SKN: పిఠాపురంలో గెలిచిన పవన్‌.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నిర్మాత ఎస్కేయన్‌

SKN: ఎన్నికల్లో పవన్‌కల్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా తొక్కిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇస్తానన్న నిరుపేద మహిళకు నిర్మాత ఎస్కేయన్‌ ఆటో కొనిచ్చారు.

Published : 12 Jul 2024 00:03 IST

హైదరాబాద్‌: సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పిఠాపురంలో గెలిచిన తర్వాత ఆయన అభిమాని అయిన మరియమ్మ కుటుంబానికి ఆటో రిక్షా కొనిస్తానని నిర్మాత ఎస్కేయన్‌ (SKN - Sreenivasa Kumar) ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఆటో కొనిచ్చి మాట నిలబెట్టుకున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న రోజులవి. పలు మీడియా సంస్థలు ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం మొదలు పెట్టాయి. ‘పవన్‌కల్యాణ్ గెలిచిన తర్వాత నా భర్త రిక్షా తొక్కిన డబ్బులు పెట్టి, ఊరంతా పార్టీ ఇచ్చేస్తా’ అని మరియమ్మ అనే మహిళ అన్న వీడియో అప్పట్లో వైరల్‌ అయింది. ఆ వీడియోను జనసేన పార్టీ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేయగా, నిర్మాత ఎస్కేయన్‌ స్పందించారు.

‘కల్యాణ్‌గారు గెలిచిన తర్వాత ఆటో రిక్షా కొని వీడియోలో ఉన్న మహిళ భర్తకు గిఫ్ట్‌ ఇస్తా. నా హీరో, అభిమాన నాయకుడి పట్ల ఆమె చూపిన స్వచ్ఛమైన ప్రేమకు ఇదే బహుమతి’ రిప్లై ఇచ్చారు. అన్నట్లుగానే గురువారం మరియమ్మ ఇంటికి వెళ్లిన ఆయన ఆటోను కానుగా ఇచ్చారు. ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. నాకెంతో ఇష్టమైన నాయకుడి పట్ల మరియమ్మ కుటుంబం చూపిన ప్రేమకు గుర్తుగా ఆటో కొనిచ్చా. వాళ్ల మనవడు ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తానని చెప్పడం సంతోషంగా ఉంది. వాళ్ల కళ్లలో ఆనందం చూసి, ఎంతో సంతోషంగా ఉంది. మన ప్రియతమ నాయకుడు పవన్‌కల్యాణ్‌గారికి మరింత శక్తినివ్వాలి. ఆయన గర్వపడేలా అభిమానులు, అనుచరులు నడుచుకోవాలి’’ అని ఎక్స్‌ వేదికగా మరియమ్మ కుటుంబంతో దిగిన ఫొటోలను పంచుకున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు