Singer Kalpana: అన్నీ కోల్పోయి..చనిపోవాలనుకున్నా..: నేపథ్య గాయని కల్పన

సినీ, శాస్త్రీయ సంగీతంలో తన ముద్ర..అనేక ప్రాంతీయ భాషల్లో పాడేందుకు ప్రావీణ్య సంపాదన.. తన చదువు, పాట విజయానికి కారణమని గర్వంగా చెబుతారు..బాలనటిగా దక్షిణ భారతీయ సినిమాల్లో నటించారు

Updated : 25 Jul 2022 09:55 IST

తెలియని మలయాళం పాటల పోటీని నా కూతురు కోసం గెలవాలనుకున్నా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ, శాస్త్రీయ సంగీతంలో తన ముద్ర..అనేక ప్రాంతీయ భాషల్లో పాడేందుకు ప్రావీణ్య సంపాదన.. తన చదువు, పాట విజయానికి కారణమని గర్వంగా చెబుతారు..బాలనటిగా దక్షిణ భారతీయ సినిమాల్లో నటించారు. జీవితంలో ఎదురైన కష్టాలను కూడా ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించిన నేపథ్య గాయని కల్పన బహుముఖ ప్రజ్ఞాశాలి. సకల కళల కలబోత. కల్పన ఈటీవీ చెప్పాలని ఉంది కార్యక్రమానికి అతిథిగా వచ్చి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

సరస్వతీ ప్రదీప్‌: మీకు కల్పన కాకుండా మరో పేరుందట ఏంటది?

కల్పన: ఇండస్ట్రీలో అందరూ రాక్షసి అని పిలుస్తారు. కేవీ మహదేవన్‌ దగ్గర అసిస్టెంటుగా పుహళెంది పని చేశారు. ఆయన్ని అప్పు అని పిలుస్తాం. నాకు 13 ఏళ్ల వయసున్నప్పుడు మా నాన్న అప్పు అంకుల్‌ దగ్గరకు తీసుకెళ్లి ప్రోత్సహించాలని కోరారు. మర్నాడు చెన్నైలోని బాలుగారి స్టూడియోకు వెళ్లాం. నా మొదటి పాట శైలజతో కలిసి తెలుగులోనే పాడాను. రామాయణంలో తాటకికి పాట పాడటంతో నాకు రాక్షసి అని ముద్దు పేరు పెడతానని పుహళెంది అంకుల్‌ చెప్పారు. తర్వాత బాలుగారు..స్నేహితులు ఇలా అందరూ అలాగే ముద్దుగా పిలిచేవారు. 

బాలనటిగా 30 సినిమాల్లో నటించారని విన్నాం. నటన మొదలెడితే అలాగే వెళ్తారు. కానీ మీరు గాయనిగా ఎలా మారారు..?

కల్పన: సినీ కెరీర్‌ ప్రారంభమే బాలనటిగా మొదలయ్యింది. తమిళంలో మూడున్నరేళ్లకే నటించా. తర్వాత మలయాళం, తెలుగులో నటించా. పాటలు ఆరేళ్లలోపే మొదలెట్టాను. వాసూరావు అవకాశం ఇచ్చారు. అమ్మానాన్న ఇద్దరూ కూడా స్టేజీ సింగర్లే కావడంతో వాళ్లతో కలిసి పాడేదాన్ని. సినిమా షూటింగ్‌లకు వాడే లైటింగ్‌ నన్ను ఇబ్బంది పెట్టడంతోనే దాదాపుగా నటించడం మానేశా. మా నాన్న సింగర్‌. కానీ శివాజీ గణేశన్‌లాగా ఆహార్యం ఉంటుంది. అది చూసి దర్శకులు సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చారు. 

సంగీతంలోకి వచ్చిన తర్వాత సినిమాలు, స్టేజీలపై పాడుతున్నారు. ఈ రెండింటికీ తేడా ఉందా..?

కల్పన: నాకు రికార్డింగ్‌ కన్నా స్టేజీలపై పాడటం చాలా ఇష్టం. లైవ్‌ సింగింగ్‌ చాలా నచ్చుతుంది. సింగర్‌ సామర్థ్యం, కష్టం అందులోనే తెలుస్తుంది. 

స్వరాభిషేకం గాయనీగాయకుల పాటలతో సమృద్ధిగా కనిపిస్తోంది..?

కల్పన: వరసగా పాడటం మరిచిపోతున్న దశలో స్వరాభిషేకం ప్రత్యేకంగా నిలిచింది.  ఈ కార్యక్రమం నా వరకు పాటలకు పదును పెట్టుకునే అవకాశం లభించింది. 

దక్షిణ భారతంలో ఎన్నో పాటలు పాడారు. వాటిలో మీ మనసుకు దగ్గరగా ఉండే పాటలేవీ..?

కల్పన: చాలా మంది ఈ ప్రశ్న అడుగుతారు. కానీ, మీరు అనుకున్నట్టుగా ఎవరూ చెప్పరు. ఒకటి, రెండు కాదుకదా.. చాలా ఉంటాయి. మేం కాదు..సంగీత దర్శకులు చెప్పాలి. తెలుగులో భిన్నమైన పాటలు పాడే అవకాశం వచ్చింది. తెలుగు భాషపై పట్టు సాధించడానికి మా నాన్నే కారణం. ఆయన సూచనలతోనే రాణించాను. బాలుగారు నా పాటలకు కొత్త రూపం ఇచ్చారు. ఎప్పటికప్పుడు సూచనలు చేసేవారు. ఎక్కడైనా తప్పు పాడినట్టు తెలిస్తే వెంటనే ఫోన్‌ చేసి సూచనలు చేసేవారు. 

మీ నాన్న, బాలుగారు క్లాస్‌మేట్సా..?

కల్పన: కాదు..కానీ కళాశాల మేట్స్‌..కళాశాల స్థాయిలో జరిగిన పోటీల సందర్భంలో కలిసేవారు. తర్వాత కూడా నాన్నతో కలిసి మ్యూజికల్‌ షోలలో బాలుగారు పాడేవారు. తరచూ ఇంటికి కూడా వచ్చేవారు.

ఎంసీఏ, ఆయుర్వేద మెడిసిన్‌, బీఎడ్‌, ఎంఈడీ, పీహెచ్‌డీ చేస్తానని చెప్పారు. ఇన్ని రకాలుగా ఎలా సాధ్యం..?

కల్పన: నాకు తెలుసుకోవాలనే పిచ్చి ఎక్కువ. పుట్టిన ఊరి నుంచే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. గురువుల ప్రభావం నాపై ఉంది. సిద్ధమెడిసిన్‌ చేశాను. ఇంట్లోనే నాకు, పిల్లలకు వైద్యం చేస్తాను. 

అరబ్‌, స్పానిష్‌, జర్మన్‌, ఇటాలియన్‌, జపాన్‌ ఎందుకు నేర్చుకున్నారు..?

కల్పన: స్పానిష్‌, జర్మన్‌, ఇటాలియన్‌ వెస్ట్రన్‌ సింగింగ్‌ కోసం నేర్చుకున్నా. పాడటం చాలా సులువుగా అబ్బింది. అరబిక్‌లో మంచి సాహిత్యం ఉంది. బాగా తెలుసుకోవచ్చు. అరబిక్‌,తమిళ్‌, తెలుగు, సంస్కృతంలో పట్టు సాధిస్తే అన్ని రకాల పాటలు బాగా పాడొచ్చు. పీహెచ్‌డీ మ్యూజిక్‌, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో చేస్తా. ఎంఏని తెలుగు విశ్వవిద్యాలయంలో చేశా..బాలుగారి కోరిక మేరకు పీహెచ్‌డీ చేయాల్సి ఉంది. 

మీ అంతిమ లక్ష్యం ఏమిటీ..?

కల్పన: చనిపోయేదాకా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. పీహెచ్‌డీలు కాకుండా తొలిసారి మ్యూజిక్‌ కంపోజర్‌గా తమిళ్‌, తెలుగు, హిందీ సినిమాలకు చేస్తున్నా. 

మీ అమ్మాయికి సంగీతం నేర్పిస్తున్నారా...?

కల్పన: నాకు ముగ్గురు అమ్మాయిలు. ఒక అమ్మాయి భరతనాట్యం చేస్తుంది. పెద్దమ్మాయి పాడుతుంది. చదువును బలవంతంగా రుద్దవచ్చు. కానీ ఆర్ట్స్‌ను బలవంతంగా చేయించలేం. అది ప్యాషన్‌గా వాళ్లకు రావాలి. అజ్ఞానంతో వెళ్లి స్టేజీ ఎక్కొద్దని చెప్పా. 

పీబీ శ్రీనివాస్‌తో మీకు మంచి అనుబంధం ఉంది. ఎలా..?

కల్పన: పీబీ శ్రీనివాస్‌ అంకుల్‌ అంటే రోజ్‌మిల్క్‌. లెజెండ్‌ అనే పదానికి అర్హమైన వారు. నన్ను కల్పు అని పిలిచేవారు. అంటే స్టోన్‌ఫ్లవర్‌ అని అర్థమని చెప్పారు. తమిళ్‌లో గజల్‌ చేశారు. నాకు కూడా నేర్పించారు. 

ఓ మహిళగా ఇండస్ట్రీలో ముందుకు వెళ్లాలంటే ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. మీరు ఎలా ఎదుర్కొన్నారు..?

కల్పన: చేసే పనిలో విషయం, నైపుణ్యం ఉండాలి. స్పష్టత చాలా అవసరం. నాలా మరొకరూ ఉంటేనే పోల్చుకోవడం సాధ్యం అవుతుంది. లేకపోతే పోల్చడం సరికాదు. అమ్మాయిలు ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా అధిగమించవచ్చు.

మీరు బిగ్‌బాస్‌లాంటి షోలో పాల్గొన్నారు. ఎలా అనిపించింది..?

కల్పన: కొన్ని అనుకోకుండా నిర్ణయం తీసుకుంటాం. దాంట్లోనూ ఏదో ఒకటి నేర్చుకుంటాం.

డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా చేశారు..? ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకు చెప్పారు..?

కల్పన: డబ్బింగ్‌ చెప్పడం చాలా ఇష్టం. కానీ బాగా కష్టపడ్డాను. గట్టిగా అరవడం, ఏడ్వడానికి చాలా ఇబ్బంది పడ్డా. దీనికంటే పాటలు పాడడమే మంచిదనిపించింది. 

గాయనిగా స్థిరపడిన తర్వాత కూడా ఒక పోటీలో పాల్గొన్నారు. కారణం ఏంటీ..?

కల్పన: 25 ఏళ్లుగా పాడుతున్నా. 2010లో వివాహబంధం ముగిసింది. పాప ఉంది. ఉద్యోగం కూడా లేదు. చనిపోవాలని అనుకున్నా..సింగర్ చిత్రమ్మ నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా..? అంటూ నన్ను మార్చేందుకు ఇక్కడ పోటీ జరుగుతోంది..అందులో పాల్గొను అన్నారు. సరదాగా అంటే నిజంగానే వెళ్లా. అప్పటికి నాకు మలయాళం ఏమీ తెలియదు. కసితో వెళ్లా. నా కూతురు కోసం విల్లా గెలవాలనుకున్నా. ఇండస్ట్రీలో పరువు పోయిందని చాలా మంది మాట్లాడారు. మా తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఎంతో కష్టపడి పోటీ గెలుపొందా. ఈ విషయంలో ఎవరూ సహాయం చేయలేదు. చీకటిలో ఒంటరి పోరాటం చేశా. అది గెలిచిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొంటాననే ధైర్యం వచ్చింది. 

ఇప్పుడు వస్తున్న నటీనటులు, గాయకులకు మీరిచ్చే సూచనలేవీ..?

కల్పన: గురువుల దగ్గర బాగా నేర్చుకోండి. అసూయ రావొద్దు. కష్టపడి పైకి రావాలి. నటించి అవకాశం పొందొద్దు. శ్రమతో విజయాలు సాధించాలి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని