Updated : 13 May 2021 13:04 IST

Rangam: శింబు - కార్తిక ఫొటోలు వైరల్‌

ఫొటో షూట్‌ ఓకే కానీ... అసలేమైంది

చెన్నై: హీరోగా జీవాను తెలుగువారికి ఎంతగానో చేరువ చేసిన చిత్రం ‘రంగం’. కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహించిన ‘కో’ అనే కోలీవుడ్‌ చిత్రాన్ని తెలుగులో ‘రంగం’ పేరుతో విడుదల చేశారు. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2011లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకొంది. అయితే ఈ సినిమాలో మొదట శింబుని హీరోగా తీసుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో షూట్‌ ప్రారంభం కానుందనగా శింబు-కార్తికలపై ఫొటోషూట్స్‌ కూడా పూర్తి చేశారు. సినిమాలో చూపించే బాంబుదాడికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే మరికొన్నిరోజుల్లో ఒరిజినల్‌ షూట్‌ పట్టాలెక్కనుందనగా అనుకోని కారణాల వల్ల శింబు ‘కో’ టీమ్‌ నుంచి బయటకు వెళ్లిపోయారు. దాంతో దర్శకుడు ఆనంద్‌.. జీవాని ప్రధాన పాత్రలో తీసుకుని ఆ సినిమా తెరకెక్కించారు. కాగా, ‘కో’ విడుదలైన పదేళ్ల తర్వాత తాజాగా శింబు-కార్తిక ఫొటోషూట్‌లకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ‘కో’లో ఎస్టీఆర్‌(శింబు) అంటూ అందరూ ఆ ఫొటోల్ని షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

అసలు కారణం అదేనా..!

‘కో’ నుంచి శింబు తప్పుకోవడానికి అప్పట్లో ఎన్నో కారణాలు తెరపైకి వచ్చాయి. దర్శకుడితో ఓ విషయంలో విభేదాలు రావడంతోనే శింబు ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగారని చెప్పుకున్నారు. అంతేకాకుండా హీరోయిన్‌ కార్తిక తనకు సరైన జోడీ కాదని భావించిన శింబు.. ఆమె స్థానంలో తమన్నాను కథానాయికగా పెట్టమని చిత్రబృందాన్ని కోరారట. తమన్నాకు భారీగా పారితోషికం చెల్లించాలని.. అంత బడ్జెట్‌ తమవద్ద లేదని నిర్మాతలు చెప్పడంతో చేసేదిలేక శింబునే ఆ ప్రాజెక్ట్‌ వద్దనుకున్నట్లు  కోలీవుడ్‌లో వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.

కలుద్దామనుకున్నారు కానీ..

‘కో’ విడుదలై ఆనంద్‌ కోలీవుడ్‌లో స్టార్‌ డైరెక్టర్‌గా మారారు. ఈ క్రమంలోనే శింబుతో ఏదైనా ప్రాజెక్ట్‌ చేయాలని ఆయన ఆశించారు. శింబు సైతం ఆయనతో సినిమా పట్టాలెక్కించాలని భావించారు. ఈక్రమంలోనే ఆనంద్‌ ఇటీవల శింబుకి ఓ కథ కూడా చెప్పారట. కథ నచ్చడంతో వెంటనే ప్రాజెక్ట్‌ని శింబు ఓకే చేసేశారు. మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటిద్దామనుకున్న సమయంలో అనారోగ్యంతో ఆనంద్‌ కన్నుమూసిన విషయం విధితమే.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts