Siddharth: సామాన్యులు ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటే ఏంటి పరిస్థితి..?: సిద్ధార్థ్‌

మధురై ఎయిర్‌పోర్టులో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి నటుడు సిద్ధార్థ్‌ సోషల్‌ మీడియాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు.

Published : 29 Dec 2022 16:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌‌: మధురై విమానాశ్రయంలో తన కుటుంబానికి ఎదురైన చేదు అనుభవంపై నటుడు సిద్ధార్థ్‌ మరోసారి స్పందించారు. సి.ఐ.ఎస్‌.ఎఫ్‌ సిబ్బంది తన ఫ్యామిలీని వేధింపులకు గురి చేసిందంటూ ఆయన బుధవారం సోషల్‌ మీడియా వేదికగా తెలిపిన సంగతి తెలిసిందే. తనకు మద్దతు పలికిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ ‘సామాన్యులు ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటే ఏంటి పరిస్థితి..?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు. ఎన్నోసార్లు మధురై ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణాలు సాగించానన్న సిద్ధార్థ్‌ తొలిసారి ఊహించని ఘటన ఎదురైందని పేర్కొన్నారు.

‘‘ఇటీవల నా కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చింది. వయసు పైబడిన వారు, చిన్నపిల్లలతో మా కుటుంబమంతా కలిసి మధురై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాం. ఆ సమయంలో ప్రయాణికులు ఎక్కువగా లేకపోవడంతో సెక్యురిటీ లైన్‌ ఖాళీగా ఉంది. సెక్యురిటీ చెక్‌ కోసం మేం లైన్‌లోకి వెళ్లగానే సి.ఐ.ఎస్‌.ఎఫ్‌. సిబ్బందిలోని ఒకరు మా ఐడీలను తదేకంగా పరిశీలించారు. నా ఆధార్‌ కార్డు తీసుకుని అనుమానంగా చూస్తూ ‘‘ఇది మీరేనా’’ అని గట్టిగా కేకలు వేశారు. ‘‘ఎందుకు అలా ప్రశ్నిస్తున్నారు?’’ అని అడగ్గా తనకి ఏదో అనుమానం ఉన్నట్లు చెప్పారు. అనంతరం మరో అధికారి వచ్చి.. మా బ్యాగ్‌లు చెక్‌ చేశారు.  ‘‘ఎందుకు ఇలా చేస్తున్నారు?’’ అని ప్రశ్నించగా.. ‘‘ఇది మధురై ఎయిర్‌పోర్ట్‌. ఇక్కడ ఇలాంటి రూల్స్‌ మాత్రమే ఉంటాయి’’ అని కసురుకుంటూ బదులిచ్చారు. మా అమ్మ పర్స్‌లో నాణేలు ఉన్నాయని తెలుసుకుని అన్నింటినీ బయటకు తీయమని గట్టిగా చెప్పారు. 70 ఏళ్ల మహిళతో ఇలా దురుసుగా ప్రవర్తించడం ఎంతవరకు సబబు? మా అక్క బ్యాగ్‌లో ఉన్న సిరంజీలు చూసి ఇవి ఎందుకు? ఎవరికి అనారోగ్యం ఉంది? ఏంటి సమస్య? అని అందరి ఎదుట ప్రశ్నించారు. ఒకరి వ్యక్తిగత సమస్యను అందరి ఎదుట ఎలా బయటపెట్టాలని చూస్తారు?’’

‘‘ఈ ఘటనలతో విసిగిపోయిన నేను పై అధికారిని పిలమవని అడిగాను. దాంతో ఓ అధికారి నా వద్దకు వచ్చారు. వెంటనే నేను మాస్క్‌ తీసి మాట్లాడాను. ఆయన నన్ను గుర్తుపట్టి.. ‘‘సర్‌ నేను మీకు పెద్ద అభిమానిని’’ అని చెప్పారు. జరిగిన దానికి చింతిస్తున్నానని, క్షమాపణలు తెలిపారు. ‘‘ఇది సరైన పద్ధతి కాదు. నన్ను అభిమానిస్తున్నారు కాబట్టి క్షమాపణలు చెప్పారు. మరి, సాధారణ ప్రజలకు ఇలాంటి వేధింపులే ఎదురైతే ఏంటి పరిస్థితి?’’ అని అడిగి వచ్చేశా’’ అని సిద్ధార్థ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని