Shabaash Mithu: ‘శభాష్‌ మిథు’ ట్రైలర్‌ వచ్చేసింది.. మిథాలీగా అదరగొట్టిన తాప్సీ

దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత మహిళా క్రికెట్‌కు అసాధారణమైన సేవలు అందించి, ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన ప్రముఖ క్రీడాకారిణి మిథాలీరాజ్‌ (Mithali raj). ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో....

Updated : 20 Jun 2022 10:54 IST

ముంబయి: దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత మహిళా క్రికెట్‌కు అసాధారణమైన సేవలు అందించి, ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ (Mithali raj). ఆమె జీవితాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం ‘శభాష్‌ మిథు’ (Shabaash Mithu). నటి తాప్సీ పన్ను (Taapsee) టైటిల్‌ రోల్‌ పోషించారు. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకుడు. ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం ఉదయం చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. చిన్నతనం నుంచి క్రికెటర్‌ కావాలని మిథాలీ ఎంతగా ఆరాటపడింది.. క్రికెటర్‌గా ఎదిగే సమయంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొంది.. మహిళల క్రికెట్‌కు గుర్తింపు తీసుకురావడం కోసం ఆమె ఎంతలా శ్రమించింది.. ఇలా ప్రతి విషయాన్నీ ఈ సినిమాలో చూపించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

‘‘మెన్‌ ఇన్‌ బ్లూ మాదిరిగానే మనకి కూడా ఉమెన్‌ ఇన్‌ బ్లూ అనే ఓ టీమ్‌ ఉంటే బాగుంటుందని ఎనిమిదేళ్ల వయసు నుంచి కలలు కంటున్నాను’’ అని తాప్సీ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం మనసుని హత్తుకునేలా ఉంది. ఇక, మిథాలీ రాజ్‌గా తాప్సీ నటన అదరగొట్టేసింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె పలికించిన హావభావాలు ప్రేక్షకుల్ని భావోద్వేగానికి గురి చేసేలా ఉన్నాయి. వయాకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. జులై 15న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాప్సీ గత కొంతకాలం నుంచి గ్లామర్‌ పాత్రలకు కాస్త దూరంగా ఉంటూనే.. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో ఎక్కువగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అలా, ఆమె నుంచి వచ్చిన ‘పింక్‌’, ‘ముల్క్‌’, ‘గేమ్‌ ఓవర్‌’, ‘సాండ్‌కే ఆంఖ్‌’, ‘తప్పడ్‌’, ‘హసీనా దిల్‌రుబా’, ‘రష్మీ రాకెట్‌’ వంటి చిత్రాలు మంచి టాక్‌ని అందుకున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో వరుస ప్రాజెక్ట్‌లున్నాయి. ‘జన గణ మన’, ‘దుబారా’, ‘ఎలియన్‌’, ‘బ్లర్‌’, ‘ఓ లడ్కీ హై కహా?’ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని