Siddharth: నా మాటలను అపార్థం చేసుకున్నారు: సిద్ధార్థ్‌ క్లారిటీ

‘భారతీయుడు 2’ ప్రెస్‌మీట్‌లో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు అపార్థం చేసుకున్నారని నటుడు సిద్ధార్థ్‌ అన్నారు.

Updated : 09 Jul 2024 18:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ నియంత్రణపై అవగాహన కల్పించేలా వీడియోలు చేయాలని సినీ నటులకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Telangana CM Revanth Reddy) ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గుర్తుచేస్తూ నటులకు సామాజిక బాధ్యత ఉందంటారా? అని 'భారతీయుడు 2' (Bharateeyudu 2) టీమ్ ని విలేకరి ప్రశ్నించగా సిద్ధార్థ్ (Siddharth) స్పందించారు. ‘‘నేను 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులకు తెలుసు. సురక్షిత శృంగారం గురించి నేను అవగాహన కల్పించే ప్రయత్నం చేశా. సంబంధిత హోర్డింగ్స్‌ 2005 నుంచి 2011 వరకు ఆంధ్రప్రదేశ్‌లో కనిపించేవి. అది నా బాధ్యత. ప్రతి నటుడూ సామాజిక బాధ్యత కలిగి ఉంటాడు’’ అని సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యలపై నెట్టింట చర్చ జరుగుతోంది. సిద్ధార్ధ్‌ వైఖరిని పలువురు నెటిజన్లు తప్పుబట్టారు. దీనిపై నటుడు స్పందించారు. తాను ఓ కోణంలో చెబితే దాన్ని కొందరు మరో కోణంలో చిత్రీకరించారని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా వీడియో పోస్ట్‌ చేశారు.  

‘భారతీయుడు 2’ప్రెస్‌మీట్‌ ముఖ్యాంశాలు

‘‘భారతీయుడు 2’ ప్రెస్‌మీట్‌లో ఓ ప్రశ్నకు నేనిచ్చిన సమాధానాన్ని కొందరు అపార్థం చేసుకున్నారు. దాన్ని నేను క్లియర్‌ చేయాలనుకుంటున్నా. డ్రగ్స్‌పై పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) గారికి నా పూర్తి మద్దతిస్తా. మెరుగైన సమాజం కోసం డ్రగ్స్‌ కట్టడికి చిత్ర పరిశ్రమ (Film Industry) తన వంతు కృషి చేయాలని సీఎం సూచించారు. మన పిల్లల భవిష్యత్తు వారి చేతుల్లోనే కాకుండా మన చేతుల్లోనూ ఉంది. ఇప్పటి వరకూ పలు సామాజిక కార్యక్రమాలను నేను సపోర్ట్‌ చేశా. సీఎం సర్‌.. మేం ఎప్పుడూ మీతోనే’’ అని పేర్కొన్నారు.

కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం భారతీయుడు 2. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 12 న సినిమా (Movie Releases) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్, సోమవారం.. ప్రెస్ మీట్ నిర్వచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని