
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ గురించి ఆ వార్తలన్నీ అబద్ధం: శివ
హైదరాబాద్: విజయ్ దేవరకొండ- శివ నిర్వాణ కాంబినేషన్లో ఓ సినిమా అనౌన్స్ అయ్యింది గుర్తుందా. విజయ్ ‘లైగర్’ పనుల్లో బిజీగా ఉండటంతో శివ సినిమా ముచ్చట్లే కనిపించలేదు. కానీ ‘టక్ జగదీశ్’ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో... విజయ్ - శివ సినిమా మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ‘టక్ జగదీశ్’ ఫలితం చూసి శివతో ప్రాజెక్ట్ ముందుకు తీసుకువెళ్లేందుకు విజయ్ దేవరకొండ ఆలోచనలో పడ్డారనేది ఆ చర్చల సారాంశం. తాజాగా వీటిపై శివ నిర్వాణ స్పందించారు.
విజయ్‌తో సినిమా విషయంలో వస్తున్న పుకార్లన్నీ అవాస్తవం. మా సినిమా పక్కాగా ఉంటుంది అంటూ తేల్చి చెప్పారు శివ నిర్వాణ. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. శివ ప్రేమకథలో విజయ్ను చూడొచ్చని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సున్నితమైన ప్రేమకథా చిత్రాలతో దర్శకుడిగా హిట్ అందుకున్నారు శివ నిర్వాణ. ఆ సమయంలో విజయ్ దేవరకొండ సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. కానీ ‘టక్ జగదీశ్’కి అనుకున్న స్థాయి స్పందన రాకపోవడంతో శివ సినిమాను విజయ్ వద్దనుకుంటున్నారని పుకార్లు షికార్లు చేశాయి. అంతేకాదు ఆ స్థానంలో వెంకటేశ్‌తో శివ సినిమా చేస్తున్నారనీ అనుకున్నారు. ఇప్పుడు శివ మొత్తం విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
మరోవైపు ‘లైగర్’తో అభిమానులను అలరించేందుకు సన్నద్ధమవుతున్నారు విజయ్ దేవరకొండ. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా చిత్రీకరణలోనే ఆయన గత కొన్నేళ్లుగా నిమగ్నమయ్యారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే విజయ్ తదుపరి ప్రాజెక్ట్‌లను ఒక్కొక్కటిగా పట్టాలెక్కించనున్నారు. గతంలో ప్రకటించిన లైనప్ ప్రకారం అయితే సుకుమార్‌తో కూడా విజయ్ ఓ సినిమా చేయాలి. మొన్న ఆ విషయాన్ని గుర్తు చేస్తూ 2023లో అదరగొట్టేద్దాం అంటూ సుకుమార్‌ను ఉద్దేశించి ట్వీట్ కూడా చేశారు. దీంతో ‘లైగర్’ తర్వాత విజయ్ ఏ సినిమా చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. సుకుమార్‌కి ఓటేస్తారా? లేక శివ నిర్వాణకే అనే క్లారిటీ విజయ్ నుంచి రావాలి.