Skylab: ఓటీటీలోకి సత్యదేవ్‌- నిత్యామేనన్‌ ‘స్కైలాబ్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

సత్యదేవ్‌, నిత్యామేనన్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్కైలాబ్‌’.

Updated : 07 Dec 2022 20:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సత్యదేవ్‌, నిత్యామేనన్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్కైలాబ్‌’. 2021 డిసెంబరు 4న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా అతి తర్వలోనే డిజిటల్‌ మాధ్యమంలో సందడి చేయనుంది. ఓటీటీ ‘సోనీ లివ్‌’లో జనవరి 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని సోనీ లివ్‌ తెలిపింది. ఈ వైవిధ్యభరిత సినిమాకు విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వం వహించారు. బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామేనన్‌ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తనికెళ్ల భరణి, తులసి, విష్ణు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందించారు.

ఇదీ కథ

ఆనంద్ (స‌త్య‌దేవ్‌) (Satyadev) వైద్యం చ‌దువుకున్న యువ‌కుడు. త‌న తాత‌గారి ఊరైన బండలింగంప‌ల్లికి వ‌స్తాడు. ఆ ఊరికి చెందిన సుబేదార్ రామారావు (రాహుల్ రామ‌కృష్ణ‌) (Rahul Ramakrishna)తో ప‌రిచ‌యం పెంచుకుని క్లినిక్ ప్రారంభించే ప‌నిలో ఉంటాడు. సుబేదార్ రామారావుది మ‌రో క‌థ‌. ఒక‌ప్పుడు బాగా బ‌తికిన త‌న కుటుంబాన్ని క‌ష్టాల్లో నుంచి గ‌ట్టెక్కించ‌డం కోసం పోరాటం చేస్తుంటాడు. ఇద్ద‌రూ కలిసి క్లినిక్ ప్రారంభిస్తారో లేదో ఆ వెంట‌నే ఊళ్లో స్కైలాబ్ ప‌డుతుందనే భ‌యం మొదలవుతుంది. దాంతో వాళ్లిద్ద‌రి క‌థ మొద‌టికి వ‌స్తుంది. ఆ ఊరి దొర‌బిడ్డ గౌరి (నిత్య‌మేన‌న్‌) (Nithya Menen)ది ఇంకో క‌థ‌. ఆమె పాత్రికేయురాలిగా రాణించే ప్ర‌య‌త్నంలో ఉంటుంది. ఆ ఉద్యోగం లేక‌పోతే త‌న తండ్రి పెళ్లి చేసేస్తాడేమోనని భయపడుతూ ఉంటుంది. ప‌ట్నం నుంచి ఊరికి వ‌చ్చిన గౌరి అక్క‌డి నుంచే వార్త‌లు రాయ‌టం మొద‌లు పెడుతుంది. కానీ, అవి ప‌త్రిక‌లో ప్ర‌చుర‌ణ కావు. మ‌రి ఆమె రాసిన క‌థ‌లు ఎప్పుడు ప్ర‌చుర‌ణ‌కి నోచుకున్నాయి? ఆనంద్ క్లినిక్ పెట్టాడా? రామారావు క‌ష్టాలు తీరాయా? స్కైలాబ్(Skylab) భ‌యం ఆ ఊరిపై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపింది? అనేది మిగతా కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని