
‘ఊ అంటావా..’ లిరిక్స్ హార్ష్‌గా ఉన్నాయని తెలుసు.. అయినా ఎందుకు పాడానంటే?: సింగర్
ఇంటర్నెట్ డెస్క్: అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో నటి సమంత నర్తించిన ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావ’కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ పాట యూట్యూబ్ ‘టాప్ 100 మ్యూజిక్ వీడియోస్ గ్లోబల్’ లిస్ట్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం ఐదు భాషల్లో ఈ గీతాన్ని విడుదల చేయగా.. హిందీ వెర్షన్‌ను కనికా కపూర్ ఆలపించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన విషయాలను ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
‘‘ఈ పాటకు ఎంత క్రేజీ రెస్పాన్స్ వచ్చిందో అదే స్థాయిలో విమర్శలూ వచ్చాయి. ఈ పాట మాకు ఏమాత్రం నచ్చలేదంటూ ఒకరిద్దరు నాకు మెసేజ్ చేశారు. దానికి ‘ఓకే’ అని రిప్లై ఇచ్చా. నిజానికి పాట లిరిక్స్ కాస్త పరుషంగా ఉన్నాయని నాకూ తెలుసు. అమ్మాయిల కళ్లు, పెదాలు, హిప్స్.. మీదే ఎక్కువగా పాటలు రాస్తుంటారు. అలాంటిది మగాళ్ల మీద అలాంటి పాట ఎందుకు చేయకూడదు చెప్పండి? అదంతా సినిమాలోని కాన్సెప్ట్‌లో భాగంగా ఉన్నదే. అందుకే మేకర్స్ అలా చేశారు’’ అని కనికా కపూర్ అన్నారు. ఈ పాట హిందీ వెర్షన్.. యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ సుమారు 100 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది.