Shahid Kapoor: ఆ సినిమా చూసి నా భార్య నన్ను వదిలేస్తానంది: షాహిద్‌ కపూర్‌

తాను నటించిన ఓ చిత్రాన్ని చూసి తన సతీమణి మీరా రాజ్‌పుత్‌ వదిలేస్తానని బెదిరించిందని నటుడు షాహిద్‌ కపూర్‌ తెలిపారు. కెరీర్‌లో వరుస పరాజయాలు చవిచూసిన షాహిద్‌ ‘అర్జున్‌ రెడ్డి’..

Published : 06 Apr 2022 14:06 IST

ముంబయి: తాను నటించిన ఓ చిత్రాన్ని చూసి తన సతీమణి మీరా రాజ్‌పుత్‌ తనను వదిలేస్తానని బెదిరించిందని నటుడు షాహిద్‌ కపూర్‌ తెలిపారు. కెరీర్‌లో వరుస పరాజయాలు చవిచూసిన షాహిద్‌ ‘అర్జున్‌ రెడ్డి’ రీమేక్‌గా వచ్చిన ‘కబీర్‌సింగ్‌’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. ఆ సినిమా విజయం తర్వాత కథల ఎంపికలో ఆయన ఆచితూచి అడుగులువేస్తున్నారు. అలా, ఆయన నటించిన సరికొత్త చిత్రం ‘జెర్సీ’. తెలుగు ‘జెర్సీ’కి రీమేక్‌గా ఇది సిద్ధమైంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో షాహిద్‌ బిజీగా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌తో సరదాగా ముచ్చటించారు. ‘జెర్సీ’ చిత్రానికి తాను వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యానని, కొన్ని సన్నివేశాలు షూట్‌ చేస్తున్నప్పుడు భావోద్వేగానికి లోనయ్యానని అన్నారు. అనంతరం తన సతీమణి మీరా గురించి మాట్లాడుతూ..

‘‘మీరా సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాదు. పరిశ్రమ తనకు కొత్త. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. మాకు పెళ్లైన సమయంలోనే నేను నటించిన ‘ఉడ్తాపంజాబ్‌’ విడుదలకు సిద్ధమైంది. విడుదలకు ముందు నటీనటుల కోసం ఎడిటింగ్‌ రూమ్‌లో స్పెషల్‌ షో వేశారు. నాతోపాటు మీరానీ అక్కడికి తీసుకువెళ్లాను. సినిమా ప్రారంభమైన తర్వాత కాసేపు మీరా నాతో మామూలుగానే ఉంది. కానీ, విరామ షాట్‌ పడగానే నేను తన ముఖం వైపు చూసి నవ్వాను. తను వెంటనే నా పక్క నుంచి లేచి వెళ్లిపోయి దూరంగా నిల్చుంది. తను ఎందుకలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కాలేదు. ‘‘మీరా ఏమైంది? ఎందుకు నా నుంచి దూరంగా వెళ్లిపోయి అక్కడెక్కడో నిల్చున్నావు?’’ అని ప్రశ్నించాను. దానికి తను.. ‘‘నువ్వు ఇలాంటి వాడివా? నీకిలాంటి అలవాట్లు ఉన్నాయా? నీతో నేనింకా కలిసి ఉండలేను. నేను వెళ్లిపోతా’’ అని చెప్పింది. ఆ మాటలకు నేను షాకయ్యా. అదంతా సినిమా మాత్రమేనని తనకు అర్థమయ్యేలా చెప్పాను. నా మాటలతో తను కాస్త నెమ్మదించింది. ఆ సంఘటన నేను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని షాహిద్‌ చెప్పుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని