Singer Chinmayi: కవలలకు జన్మనిచ్చిన సింగర్‌ చిన్మయి

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) తల్లయ్యారు. చిన్మయి పండంటి కవలలకు జన్మనిచ్చినట్లు మంగళవారం రాత్రి ఆమె భర్త, నటుడు రాహుల్‌ రవీంద్ర (Rahul Ravidran) సోషల్‌మీడియాలో.....

Updated : 22 Jun 2022 13:38 IST

హైదరాబాద్‌: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) తల్లయ్యారు. చిన్మయి పండంటి కవలలకు జన్మనిచ్చినట్లు మంగళవారం రాత్రి ఆమె భర్త, నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ (Rahul Ravidran) సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. చిన్నారుల చేతులను ఫొటో తీసి, దాన్ని నెట్టింట షేర్‌ చేసిన ఆయన.. ‘‘దృప్త, శర్వస్... మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చిన, జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిథులు’’ అని రాసుకొచ్చారు. రాహుల్‌ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఒకే పరిశ్రమలో వేర్వేరు విభాగాలకు చెందిన ఈ ఇద్దరికీ కామన్‌ ఫ్రెండ్స్‌ వల్ల పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే ప్రేమలో పడిన వీరు.. తమ బంధం గురించి ఇరు కుటుంబాల్లో చెప్పి.. పెద్దల అంగీకారంతో 2014లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

‘అందాల రాక్షసి’ (Andala Rakshasi) చిత్రంతో తెలుగువారికి చేరువయ్యారు నటుడు రాహుల్‌. ఫీల్‌గుడ్‌ ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ని అందుకుంది. రాహుల్‌.. కేవలం హీరోగానే కాకుండా సహాయనటుడిగానూ అలరించారు. ఇటీవల విడుదలైన ‘శ్యామ్‌సింగరాయ్‌’ (Shyam Singha Roy)లో రాహుల్‌ పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ‘చి..ల..సౌ’తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయం సొంతం చేసుకున్నారాయన. ఇక, చెన్నైకు చెందిన చిన్మయి కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో తెరకెక్కిన ఎన్నో చిత్రాలకు మధురమైన పాటలు ఆలపించారు. ముఖ్యంగా నటి సమంతకు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ ఆమె వ్యవహరించారు. సామ్‌ నటించిన పలు చిత్రాల్లో చిన్మయి లవ్లీ సాంగ్స్‌ ఆలపించారు. ‘బాయ్స్‌’, ‘శివాజీ’, ‘ఆరెంజ్‌’, ‘ఏ మాయ చేశావే’, ‘ఊసరవెల్లి’, ‘రంగం’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు’, ‘మజ్ను’, ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’, ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘మజిలీ’, ‘వరుడు కావలెను’ ‘మేజర్‌’, ‘96’ ఇలా ఎన్నో సినిమాలు ఆమెకు గాయనిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని