కేజీయఫ్‌ ఎఫెక్ట్‌.. స్టార్‌ హీరో సినిమా వాయిదా...

కేజీయఫ్‌-2 కోసం తెలుగు, కన్నడ ప్రేక్షకులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Updated : 13 May 2022 12:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేజీయఫ్‌-2 కోసం తెలుగు, కన్నడ ప్రేక్షకులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 14న థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో.. స్టార్‌ హీరో షాహిద్ కపూర్ నటించిన ‘జెర్సీ’ సినిమా విడుదల వాయిదా పడింది. టాలీవుడ్‌లో నానీ హీరోగా తెరకెక్కిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా రిమేక్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిని ముందుగా 2021 డిసెంబర్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా 2022 ఏప్రిల్‌ 14కి వాయిదా వేశారు. కానీ ఇదేరోజు కన్నడ సూపర్‌ స్టార్‌ యశ్‌ నటించిన కేజీయఫ్‌-2 విడుదల కానుండడంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 22కి మరోసారి వాయిదా వేశారు.

జెర్సీ చిత్ర నిర్మాత అమన్ గిల్ మాట్లాడుతూ.. ‘ఒక టీమ్‌గా, మేం మా రక్తాన్ని చెమటగా మలచి కన్నీళ్లతో జెర్సీని రూపొందించాం. ఈ చిత్రం విస్తృతమైన మార్గంలో మీ అందరి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అందుకే ఈ సినిమాని ఏప్రిల్‌ 22కు వాయిదా వేస్తున్నాం’ అని అన్నారు. పూర్తి క్రీడా నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, పంకజ్ కపూర్, రోనిత్ కమ్రా నటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ సమర్పణలో దిల్ రాజు, ఎస్. నాగ వంశీ, అమన్ గిల్ నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని