Sirf Ek Bandaa Kaafi Hai Review: రివ్యూ: సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై
Sirf Ek Bandaa Kaafi Hai Review: మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రలో నటించిన ‘సిర్ఫ్ ఏక్ బంధా కాఫీ హై’ చిత్రం ఎలా ఉందంటే?
Sirf Ek Bandaa Kaafi Hai Review; చిత్రం: సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై; నటీనటులు: మనోజ్‌బాజ్ పాయ్, సూర్య మోహన్ కులశ్రేష్ట, ప్రియాంక సీతియా, విపిన్ శర్మ, నిఖిల్ పాండే, జైహింద్ కుమార్ తదితరులు; సంగీతం: సంగీత్ సిద్ధార్థ్; సినిమాటోగ్రఫీ: అర్జున్ కక్రీతి; ఎడిటింగ్: సుమీత్ కోటియాన్; రచన: దీపక్ కింగ్రానీ; దర్శకత్వం: అపూర్వ సింగ్ ఖర్కీ; స్ట్రీమింగ్ వేదిక: జీ5
ఇటీవల కాలంలో వరుసగా కోర్ట్‌రూమ్ డ్రామాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. నిజ జీవిత ఘటనల నుంచి కేసులను ఎంచుకొని, తెరపై ఆసక్తికరంగా మలిచేందుకు దర్శక-రచయితలు ప్రయత్నిస్తున్నారు. అలా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిందీ చిత్రమే ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి వచ్చిన స్పందన చూసి, థియేటర్లలోనూ విడుదల చేశారు. విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయింది. తాజాగా తెలుగు ఆడియోనూ జోడించారు. మరి ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది?
కథేంటంటే: దేశంలో లక్షల మంది ఆరాధించే బాబాజీ (సూర్య మోహన్ కులశ్రేష్ట) తనని లైంగింకంగా వేధించాడని ఆరోపిస్తూ మైనర్ బాలిక ‘ను’(అద్రిజా సిన్హా) పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ‘ను’ ఫిర్యాదు మేరకు పోలీసులు బాబాజీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. ‘ను’ తరపున వాదించే లాయర్ డబ్బుకు కక్కుర్తిపడి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తాడు. విషయం తెలిసిన ‘ను’ కుటుంబం పోలీసుల సూచన మేరకు పోక్సో చట్టం గురించి బాగా తెలిసిన న్యాయవాది పి.సి.సోలంకి (మనోజ్ బాజ్‌పాయ్) దగ్గరకు వెళ్తుంది. ‘ను’ తరపున వాదించేందుకు రంగంలోకి దిగిన న్యాయవాది సోలంకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? వాటిని అధిగమించి కేసును ఎలా వాదించాడు? బాబాజీకి శిక్షపడేలా చేశాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే: ‘జై భీమ్’, ‘వకీల్‌సాబ్’ నుంచి ఇటీవల వచ్చిన ‘వ్యవస్థ’ వెబ్‌సిరీస్ వరకూ అనేక కోర్టు రూమ్ డ్రామాలు ప్రేక్షకులను అలరించాయి. ఆ కోవలోనిదే ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. (sirf ek banda kafi hai review) 2013లో ఆశారాం బాపు కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ కేసు ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అపూర్వ సింగ్ ఖర్కీ. ‘ను’ అనే మైనర్ బాలిక తనను బాబాజీ లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ కేసు నమోదు చేయడంతో నేరుగా సినిమాను మొదలు పెట్టేశాడు దర్శకుడు. పరిస్థితులు బాలికకు ప్రతికూలంగా మారుతున్న సమయంలో పి.సి.సోలంకి రంగ ప్రవేశంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ‘ను’ కేసును టేకప్ చేసిన తర్వాత అడ్వకేట్ సోలంకి తన జూనియర్‌తో ఓ డైలాగ్ చెబుతాడు. ‘ఈ కేసు జరిగినన్ని రోజులు ఏ హియరింగ్‌లోనూ నేను ఓడిపోకూడదు. అలా జరిగితే ఆయనకు బెయిల్ వచ్చేస్తుంది. ఒక్కసారి బెయిల్ వస్తే, కేసు మన చేజారిపోయినట్లే’ అంటాడు.
ఒక్కసారి అవకాశం దొరికితే సమాజంలో డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్లు చట్టం నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరన్న విషయాన్ని చాలా చక్కగా చూపించారు దర్శకుడు అపూర్వ సింగ్. కేసును తప్పుదోవ పట్టించేందుకు ‘ను’కు వ్యతిరేకంగా సాక్ష్యాలను సృష్టించడం, బాబాజీ బెయిల్ కోసం దేశంలోనే పెద్ద పెద్ద లాయర్లను తీసుకురావడం, విచారణ సందర్భంగా బాధితురాలిని ఇబ్బంది పెట్టేందుకు దారుణమైన ప్రశ్నలు అడగటం, వాటికి ‘ను’ ధైర్యంగా సమాధానాలు ఇవ్వడం తదితర సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ఈ సందర్భంగా కోర్టులో ఆ లాయర్లకు దీటుగా సోలంకి ప్రతివాదనలు వినిపించడం, ప్రతి విచారణలోనూ బాబాజీ బెయిల్ రాకుండా తానే గెలవడం వంటి సన్నివేశాలను చాలా చక్కగా తీశారు. (sirf ek banda kafi hai review) అయితే, చట్టంలో ఉన్న నియమ, నిబంధనలను ప్రస్తావిస్తూ సోలంకి తన ప్రత్యర్థి లాయర్ల వాదనకు అడ్డుకట్ట వేస్తాడు తప్ప, దాని వెనుక ఏం గ్రౌండ్‌వర్క్ చేశాడన్న దానికి కాస్త సమగ్రంగా చూపిస్తే బాగుండేది. అలాగే కోర్టులో విచారణ సందర్భంగా న్యాయపరిభాషలో చెప్పే క్లాజ్‌లు, సబ్ క్లాజ్‌లు సామాన్య ప్రేక్షకుడికి అర్థం కావు. ఇక తుది తీర్పు రోజున జరిగే విచారణ , పతాక సన్నివేశాలు భావోద్వేగభరితంగా సాగుతాయి. ఈ వీకెండ్‌లో ఒక మంచి కోర్టు రూమ్ డ్రామా చూడాలనుకుంటే ఈ సినిమా ప్రయత్నించవచ్చు. తెలుగు ఆడియో అందుబాటులో ఉంది.
ఎవరెలా చేశారంటే: లాయర్ సోలంకి పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్‌ను తప్ప మరొకరిని ఊహించలేం. సినిమా మొత్తం తన నటనతో భుజాలపై మోశారు. ఒక బిడ్డకు తండ్రిగా, తల్లికి బిడ్డగా సగటు లాయర్ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. కళ్ల ముందే సాక్ష్యులను చంపితే ఒక సామాన్యుడిలా తానూ భయపడిపోతాడు. కేసు విచారణ జరుగుతుండగా కొడుకు కనిపించడం లేదని ఫోన్ వస్తే నిలువెల్లా వణికిపోతాడు. లాయర్‌గా కోర్టులో వాదనలు వినిపించే సమయంలో ఆయన నటన, హావభావాలు సినిమా చూస్తున్న ప్రేక్షకుడి పెదవులపై చిరునవ్వును పూయిస్తాయి. పతాక సన్నివేశాల్లో మనోజ్ నటన హైలైట్. అయితే, ఆయన పాత్రను పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆయన గతమేంటో అసలు చూపించలేదు.
మిగిలిన నటీనటులు ఎవరూ తెలుగు ప్రేక్షకులకు తెలిసిన వాళ్లు కాదు. అయితే, ప్రతి ఒక్కరూ తమ పాత్రకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. అర్జున్ సినిమాటోగ్రఫీ, లైటింగ్ ఎఫెక్ట్ చాలా బాగా తీర్చిదిద్దారు. కోర్టులను కూడా రియలిస్ట్‌గా చూపించారు. సుమీత్ ఎడిటింగ్ బాగుంది. అనవసర సన్నివేశాలు పెద్దగా కనిపించలేదు. సినిమా నిడివి తక్కువే. సంగీత్-సిద్ధార్థ్ రాయ్ సంగీతం ఓకే. దీపక్ కింగ్రానీ రాసిన కథను దర్శకుడు అపూర్వ సింగ్ వాస్తవానికి దగ్గరగా తెరకెక్కించారు. అయితే, కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా జరిగే వాదోపవాదాలను ఇంకాస్త గ్రిప్పింగ్ రాసుకుని ఉంటే బాగుండేది. పాటలు, ఫైట్స్ అంటూ అనవసర సన్నివేశాల జోలికి వెళ్లకపోవడం ప్రేక్షకుడికి కాస్త ఉపశమనం.
- బలాలు
- + మనోజ్ బాజ్‌పాయ్ నటన
- + దర్శకత్వం
- + నిడివి
- బలహీనతలు
- - ఎలాంటి మలుపులు లేకుండా ఫ్లాట్‌గా సాగే కథనం
- చివరిగా: ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’: ఆసక్తికరంగా సాగే కోర్టురూమ్ డ్రామా!
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jailer: రజనీకాంత్ ‘జైలర్’ కథను మరోలా చూపించవచ్చు: పరుచూరి విశ్లేషణ
-
Vikarabad: స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 40 మంది విద్యార్థులు సురక్షితం
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నించనున్న నార్కోటిక్ పోలీసులు
-
సముద్ర తీరంలో 144 సెక్షనా?చంద్రబాబు సైకత శిల్పం వద్ద నిరసన తెలిపిన తెదేపా నేతలపై కేసులు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala : హనుమంత వాహనంపై మలయప్పస్వామి అభయం