Sita Ramam: ఇదే చివరి ప్రేమకథా చిత్రం: దుల్కర్‌

‘‘రొమాంటిక్‌ హీరో’ అన్న పిలుపు వినీ వినీ విసుగొచ్చి, ఇకపై ప్రేమకథలు చేయొద్దనుకున్నా. అలాంటి సమయంలో హను రాఘవపూడి ఈ కథ వినిపించారు. అద్భుతంగా అనిపించింది. చిరకాలం గుర్తుండిపోయే ఈ సినిమాని వదులుకోకూడదనుకున్నా.

Updated : 26 Jul 2022 06:19 IST

‘‘రొమాంటిక్‌ హీరో’ అన్న పిలుపు వినీ వినీ విసుగొచ్చి, ఇకపై ప్రేమకథలు చేయొద్దనుకున్నా. అలాంటి సమయంలో హను రాఘవపూడి ఈ కథ వినిపించారు. అద్భుతంగా అనిపించింది. చిరకాలం గుర్తుండిపోయే ఈ సినిమాని వదులుకోకూడదనుకున్నా. అందుకే చివరి ప్రేమకథగా ఇది చేయాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు దుల్కర్‌ సల్మాన్‌. ఆయన, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా హను రాఘవపూడి తెరకెక్కించిన చిత్రమే ‘సీతారామం’. అశ్వినీదత్‌ నిర్మించారు. రష్మిక, సుమంత్, గౌతమ్‌ మేనన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా షూటింగ్‌ ఓ అద్భుతమైన అనుభవం. దేశంలోని అనేక ప్రదేశాల్లో షూట్‌ చేశాం. అన్ని ప్రదేశాలు నేనిప్పటివరకు చూడలేదు. కథని బలంగా నమ్మి.. అందరం వందశాతం బెస్ట్‌ వర్క్‌ ఇచ్చాం. సీతగా మృణాల్‌ బాగా చేసింది. రష్మిక పాత్ర కీలకమైంది. ఇదొక లార్జర్‌ దెన్‌ లైఫ్‌ సినిమా. దీంట్లో మనసుకు నచ్చే మ్యూజిక్‌ ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం.. బాగా వర్షం వచ్చినప్పుడు వేడి కాఫీ తాగినట్లు, ఎండాకాలంలో చల్లటి నీరు తాగినట్లు ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోతారు. ఇది రాసిస్తాను. థియేటర్‌ నుంచి బయటికి రాగానే మీతోపాటు వచ్చేస్తుంది. దుల్కర్, సుమంత్, మృణాల్, రష్మికకు ప్రత్యేక కృతజ్ఞతలు. వారి తోడ్పాటు లేకపోతే సినిమాలో ఒక్క పేజీ నిండేది కాద’’న్నారు దర్శకుడు హను రాఘవపూడి. ‘‘అప్పట్లో ‘గోదావరి’ అనే సీతారాముల కథ చేశాను. అది క్లాసిక్‌ అయ్యింది. ఇప్పుడీ ‘సీతారామం’ చేశా. ఇదీ క్లాసిక్‌ అవుతుంది’’ అన్నారు సుమంత్‌. ‘‘ఇందులో అఫ్రీన్‌గా కనిపిస్తా. చాలా రెబల్‌గా ఉంటాను. నా పాత్ర పూర్తిగా రామ్, సీతల ప్రేమకథ చుట్టే తిరుగుతుంది. నా పాత్రపై ప్రేక్షకులకు కోపం వచ్చి.. నా ఎమోషన్స్‌తో కనెక్ట్‌ అయితే నేను గెలిచినట్లే’’ అన్నారు రష్మిక. అశ్వినీదత్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది నా 60వ సినిమా. ‘మరో చరిత్ర’, ‘గీతాంజలి’ లాంటి చిత్రాలు చూసినప్పుడు నేనలాంటి ప్రేమకథలు తీయగలనా? అనిపించేది. ‘సీతారామం’తో ఆ కోరిక తీరింది. ఇది కచ్చితంగా సంచలన విజయం సాధిస్తుంది’’ అన్నారు. కార్యక్రమంలో మృణాల్, రమేష్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని