Aadavallu Meeku Johaarlu: అంతకుమించి ఇప్పుడేం చెప్పలేను: శర్వానంద్‌

‘‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో పాత శర్వాను చూస్తారు’ అని యువ నటుడు శర్వానంద్‌ అన్నారు.

Published : 15 Feb 2022 18:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో ప్రేక్షకులు పాత శర్వాను చూస్తారు’ అని యువ నటుడు శర్వానంద్‌ అన్నారు. ఈయన హీరోగా దర్శకుడు కిశోర్‌ తిరుమల తెరకెక్కించిన చిత్రమిది. రష్మిక కథానాయిక. రాధికా, ఖుష్బూ, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషించారు. చెరుకూరి సుధాకర్‌ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ను చిత్ర బృందం మంగళవారం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా శర్వానంద్‌ మాట్లాడుతూ.. ‘‘శతమానం భవతి’, ‘మహానుభావుడు’లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాల్లో నటించట్లేదేంటి? అని చాలామంది నన్ను అడిగారు. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’తో దానికి సమాధానం లభిస్తుందని భావిస్తున్నా. ఈ చిత్రంలో నా నుంచి మీరు కోరుకునేవన్నీ ఉంటాయి. మళ్లీ పాత శర్వాను చూస్తారు. ఓ మంచి సినిమా చూశామన్న ఫీలింగ్‌తో థియేటర్‌ నుంచి ఇంటికి వెళ్తారు. అంతకుమించి ఈ సినిమా గురించి ప్రస్తుతానికి ఏం చెప్పలేను. త్వరలో నిర్వహించే ఈవెంట్లలో మాట్లాడతాను. రాధికా, ఖుష్బూ, ఊర్వశి లాంటి సీనియర్‌ నటీమణులతో నటించటం ఎంతో ఆనందంగా ఉంది. వారి నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొన్నా. రష్మిక చాలా అద్భుతమైన నటి. ‘పుష్ప’ సినిమా చేస్తూనే ఈ చిత్రంలోనూ నటించింది. అయినా ఎప్పుడూ సెట్‌కు ఆలస్యంగా వచ్చేది కాదు. ఇంత మంచి స్క్రిప్టును నాకు ఇచ్చినందుకు దర్శకుడు కిశోర్‌గారికి థ్యాంక్స్‌. షూటింగ్‌ అంతా చాలా సరదాగా సాగింది’’ అని తెలిపారు.

‘‘దర్శకుడు కిశోర్‌గారు ఈ సినిమా కథ చెప్తున్నపుడే బాగా నవ్వొచ్చింది. అంతమంచి ఎంటర్‌టైనర్‌ ఇది. సెట్‌కి వెళ్లినపుడు, నటించేటపుడు, డబ్బింగ్‌ చెప్పేటపుడు.. ఇలా ప్రతి దశలోనూ నవ్వుతూనే ఉన్నా. ఈ చిత్రంలో నటించిన సీనియర్‌ నటులు, సాంకేతిక నిపుణుల్లో ఏ ఒక్కరు లేకపోయినా ఈ చిత్రం ఉండేది కాదు. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నా’’ అని కథానాయిక రష్మిక చెప్పింది. ఈ కార్యక్రమంలో రాధికా, ఖుష్బూ, చిత్ర దర్శకుడు తదితరులు పాల్గొన్నారు. 






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు