Shaakunthalam: సమంత ‘శాకుంతలం’ నుంచి కనువిందైన అప్‌డేట్‌...

మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. సమంత టైటిల్‌ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా గురించి తాజాగా చిత్రబృందం ఓ అప్‌డేట్‌ ఇచ్చింది. 

Published : 05 Nov 2022 01:49 IST

హైదరాబాద్‌: మనకు ఇష్టమైన నటీనటుల సినిమాలు 3డీలో చూస్తే ఆ మజానే వేరు. ఇప్పటికే ఎన్నో సినిమాలు 3డీలో అలరించాయి. ఇటీవల సుదీప్‌ నటించిన విక్రాంత్‌ రోణ 3డీలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో తెలుగు సినిమా అలా 3డీలో కనువిందు చేసేందుకు సిద్ధమైంది. అది మరేదో కాదు సమంత(Samantha) నటిస్తోన్న శాకుంతలం(Shaakuntalam). ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ట్వీట్‌ చేసింది. ‘శాకుంతలం ఇప్పుడు 3డీలో రానుంది. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం’ అని ట్విటర్‌ వేదికగా తెలిపింది. ఈ విషయంపై గతంలోనే వార్తలు వచ్చినా ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది.

ఈ ట్వీట్‌ చూసి సమంత ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. శకుంతల, దుష్యంతుల ప్రేమకథ 3డీలో అలరించనుందని సోషల్‌ మీడియాలో వాళ్ల ఆనందాన్ని తెలియజేస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ రూపొందిస్తున్న ఈ లవ్‌ ఎంటర్‌టైనర్‌కు నీలిమ గుణ నిర్మాత. శకుంతల పాత్రలో సమంత కనువిందు చేయనుండగా.. దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు అందించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్‌లకు మంచి రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే.   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని