Singer Sunitha: డిప్రెషన్‌లోకి వెళ్లా.. ఆయనే సపోర్ట్‌గా ఉన్నారు: సునీత

వ్యక్తిగతంగా తాను సున్నితమనస్కురాలినని, ఇష్టమైనవారు ఎవరైనా చిన్నమాటంటే కన్నీళ్లు పెట్టుకుంటానని ప్రముఖ గాయని సునీత (Sunitha) అన్నారు....

Updated : 19 Sep 2022 12:59 IST

హైదరాబాద్‌: వ్యక్తిగతంగా తాను సున్నిత మనస్కురాలినని, ఇష్టమైనవారు ఎవరైనా చిన్నమాటంటే కన్నీళ్లు పెట్టుకుంటానని ప్రముఖ గాయని సునీత (Sunitha) అన్నారు. గతంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ కెరీర్‌, కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు అడుగులు వేశానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు.

‘‘ఈ వేళలో’ పాట సక్సెస్‌ అయ్యాక సింగర్‌గా అవకాశాలు వరుస కట్టాయి. అలా, వచ్చిన పాటలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ అవకాశాలు వచ్చాయి. కాకపోతే వాయిస్‌ ఏమైపోతుందోననే భయంతో కొంతకాలం డబ్బింగ్‌పై ఆసక్తి కనబర్చలేదు. 1999లో విడుదలైన ‘పెళ్లిపందిరి’ కోసం మొదటిసారి డబ్బింగ్‌ చెప్పా. ఇప్పటివరకూ.. సౌందర్య, రాశి, నయనతార, కమలినీ ముఖర్జీ, కల్యాణి, లయ, సోనాలిబింద్రే.. ఇలా చెప్పుకొంటూ వెళితే 121 మంది హీరోయిన్లకు వాయిస్‌ అందించా. ‘ఆనంద్‌’ తర్వాత డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా వచ్చిన గుర్తింపు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో ఐశ్వర్యకు కూడా డబ్బింగ్‌ చెప్పా’’

‘‘బాలు గారిని నేను మెంటర్‌గా భావిస్తా. ఆయన అద్భుతమైన వ్యక్తి. నా గురించి ఎవరికీ తెలియని విషయం ఏంటంటే  గతంలో నేను డిప్రెషన్‌లోకి వెళ్లా. అప్పుడు ఆయనే నాకు సపోర్ట్‌గా నిలిచి ధైర్యం చెప్పారు. ప్రతి సమస్యను ఎదుర్కొనే విధంగా నన్ను మార్చారు. ఆయన మరణం దురదృష్టకరం. ప్రతిరోజూ ఆయన మాటల్ని గుర్తు తెచ్చుకుంటున్నా’’

‘ఇక రామ్‌తో నా పెళ్లిపై విమర్శలేవీ నా వరకు రాలేదు. అలాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోను. నేను తీసుకున్న నిర్ణయం మంచిది, చెడ్డది అని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వాళ్లది. ఎవరి నిర్ణయాలు వాళ్లవి. గౌరవించాలనుకుంటే గౌరవిస్తారు. పనిపాట లేని వాళ్లు మాత్రమే ఇలాంటి విమర్శలు చేస్తుంటారు. పక్కవాళ్ల జీవితాల గురించి అనవసరంగా వ్యాఖ్యలు చేసి అమూల్యమైన సమయాన్ని ఎందుకు వృథా చేసుకుంటారో నాకు అర్థం కావడం లేదు. కుటుంబసభ్యులు, పిల్లలు చెప్పడంతో నేను రామ్‌ని పెళ్లి చేసుకున్నా. ప్రస్తుతం నాజీవితం ఎంతో సంతోషంగా ఉంది. నేనింత ప్రశాంతంగా ఉన్నానంటే కారణం రామ్‌’’ అని సునీత వివరించారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts