RRR: స్టార్‌ హీరో చేసిన పనికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఆశ్చర్యం

కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే చిత్రపరిశ్రమ కాస్త కోలుకుంటోంది. ఎంతోకాలం నుంచి వాయిదాపడుతూ వస్తోన్న భారీ చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి....

Updated : 02 Mar 2022 12:25 IST

కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్‌

హైదరాబాద్‌: కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే చిత్రపరిశ్రమ కాస్త కోలుకుంటోంది. ఎంతోకాలం నుంచి వాయిదాపడుతూ వస్తోన్న భారీ చిత్రాలన్నీ ఒక్కొక్కటిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. సినిమాల విడుదల విషయంలో ఇండస్ట్రీలోని హీరోలు, దర్శకనిర్మాతలందరూ ఒకే తాటిపైకి వస్తున్నారు. భారీ సినిమాల రిలీజ్‌లను దృష్టిలో ఉంచుకొని తమ సినిమాలను వాయిదా వేయడానికీ పలు చిత్రబృందాలు వెనకాడటంలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ స్టార్‌హీరో చేసిన పనికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఆశ్చర్యపోయింది. ఆ హీరోకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్‌ చేసింది.

‘రెమో’, ‘వరుణ్‌ డాక్టర్‌’ వంటి చిత్రాలతో తెలుగువారికీ పరిచయమైన కోలీవుడ్‌ హీరో శివకార్తికేయన్‌. ఆయన నటించిన సరికొత్త చిత్రం ‘డాన్‌’. చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ కామెడీ డ్రామాని మార్చి 25న విడుదల చేయాలని మొదటి నుంచి చిత్రబృందం సన్నాహాలు చేసింది. ఈ మేరకు చిత్రీకరణ, ఇతర పనులు పూర్తి చేసింది. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. మార్చి 25న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని విడుదల చేయాలని టీమ్‌ సన్నాహాలు చేస్తోంది. దీంతో, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ని దృష్టిలో ఉంచుకుని ‘డాన్‌’ రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ చేస్తున్నామని శివకార్తికేయన్‌ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. మే 13న ‘డాన్‌’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌.. శివకార్తికేయన్‌కు ధన్యవాదాలు చెబుతూ పోస్ట్ పెట్టింది. ‘‘మాపై ఎప్పుడూ ప్రేమాభిమానాలు చూపించే వ్యక్తుల్లో మొట్టమొదట ఉండే శివకార్తికేయన్‌కు ధన్యవాదాలు’’ అని ట్వీట్‌ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని