Pathaan: షారుఖ్‌ని ‘పఠాన్‌’ అని 23 ఏళ్ల ముందే పిలిచిన కమల్‌ హాసన్‌

షారుఖ్‌‌(Shah Rukh Khan) నటించిన తాజా చిత్రం ‘పఠాన్’(Pathaan)‌. ఈ సినిమాకు కమల్‌హాసన్‌కు మధ్య ఉన్న ఆసక్తికర విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

Published : 30 Jan 2023 17:58 IST

హైదరాబాద్‌: ఈ ఏడాది ప్రారంభంలోనే ‘పఠాన్‌’(Pathaan)తో బాలీవుడ్‌కు సూపర్‌హిట్‌ను అందించాడు షారుఖ్‌(Shah Rukh Khan). గత రెండేళ్లుగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తోన్న బీటౌన్‌(Bollywood) 2023ను ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌తో ప్రారంభించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వైరల్‌ అవుతోంది. కమల్‌ హాసన్‌ 23 సంవత్సరాల ముందే షారుఖ్‌ను ‘పఠాన్‌’ అని పిలిచిన విషయం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

2000 సంవత్సరంలో కమల్‌ హాసన్‌(Kamal Haasan) ‘హే రామ్‌(Hey Ram)’ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో షారుఖ్‌ ఓ కీలకపాత్రలో నటించారు. కమల్‌.. సాకేత్‌రామ్‌గా, షారుఖ్‌.. అంజాద్‌ అలీ ఖాన్‌గా నటించారు. అందులో కమల్‌, షారుఖ్‌ మధ్య జరిగే ఓ సన్నివేశంలో కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ షారుఖ్‌తో ‘సరే పఠాన్‌ నువ్వు నీ కోపాన్ని అదుపులో పెట్టుకో’ అనే డైలాగ్‌ చెబుతారు. అప్పటి డైలాగు ఇప్పుడు ‘పఠాన్‌’ హిట్‌తో మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

‘పఠాన్‌’ వసూళ్ల సునామీ.. 5రోజుల్లో రూ.500కోట్లను దాటేసి..

జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘పఠాన్’‌. కలెక్షన్‌లలో రికార్డులు సృష్టిస్తోంది. రోజుకు వంద కోట్లకు తగ్గకుండా వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటోంది. విడుదలకు ముందే వార్తల్లో నిలిచిన ఈ చిత్రం.. విడుదలైన దగ్గరి నుంచి ఆశ్చర్యపరిచే వసూళ్లతో ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ’గా నిలుస్తోంది. సినీ విశ్లేషకుల సమాచారం ప్రకారం ఐదు రోజుల్లో ‘పఠాన్‌’ సినిమా రూ.542కోట్లు (గ్రాస్‌) వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. దీంతో నాలుగేళ్ల తర్వాత వచ్చినా.. షారుఖ్‌ కలెక్షన్లలో కింగ్‌ఖాన్‌ అని మరోసారి నిరూపించుకున్నాడంటున్నారు ఆయన అభిమానులు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు