Shruti Haasan: వణికించే చలిలో చీరకట్టుకుని డ్యాన్స్‌.. మరోసారి చేయాలనుకోవట్లేదు: శ్రుతి హాసన్‌

‘వాల్తేరు వీరయ్య’లోని రొమాంటిక్‌ డ్యూయెట్‌ సాంగ్‌ ‘శ్రీదేవి-చిరంజీవి’ షూట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి శ్రుతి హాసన్‌. మైనస్‌ డిగ్రీల చలిలో ఆ పాట షూట్‌లో పాల్గొనడం ఎంతో కష్టంగా అనిపించిందని ఆమె చెప్పారు. 

Updated : 04 Jan 2023 10:02 IST

హైదరాబాద్‌: ‘వాల్తేరు వీరయ్య’లోని (Waltair Veerayya) ‘శ్రీదేవి - చిరంజీవి’ పాట షూట్‌ను తాను ఏ మాత్రం ఎంజాయ్‌ చేయలేదని నటి శ్రుతిహాసన్‌ (Shruti Haasan) అన్నారు. మంచులో చీర కట్టుకుని డ్యాన్స్ చేయడం ఎంతో అసౌకర్యంగా అనిపించిందన్నారు. ‘ఈ పాట నాకెంతో నచ్చినప్పటికీ, చిత్రీకరణను పూర్తిగా ఆస్వాదించలేకపోయాను. నిజాయతీగా చెప్పాలంటే మరోసారి ఇలా చీర ధరించి మంచులో ఉండే పాట చేయకూడదని భావిస్తున్నా. ఎందుకంటే, ఇది కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. నాకు తెలిసినంత వరకూ ప్రేక్షకులు ఇలాంటివి చూడటానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఈ తరహాలో షూట్‌ చేయాల్సి వస్తోంది. అంతేకానీ, ఒక మహిళకు ఇలాంటివి అసౌకర్యంగా ఉంటాయి’’ అని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఇదే విషయాన్ని ఆ పాట విడుదల సమయంలో చిరంజీవి వెల్లడించిన విషయం తెలిసిందే. మైనస్‌ డిగ్రీల చలిలో పాట షూట్‌ చేయడంతో శ్రుతిహాసన్‌ ఇబ్బంది పడిందని ఆయన ఇటీవల చెప్పారు.

తాను కథానాయికగా నటించిన రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లూ ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా విడుదల కావడంపై స్పందిస్తూ.. ‘‘ఇద్దరు అగ్రహీరోల సినిమాల్లో నటించడం.. అవి రెండూ ఒకేసారి విడుదల కావడం.. ఎంతో ఆనందంగా ఉంది. అవి రెండూ ఒకేసారి విడుదలవుతున్నందుకు ఏమాత్రం భయం లేదు. సెట్‌లో ఉన్నంతసేపు ఎంతో కష్టపడి మా వంతు శ్రమించాం. మంచి ఫలితాలే వస్తాయని భావిస్తున్నాం’’ అని వివరించారు.

‘క్రాక్‌’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు శ్రుతి హాసన్‌. ఆ సినిమా విజయం తర్వాత ఆమె తెలుగులో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో ఆమె కథానాయికగా నటించారు. ‘వాల్తేరు వీరయ్య’కు బాబీ దర్శకత్వం వహించగా.. ‘వీర సింహారెడ్డి’కి గోపీచంద్‌ మలినేని డైరెక్టర్‌గా వ్యవహరించారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపైనే ఈ రెండు ప్రాజెక్ట్‌లూ నిర్మితమయ్యాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘వీర సింహారెడ్డి’, 13న ‘వాల్తేరు వీరయ్య’ విడుదల కానున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని