
Shraddha Kapoor: పెళ్లి పెద్దగా మారి ఫ్రెండ్ వివాహం జరిపించిన శ్రద్ధాకపూర్
వైరల్‌గా మరిన వీడియో
ముంబయి: నటుడు శక్తికపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం బాలీవుడ్ లక్కీలేడీగా పేరు తెచ్చుకున్నారు నటి శ్రద్ధా కపూర్. వరుస ప్రేమ కథా చిత్రాలతో అలరిస్తోన్న ఈ బ్యూటీ.. ‘సాహో’తో తెలుగువారికీ సుపరిచితురాలైంది. ప్రస్తుతం లవ్ రంజన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటిస్తోంది. తాజాగా తన స్నేహితురాలి వివాహం కోసం పెళ్లి పెద్దగా మారి.. దగ్గరుండి వివాహం జరిపించారు.
శ్రద్ధానాయక్ అనే మేకప్ ఆర్టిస్ట్ గత కొన్నేళ్ల నుంచి నటి శ్రద్ధాకపూర్‌కు వ్యక్తిగత మేకప్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. దీంతో శ్రద్ధాకపూర్‌తో ఆమెకు స్నేహం పెరిగింది. ఈ క్రమంలోనే ఇటీవల శ్రద్ధానాయక్ తన చిన్ననాటి స్నేహితుడు రిచీని వివాహమాడారు. అయితే, వివాహ సమయంలో పెళ్లి వేదికపై శ్రద్ధాకపూర్ పెద్దగా వ్యవహరించారు. ‘‘ఈ పెళ్లి చేసుకోవడం మీకు సమ్మతమేనా?’’ అని వధూవరులను ప్రశ్నించారు. వధూవరులిద్దరూ అంగీకారం తెలపడంతో ‘‘ఇక మీరు వధువును ముద్దాడవచ్చు’’ అంటూ నవ్వులు పూయించారు. దీనికి సంబంధించిన వీడియోను శ్రద్ధానాయక్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. పెళ్లి పెద్దగా వ్యవహరించిన తన మిత్రురాలికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.