Writer Padmabhushan: వినోదాలు పంచే ‘రైటర్‌ పద్మభూషణ్‌’

‘‘నా దృష్టిలో రచయితే అన్నింటికీ మూలం. ఎంత బడ్జెట్‌ పెట్టినా మొదట కథ రాయాల్సింది అతనే. అలాంటి ఓ రచయిత ప్రయాణాన్నే మా ‘రైటర్‌ పద్మభూషణ్‌’లో చూపించాం’’ అన్నారు షణ్ముఖ ప్రశాంత్‌.

Updated : 25 Jan 2023 07:01 IST

‘‘నా దృష్టిలో రచయితే అన్నింటికీ మూలం. ఎంత బడ్జెట్‌ పెట్టినా మొదట కథ రాయాల్సింది అతనే. అలాంటి ఓ రచయిత ప్రయాణాన్నే మా ‘రైటర్‌ పద్మభూషణ్‌’ (Writer Padmabhushan)లో చూపించాం’’ అన్నారు షణ్ముఖ ప్రశాంత్(Shanmukha Prasanth). ఆయనకిది దర్శకుడిగా తొలి చిత్రం. సుహాస్‌ (Suhas) హీరోగా నటించారు. టీనా శిల్పరాజ్‌ (Tina) కథానాయిక. ఈ సినిమా ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు దర్శకుడు ప్రశాంత్‌.

‘‘ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రమే. అలాగని వేడుకలు, చుట్టాలు.. ఇలాంటి మెలో డ్రామాలా ఉండదు. మన ఇంట్లో జరిగే కథలాగే ఉంటుంది. ఒక కొత్త కథ చెప్పాలనే ఆలోచన నుంచి ఈ స్క్రిప్ట్‌ పుట్టింది. ఇందులో హీరో పాత్ర పేరు పద్మభూషణ్‌ (Padmabhushan). తనొక లైబ్రేరియన్‌. ఓ రచయిత కావాలని అనుకుంటాడు. మరి తను అనుకున్నది ఎలా సాధించాడు.. ఈ ప్రయాణం ఎలా సాగింది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి’’.

* ‘‘సుహాస్‌ (Suhas)తో సినిమా అంటే కథే బలంగా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశా. విజయవాడలో ఉండే ఓ మధ్యతరగతి కుర్రాడి జర్నీ ఇది. తనకొక కుటుంబం.. ప్రేమించే అమ్మాయి ఉంటుంది. అయితే తను ఏం కావాలనుకున్నాడు.. చివరికి ఏమయ్యాడు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’.

* ‘‘నాకు కామెడీ చాలా ఇష్టం. నా బలం కూడా అదే. ఈ చిత్రంలో చాలా మంచి వినోదం ఉంది. ఆశిష్‌ విద్యార్థి పాత్ర చాలా వైవిధ్యభరితంగా ఉంటుంది. రోహిణి, గోపరాజు రమణ ఇలా చాలా మంది మంచి నటులు చేశారు. నాయిక శిల్పారాజ్‌, గౌరీ ప్రియ చాలా అద్భుతంగా చేశారు’’.

* ‘‘మాది విజయవాడ. అక్కడే బీటెక్‌ పూర్తి చేసి హైదరాబాద్‌కు వచ్చా. ఆరంభంలో కొందరి దగ్గర రచయితగా పని చేశా. బాగా రాస్తున్నానని మెచ్చుకునే వారు కానీ, ఏం ఇచ్చేవారు కాదు (నవ్వుతూ). అయితే వారి మాటలు నాపై నమ్మకాన్ని పెంచేవి. సుహాస్‌తో షార్ట్‌ఫిల్మ్స్‌ రోజుల నుంచి పరిచయం. ఆయన ‘కలర్‌ఫొటో’కు సహాయ దర్శకుడిగా.. ‘ఫ్యామిలీడ్రామా’కు రచయితగా పని చేశా. ఇప్పుడీ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నా’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని