Singer chinmayi: పెళ్లైన హీరోయిన్లు ఎందుకు నటించకూడదు?

 ‘‘పెళ్లైన హీరోయిన్లు సినిమాల్లో నటించడం’’ అనే అంశంపై గాయని చిన్మయి శ్రీపాద తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు.

Updated : 17 Aug 2022 12:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతంలో తాను ఎదుర్కొన్న కాస్టింగ్‌ కౌచ్‌ గురించి గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద.. మీటూ ఉద్యమం వేదికగా నిర్భయంగా తన గళం విప్పారు. ఈ ఉద్యమమే దేశంలో లైంగిక దాడులకు గురవుతున్న మహిళలు... తమకు జరుగుతున్న అన్యాయాల గురించి బయట ప్రపంచానికి ధైర్యంగా చెప్పుకొనేలా చేసింది. ఇక తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదిక చిన్మయి మరో పోస్ట్‌ పెట్టారు. ‘‘పెళ్లైన హీరోయిన్లు సినిమాల్లో నటించడం’’ అనే అంశంపై తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజు.. నా బంధువుల్లో ఓ వ్యక్తి ‘వివాహం అనంతరం హీరోయిన్లు ఎందుకు సినిమాలు చేయకూడదో వివరించాడు. ఆయనో దర్శకుడు. నా కుటుంబంలోని వ్యక్తులకే నచ్చజెప్పడం నిస్సహాయంగా భావిస్తున్నా. లింగ సమానత్వం గురించి ఎన్నో ఆర్టికల్స్‌ చదివాను. నేనే వాటి గురించి ఎక్కువ చర్చిస్తా కూడా. అలాంటి ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉన్నా. ఎందుకంటే.. ఆయన చేసే వ్యాఖ్యలు విన్నప్పుడు నాలో వచ్చే మొదటి రియాక్షన్‌ కోపమే. ఆ కోపంలో ఏదేదో మాట్లాడేస్తామోనని భయం. మళ్లీ దాని గురించి తర్వాత పశ్చాత్తాపడటం జరుగుతుంది. అంతే కాదు.. వాళ్లంతా చాలా తేలికగ్గా నాపై ‘‘ఫెమినిస్ట్‌ బ్యాచ్‌’’ అనే కామెంట్లు చేస్తారు.

అది విషపూరిత పితృస్వామ్య మనస్తత్వం...

‘‘పెళ్లైన తరువాత ఒక మహిళ హీరోయిన్‌గా నటించకూడదనేది ఒక విషపూరిత పితృస్వామ్య మనస్తత్వం. ఇదంతా ఓ అమ్మాయి.. తాను కన్న కలలు, భవిష్యత్తు, డబ్బు, నిర్ణయాలే కాదు ఆమె శరీరం, గర్భాశయం కూడా పురుషుడికే సొంతమనే విషపూరితమైన మనస్తత్వంలో నుంచి వచ్చింది. పెళ్లైయ్యాక ఒక మగాడు నటించొచ్చు కానీ ఓ ఆడది నటించకూడదనే ఆలోచనలకు సరైన కారణమేమిటో ఆలోచించండి’’

ఆ ముగ్గురు హీరోయిన్లు సరిహద్దును చెరిపేశారు

సినీ ప్రపంచంలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె, టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత.. అలాగే ఇజ్రాయెల్‌ నటి, ముగ్గురు పిల్లలకు అమ్మ అయిన.. గాల్‌ గాల్ గాడోట్‌తో పాటు మరెందరో.. మైలురాయి తరువాత మైలురాయిని సాధించి భారీ అడ్డుకట్టలను తొలగించారు. నిజానికి 1950, 1960ల్లోనే ఇలాంటి ఆలోచనలు లేవు. అందుకు నిదర్శనం అలనాటి మహానటి సావిత్రి. పెళ్లైయాక కూడా విజయవంతమైన నటిగా కొనసాగారు. ‘‘ఒక మగాడి కెరీర్‌లో పెళ్లి అనేది ఎలాంటి ప్రభావం చూపకపోతే మహిళకు కూడా అదే వర్తించాలి.’’ కచ్చితంగా.. నేను గర్వంగా చెప్పుకుంటా నేను ‘‘ఫెమినిస్ట్‌ బ్యాచ్‌’’నే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని