Pathaan Review: రివ్యూ: పఠాన్
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) - దీపికా పదుకొణె (Deepika Padukone) నటించిన ‘పఠాన్’ (Pathaan) ఎలా ఉందంటే?
Pathaan Review.. చిత్రం: పఠాన్; నటీనటులు: షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం, అశుతోష్, డింపుల్ కపాడియా, సల్మాన్ ఖాన్ (అతిథి పాత్రలో), తదితరులు; ఛాయాగ్రహణం: సంచిత్; కూర్పు: ఆరిష్ షేక్; స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్; సంగీతం: విశాల్ - చంద్రశేఖర్; నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా, అకింత్ బల్హారా; నిర్మాత: ఆదిత్య చోప్రా; సంస్థ: యశ్‌రాజ్ ఫిలింస్; కథ, దర్శకత్వం: సిద్ధార్థ్ ఆనంద్; విడుదల తేదీ: 25-01-2023
అటు వివాదాలు... ఇటు అంచనాలతో కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన చిత్రం ‘పఠాన్’ (Pathaan). అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) నుంచి నాలుగేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన పూర్తిస్థాయి చిత్రమిదే. షారుఖ్ కమ్‌బ్యాక్ చిత్రంగానూ, యశ్‌రాజ్ స్పై యూనివర్స్ చిత్రంగానూ సినిమాపై మొదట్నుంచే అంచనాలు పెరిగాయి. ‘బేషరమ్ రంగ్...’ పాటలో కథానాయిక దీపికా పదుకొణె (Deepika Padukone) కనిపించిన విధానం వివాదాల్ని రేకెత్తించింది. మరి సినిమా ఎలా ఉంది? షారుఖ్ అభిమానుల్ని మెప్పించాడా? తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం.
కథేంటంటే: పఠాన్ (షారుఖ్ ఖాన్) (Shah Rukh Khan) గుండెల నిండా దేశభక్తి ఉన్న రా ఏజెంట్. ఓ సంఘటన తర్వాత అజ్ఞాతంలో ఉంటాడు. భారతదేశం ఆర్టికల్ 370ని రద్దు చేశాక దేశంపై దాడికి వ్యూహం పన్నుతాడు పాకిస్థాన్‌కు చెందిన ఓ అధికారి. అందుకోసం ప్రైవేట్ ఏజెన్సీ ఔట్‌ఫిట్ ఎక్స్ చీఫ్ జిమ్ (జాన్ అబ్రహం) (John Abraham)ని రంగంలోకి దింపుతాడు. జిమ్ కూడా ఒకప్పుడు భారతదేశం తరఫున ఏజెంట్‌గా పనిచేసినవాడే. మరి ఎందుకు శత్రువులతో దోస్తీ చేశాడు? భారత్‌పై వైరస్ దాడికి సిద్ధమైన జిమ్‌ని పఠాన్ ఎలా ఎదుర్కొన్నాడు? వీరిద్దరి మధ్యకు పాకిస్థాన్ ఐ.ఎస్.ఐ ఏజెంట్ రూబై (దీపికా పదుకొణె) (Deepika Padukone) ఎలా వచ్చింది? ఆమె కథేమిటి? ఆమె ఎవరికి, ఎలా సాయం చేసిందనేది మిగతా కథ. (Pathaan Review)
ఎలా ఉందంటే: స్పై థ్రిల్లర్ అనగానే కళ్లు చెదిరే యాక్షన్ విన్యాసాలు, ఊహించని మలుపులు లాంటివి గుర్తుకొస్తాయి. వాటిని మరో స్థాయిలో జోడించి చూపించడమే.. ‘పఠాన్’ ప్రత్యేకత. నాలుగేళ్ల తర్వాత వస్తున్న షారుఖ్ సినిమా కావడంతో అభిమానుల్ని మరింతగా అలరించేలా హీరోయిజాన్ని జోడించారు. ఆయనకి మరో ఏజెంట్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కూడా తోడై మెరవడం ఈ సినిమాకి మరిన్ని హంగుల్ని జోడించినట్టైంది. ఎప్పటికప్పుడు మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకి అనుగుణంగా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం మరింత గ్రాండ్‌నెస్‌ని జోడించారు. దాంతో హాలీవుడ్ మార్వెల్ సినిమాల్ని చూస్తున్న అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది. కథ, కథనాల కంటే కూడా ఈ సినిమాకి విజువల్స్ మాయాజాలమే హైలైట్‌గా నిలిచింది. ఆకాశంలోనూ, మంచులోనూ, ట్రైన్‌లోనూ.. ఇలా భిన్న నేపథ్యాల్లో యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కించారు. అవి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతాయి. (Pathaan Review)
కథ, కథనాలే పెద్దగా ఆసక్తిని రేకెత్తించవు. మలుపులు కూడా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టే సాగుతాయి. షారుఖ్, జాన్, దీపికా... ఈ మూడు పాత్రలకీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కానీ.. అవేవీ మనసుల్ని హత్తుకునేలా లేకపోవడం సినిమాకి మైనస్‌గా మారింది. అలాంటి లోపాలన్నింటినీ స్టార్ పవర్, విజువల్స్ కప్పిపెడతాయి. షారుఖ్ ఖాన్, దీపిక, జాన్ అబ్రహం తెరపై కనిపించినప్పుడల్లా సినిమా మరోస్థాయిలో ఉంటుంది. ఆ మూడు పాత్రల్ని అలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా షారుఖ్, జాన్ మధ్య పోరాట ఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే సల్మాన్ ఎంట్రీ మరో ఎత్తు. విరామ సన్నివేశాలు, పతాక సన్నివేశాలు పెద్దగా మెప్పించవు. ఓ సైనికుడు తనకి దేశం ఏం చేసిందని కాదు, తాను దేశానికి ఏం చేశాననే ఆలోచిస్తాడంటూ షారుఖ్ చెప్పే సంభాషణలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. (Pathaan Review)
ఎవరెలా చేశారంటే: షారుఖ్ ఈ సినిమా కోసం సన్నద్ధమైన విధానం, తెరపై కనిపించిన తీరు యువ తారలకు స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు. గతంలో కంటే మరింత ఫిట్‌గా కనిపించారు. రొమాంటిక్ సన్నివేశాలతో మనసులు దోచే ఆయన యాక్షన్‌తోనూ అదరగొట్టాడు. ఆయనకు, దీపికకు మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ‘బేషరమ్ రంగ్...’ పాటతోపాటు, చివర్లో వచ్చే పాట కూడా అలరిస్తుంది. జాన్.. జిమ్ పాత్రకి సరిగ్గా నప్పాడు. బలమైన విలన్‌గా కనిపించాడు. దీపికా పదుకొణె గ్లామర్‌గా కనిపించడంతోపాటు, పోరాట ఘట్టాల్లోనూ మెరిసింది. (Pathaan Review)
సల్మాన్ ఓ పోరాటఘట్టంలో అలరిస్తాడు. పతాక సన్నివేశాల్లో మన తర్వాత ఎవరు? అంటూ షారుఖ్‌తో ఆయన మాట్లాడే సన్నివేశాలు అలరిస్తాయి. డింపుల్ కపాడియా, అశుతోష్ మంచి పాత్రల్లో మెరిశారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకున్నాయి. కెమెరా పనితనం, పాటలు, నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం. సిద్ధార్థ్ ఆనంద్ ఆయన బృందం మంచి కథ చెప్పడం కంటే కూడా సినిమాలో ఉన్న స్టార్ పవర్‌కి తగ్గట్టుగా సన్నివేశాల్ని రాయడంలో విజయవంతమయ్యారు. నిర్మాణం అత్యున్నతంగా ఉంది. (Pathaan Review)
బలాలు
+ షారుఖ్.. ఇతర తారాగణం, + యాక్షన్, + విజువల్స్
బలహీనతలు
- ఊహకు తగ్గట్టుగా సాగే మలుపులు
చివరిగా: పఠాన్.. యాక్షన్ హంగామా (Pathaan Review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం
-
World News
Pizza: ఇప్పుడు తినండి.. మరణానంతరం చెల్లించండి.. ఓ పిజ్జా కంపెనీ వింత ఆఫర్!