Jersey: షాహిద్‌ కపూర్‌ జెర్సీకి మరో అడ్డంకి.. కోర్టును ఆశ్రయించిన రచయిత

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌కపూర్‌ నటించిన జెర్సీ సినిమాకు మరో అడ్డంకి ఎదురైంది. ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ కథకు సంబంధించిన కాపీరైట్స్‌ విషయంలో రైటర్‌ రూపేశ్‌ జైశ్వల్‌ కోర్టును ఆశ్రయించాడు.

Published : 13 Apr 2022 12:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌కపూర్‌ నటించిన జెర్సీ సినిమాకు మరో అడ్డంకి ఎదురైంది. ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా కథకు సంబంధించిన కాపీరైట్స్‌ విషయంలో రచయిత రూపేశ్‌ జైశ్వల్‌ కోర్టును ఆశ్రయించారు. 2007లో ఈ కథకు సంబంధించిన కాపీరైట్స్‌ను మాజీ ఫిలిం రైటర్స్ అసోసియేషన్‌లో ‘ది వాల్’ అనే పేరుతో స్క్రిప్ట్‌ను రిజిస్టర్ చేసుకున్నట్లు జైశ్వల్ చెప్పారు. దీనిని ఇప్పుడు స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్‌గా పిలుస్తున్నారని ఆయన వివరించారు. ఆయన రాసిన కథంతా ఓ యువకుడి పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుందని, పూర్తి క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో కుటుంబ ప్రేమ, ఆప్యాయత, సంకల్పం, నిస్సందేహమైన ఆశయం మొదలైనవి ప్రాథమిక అంశాలుగా ఉంటాయని అన్నారు. తన కథలో ఎన్నో మార్పులు చేశారని తనకు తెలియకుండా స్క్రిప్ట్‌ను తీసుకున్నారంటూ కోర్టులో దావా వేశారు. ‘నాకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తూ ప్రతివాదులు అన్యాయంగా డబ్బును సంపాదిస్తున్నారు’ అని ఆ దావాలో పేర్కొన్నారు.

తనను మోసం చేసి మూడో వ్యక్తి ద్వారా స్క్రిప్ట్‌ను పొందారని ఈ విషయంలో ఒకరితో ఒకరు కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. హిందీ చిత్రం జెర్సీని థియేటర్‌లలో లేదా మరేదైనా డిజిటల్‌ మాధ్యమాల్లో  విడుదల చేయడంపై నిషేధం విధించాలని ఆయన కోర్టును కోరారు. కనీసం ఈ తీర్పు వచ్చేవరకూ సినిమా విడుదల ఆపాలని విజ్ఞప్తి చేశారు.

2019లో తెలుగులో నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాను  హిందీలో అదే పేరుతో రీమేక్‌ చేశారు. ఇందులో షాహిద్‌కపూర్‌ హీరోగా నటించారు. ఏప్రిల్‌ 14న థియేటర్లలోకి రావాల్సి ఉండగా యశ్‌ నటించిన ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌2’ కారణంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 22కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని