SIR: ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘సార్‌’

ధనుష్‌(Dhanush), సంయుక్త(Samyuktha) జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘సార్‌’. తాజాగా  ఈసినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ విడుదలైంది.

Published : 12 Mar 2023 13:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ధనుష్‌ (Dhanush) రీసెంట్‌ సూపర్‌హిట్‌ ‘సార్‌’ (SIR). వెంకీ అట్లూరి దర్శకుడు. విద్య గొప్పతనాన్ని, విద్యావ్యవస్థలోని లోటుపాట్లను తెలియజేస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ నెల 17 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలైన ఈసినిమా నెల రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి రానుండటం పట్ల సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కథేంటంటే..!

విద్యను అడ్డుపెట్టుకుని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కోట్లు ఎలా సంపాదించుకుంటున్నారో తెలియజేస్తూ.. ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని చూపిస్తూ ‘సార్‌’  (SIR) చిత్రం తెరకెక్కింది. ఇంజినీరింగ్‌ చదువులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దాన్ని డబ్బుగా మార్చుకోవాలని చూస్తాడు త్రిపాఠి విద్యాసంస్థల అధినేత త్రిపాఠి (సముద్రఖని). ప్రభుత్వ కాలేజీల్లో ప‌నిచేసే అధ్యాప‌కులకు అధిక జీతాల్ని ఆశ‌చూపుతూ త‌న‌వైపు మరల్చుకుంటాడు. దాంతో మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద పిల్లలకి ఆధార‌మైన ప్రభుత్వ కాలేజీలు మూత‌ప‌డ‌తాయి. విద్యార్థులు చదువులు మానేస్తారు. త్రిపాఠి వ్యూహంలో భాగంగా సిరిపురం ప్రభుత్వ జూనియ‌ర్ క‌ళాశాల‌లో చ‌దువు చెప్పడానికి అపాయింట్ అయిన  జూనియ‌ర్ లెక్చర‌ర్‌ బాల‌గంగాధ‌ర తిల‌క్ అలియాస్ బాలు సార్ (ధ‌నుష్‌) ఆ కాలేజీకి వందశాతం ఫలితాలు వచ్చేలా ఎలా కృషి చేశారు. ఆయనకు ఎదురైన సవాళ్లు ఏమిటి? బయాలజీ లెక్చరర్‌ మీనాక్షి (సంయుక్త) ఆయనకు ఎలా సాయం చేసింది..? అనే ఆసక్తికర అంశాలతో ఈసినిమా రూపుదిద్దుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని