ఓటీటీలో ప్రత్యక్ష్యమవనున్న ‘షంషేరా’.. ఎప్పుడంటే?

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌కపూర్‌(Ranbir Kapoor) ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘షంషేరా’(Shamshera). చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్‌ యాక్షన్‌ చిత్రంలో...

Published : 19 Aug 2022 21:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor) ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘షంషేరా’(Shamshera). చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్‌ యాక్షన్‌ చిత్రంలో సంజయ్‌దత్ (Sanjay Dutt)‌, వాణీకపూర్‌(Vaani Kapoor) నటించారు. కరణ్‌ మల్హోత్ర(Karan Malhotra) దర్శకత్వం వహించిన ఈ సినిమా గత నెల (జులై)22న థియేటర్లలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలయ్యింది. మంచి చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం కలెక్షన్ల పరంగా మాత్రం నిరాశపరిచింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర దించుతూ ఆగస్టు19న అమెజాన్‌ ప్రైం వేదికగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ అమెజాన్‌ ప్రైం ఓటీటీ విడుదల చేసింది.

కథేంటంటే...?
 మొఘల్‌ల పాలనలో రాజ్‌పుత్‌ల తరఫున పోరాడిన ఒక తెగ వారు మొఘల్‌లు గెలవడంతో వేరే ప్రాంతానికి వెళ్లిపోవాల్సి వస్తుంది. అక్కడ ఉన్న జాట్‌లు వీరిని బానిసలుగా చూస్తారు. ఇదే తెగకు చెందిన షంషేరా (రణ్‌బీర్ కపూర్) బందిపోటుగా ధనికులను దోచుకుంటూ, పేదవారిని సంరక్షిస్తూ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ ఉంటాడు. శుద్ధ్ సింగ్ (సంజయ్ దత్) వీరికి స్వాతంత్రం కల్పిస్తామని మోసం చేసి ఒక కోటలో బంధించి మరింత దారుణంగా హింసిస్తాడు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన షంషేరాపై ద్రోహి అనే ముద్ర వేసి రాళ్లతో కొట్టి చంపేస్తారు. 25 సంవత్సరాల తర్వాత అతని కొడుకు బల్లి (రణ్‌బీర్ కపూర్) నిజం తెలుసుకుని తండ్రి చావుకు పగ తీర్చుకోవాలని, తన వారికి స్వాతంత్రం కల్పించాలని పోరాడతాడు. మరి బల్లి తన లక్ష్యాన్ని సాధించాడా? ఈ దారిలో తనేం కోల్పోయాడు? కథానాయిక వాణీకపూర్‌ పాత్ర ఏంటి? వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని