Sita Ramam: ‘సీతా రామం’.. గుర్తుండిపోయే చిత్రం

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా హను రాఘవపూడి తెరకెక్కించిన బహుభాషా చిత్రం ‘సీతా రామం’. వైజయంతి మూవీస్‌ సమర్పణలో స్వప్నదత్‌ నిర్మించారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. రష్మిక, సుమంత్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది

Updated : 26 Jun 2022 07:05 IST

దుల్కర్‌ సల్మాన్‌(Dulquer Salmaan) కథానాయకుడిగా హను రాఘవపూడి(Hanu Raghavapudi) తెరకెక్కించిన బహుభాషా చిత్రం ‘సీతా రామం’(Sita Ramam). వైజయంతి మూవీస్‌ సమర్పణలో స్వప్నదత్‌ నిర్మించారు. మృణాల్‌ ఠాకూర్‌(Mrunal Thakur) కథానాయిక. రష్మిక(Rashmika), సుమంత్‌(Sumanth) కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో టీజర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ.. ‘‘టీజర్‌ అందరికీ నచ్చిందనుకుంటున్నా. చాలా గొప్ప కథ ఇది. ప్రేమకథతో పాటు యుద్ధం లాంటి సంఘర్షణ కనిపిస్తుంది. నాకెంతో గుర్తుండిపోయే చిత్రమిది. దీన్ని తెరకెక్కించడం ఎంతో సవాల్‌గా అనిపించింది. ఎన్నో అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. అంతకు ముందెప్పుడూ చూడని అందమైన ప్రాంతాల్ని ఈ సినిమా వల్ల చూశా. విశాల్‌ అద్భుతమైన సంగీతమందించారు’’ అన్నారు. ‘‘సినిమా చాలా అందంగా వచ్చింది. తొలిసారి దుల్కర్‌తో పని చేశా. హనుతో రెండో చిత్రమిది. ఇంత మంచి చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌. హను రాఘవపూడి మాట్లాడుతూ.. ‘‘చాలా గొప్ప ప్రేమకథ ఇది. ఎంతో మ్యాజికల్‌గా ఉంటుంది. ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతి అందించడం కోసమే కొన్ని వందల మంది రెండేళ్ల పాటు కష్టపడ్డారు. దుల్కర్‌ నుంచి మీరెంత ఆశించినా పర్లేదు. తను ఇప్పటి వరకు మంచి కంటెంట్‌ ఇస్తూనే ఉన్నాడు. ఈ సినిమాలో లెఫ్టినెంట్‌ రామ్‌గా తనని చాలా ప్రేమిస్తారు. మైనస్‌ 24డిగ్రీల సెల్సియస్‌లోనూ షూట్‌ చేశాం. దుల్కర్‌, స్వప్న దత్‌ల సహకారం వల్లే ఇది సాధ్యమైంది. సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘మహానటి’ తర్వాత నేనెంతో ఆచితూచి ఎంపిక చేసి దుల్కర్‌కు పంపిన కథ ఇది. స్క్రిప్ట్‌ విన్న వెంటనే చేస్తానని చెప్పాడు. తనకు ఈ కథపై ఉన్న నమ్మకం మాపై బాధ్యతను మరింత పెంచింది’’ అన్నారు నిర్మాత స్వప్న దత్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని