Pathaan: రష్యాలో 3వేల థియేటర్లలో ‘పఠాన్‌’

భాషతో సంబంధం లేకుండా పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద వసూళ్లు కురిపిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో అలాంటి చిత్రాలు చాలానే వచ్చాయి.

Updated : 10 Jun 2023 14:15 IST

భాషతో సంబంధం లేకుండా పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద వసూళ్లు కురిపిస్తుంటాయి. ఈ మధ్య కాలంలో అలాంటి చిత్రాలు చాలానే వచ్చాయి. పాన్‌ ఇండియా స్థాయిలో అలరించి విదేశీ ప్రేక్షకుల్ని సైతం మెప్పించాయి. ఈ మధ్య విడుదలైన ‘పఠాన్‌’ (Pathaan) చిత్రం దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. బాలీవుడ్‌కు కొత్త ఊపిరినిచ్చింది. షారుక్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని రష్యా, కామన్‌ వెల్త్‌ ఇండిపెండెంట్‌ స్టేట్స్‌(సీఐఎస్‌)లో జూన్‌ 13న 3వేలకు పైగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహం కీలక పాత్రల్లో నటించిన ‘పఠాన్‌’కు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా బంగ్లాదేశ్‌లోని 41 థియేటర్లలో విడుదలై మొదటిరోజే రూ.25లక్షల వసూళ్లు చేసింది. 1971 తర్వాత అక్కడ విడుదలైన మొదటి హిందీ సినిమా ‘పఠాన్‌’.


‘మాయా పేటిక’ తెరవడానికి సిద్ధం

విరాజ్‌ అశ్విన్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, సిమ్రత్‌ కౌర్‌, రజత్‌ రాఘవ్‌ ప్రధాన పాత్రల్లో రమేష్‌ రాపర్తి తెరకెక్కించిన చిత్రం ‘మాయా పేటిక’. మాగుంట శరత్‌ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మించారు. సునీల్‌, పృథ్వీరాజ్‌, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని నటి కీర్తి సురేష్‌ ద్వారా తెలియపరిచింది చిత్ర బృందం. ఈ సందర్భంగా దర్శకుడు రమేష్‌ మాట్లాడుతూ.. ‘‘ఓ సెల్‌ఫోన్‌ కథ ఆధారంగా రూపొందించిన చిత్రమిది. మంచి కామెడీ, పాటలు, చక్కటి విజువల్స్‌ అన్నీ ఇందులో ఉన్నాయి. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ‘‘రొటీన్‌కు భిన్నంగా ఉండే చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా అందరినీ అలరిస్తుంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: గుణ బాలసుబ్రమణియన్‌, ఛాయాగ్రహణం: సురేష్‌ రగుతు.


ఆ పుస్తకంలో ఏముంది?

కాజల్‌, రెజీనా, జనని అయ్యర్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘కార్తీక’. డి.కార్తికేయన్‌ (డీకే) దర్శకత్వం వహించారు. తమిళంలో ‘కరుంగాపియం’ పేరుతో రూపొందిన ఈ సినిమాని, వెంకటసాయి ఫిలింస్‌ పతాకంపై టి.జనార్ధన్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ముత్యాల రాందాస్‌ సమర్పకులు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘‘హారర్‌, సస్పెన్స్‌ అంశాలతో కూడిన థ్రిల్లర్‌ కథ ఇది. వందేళ్లనాటి పుస్తకం ఈ చిత్రంలో కీలకం. ఇంతకీ ఆ పుస్తకం ప్రత్యేకత ఏమిటి? అందులో ఏముంది? అది చదివాక చోటు చేసుకున్న పరిణామాలు ఎలాంటివన్నది  తెరపైనే చూడాలి. తనకి హాని కలిగించిన వ్యక్తులపై దెయ్యంలా మారి పగ తీర్చుకునే పాత్రలో కాజల్‌ కనిపిస్తుంది. దర్శకుడు కార్తికేయన్‌ తనదైన శైలిలో చిత్రాన్ని తీర్చిదిద్దారు. అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి’’ అన్నారు. రైజా విల్సన్‌, నోయిరికా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రసాద్‌.ఎస్‌.ఎన్‌.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు