సమస్యల్ని ఎదుర్కొవాలి. సరోజ పాత్ర చేయాలని నా కోసం చక్రపాణి, నాగిరెడ్డి మూడేళ్లు ఎదురుచూశారు. ఓ రోజు నాగేశ్వరరావుతో నాగిరెడ్డి, చక్రపాణి, నేను సమావేశమయ్యాం. ‘నా గుండమ్మ మూడేళ్లుగా ఏడుస్తోందయ్యా.. చేయండి’ అని నాగేశ్వరరావుతో చెప్పారు. అందులో నేను చిలిపి అమ్మాయిగా చేసి ప్రేక్షకులను అలరించాను.

మీ నలుగురినే ‘గుండమ్మకథ’లో పెట్టుకోవాలని అనుకోవడంలో ‘మిస్సమ్మ’ సినిమా పాత్ర ఏమైనా ఉందా?

జమున: ఏ పాత్ర సృష్టించినా దాని స్వభావం, తీరు తెన్నులను రచయిత గమనిస్తారు. ఆ పాత్ర ఎవరు  చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తారు. సావిత్రి (Savitri) పొగరుగా నటిస్తే అంగీకరిస్తారా.. ఆమె పాత్రలు సాఫ్ట్‌గా ఉండాలి. జమున ఏడుపుగొట్టు పాత్రలు వేస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా? జమున సత్యభామలా ఉండాలనుకుంటారు. అలాంటి నటన జన్మతహః ఉండాలి. అప్పుడే పాత్రలో ఒదిగిపోతాం.

టీనేజ్‌లో కూడా అమ్మా కాఫీ అనేవారా?

జమున: అదేం లేదు. రాణిలాగా ఉండేదాన్ని. ఎందుకంటే అమ్మా, నాన్న, తమ్ముడు, మరదలు మా ఇంట్లోనే ఉండేవారు. అంతా అమ్మా చూసుకునేది. ఆమెకు క్రమశిక్షణ ఎక్కువ. నా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండేవారు.

సూర్యకాంతంతో మీ అనుబంధం ఎలా ఉండేది?

జమున: సూర్యకాంతం (Suryakantham) నాకు చాలా క్లోజ్‌. మంచి తల్లి అందరినీ బిడ్డల్లా చూసేది. సెట్‌లో అందరికీ భోజనం పెట్టేందుకు పెద్ద క్యారేజీ తెప్పించేది. దగ్గరుండి తినిపించేది.

జమున పంచుకున్న మరిన్ని విశేషాలను ఈ పూర్తి వీడియోలో చూడండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని