Shah Rukh Khan: షారుక్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా

బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది.

Published : 02 Jul 2024 20:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)కు అరుదైన గౌరవం దక్కింది. లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్‌ (Locarno Film Festival) జ్యూరీ ఆయన్ను ‘కెరీర్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు’కు ఎంపిక చేసింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. ‘‘షారుక్‌లాంటి లివింగ్‌ లెజెండ్‌ను  ఆహ్వానించాలనే కల నెరవేరింది. ఆయనో సూపర్‌స్టార్‌. హీరోగా, ప్రొడ్యూసర్‌గా ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు’’ అని కొనియాడింది. ఈ పోస్ట్‌పై షారుక్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

లొకర్నో ఫిల్మ్‌ఫెస్టివల్‌ 77వ ఎడిషన్‌ ఆగస్టు 7 నుంచి 17 వరకు లొకర్నో (స్విట్జర్లాండ్‌)లో జరగనుంది. 10న షారుక్‌కు అవార్డు ప్రదానం చేయనున్నారు. ఆయన కెరీర్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటైన ‘దేవ్‌దాస్‌’ను ఆ ఈవెంట్‌లో ప్రదర్శించనున్నారు. ఆ పురస్కారానికి ఎంపికైన తొలి భారతీయ నటుడిగా షారుక్‌ నిలిచారు. ఇంతకుముందు ఫ్రాన్సిస్కో రోసీ, జానీ టో వంటి హాలీవుడ్‌ ప్రముఖులు ఆ పురస్కారానికి ఎంపికయ్యారు. 32 ఏళ్ల నట ప్రస్థానంలో షారుక్‌ 100కిపైగా చిత్రాల్లో నటించి, మెప్పించారు. గతేడాది ‘పఠాన్‌’, ‘జవాన్‌’, ‘డంకీ’లతో అలరించిన ఆయన ప్రస్తుతం సుజోయ్‌ ఘోష్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆయన కుమార్తె సుహానా ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ‘కింగ్‌’ టైటిల్‌ని ఖరారు చేసినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని