Chiranjeevi: అతడికంటే నువ్వు అందగాడివా? అని చులకనగా చూశారు: చిరంజీవి

ప్రైవేట్‌ ఆల్బమ్స్‌తో గాయనిగా ఎన్నో ఏళ్లపాటు సంగీత ప్రియులను అలరించారు స్మిత (Smita). ప్రస్తుతం ఆమె వ్యాఖ్యాతగా సినీ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సోనీలివ్‌ వేదికగా ‘నిజం విత్‌ స్మిత’ (Nijam With Smita) అనే కార్యక్రమానికి ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

Published : 10 Feb 2023 10:18 IST

హైదరాబాద్‌: ఇండస్ట్రీలో తనకు గాడ్‌ఫాదర్స్‌ లేరని.. కేవలం స్వయంకృషితోనే ఈ స్థాయికి రాగలిగానని అగ్ర కథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని తాను ఈ స్టేజ్‌లోకి వచ్చానని తెలిపారు. మద్రాస్‌కు వెళ్లిన కొత్తలో ఓ వ్యక్తి తనని చూసి.. ‘నువ్వేం అందగాడివి?’ అంటూ ఎద్దేవా చేశాడని చెప్పారు. ప్రముఖ గాయని స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం’ (Nijam) కార్యక్రమంలో పాల్గొన్న చిరు ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఓ ఏడాది అటు వైపు వెళ్లలేదు..!

‘‘పరిశ్రమలోకి ప్రవేశించి.. నటుడిగా ఈ స్థాయికి వచ్చే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. కొన్ని సందర్భాల్లో మానసిక క్షోభకు గురయ్యాను. నా బాధను ఎవరితోనూ పంచుకోలేదు. అన్నింటికీ నన్ను నేను సమాధానపరచుకొని మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చేవాడిని. ఇండస్ట్రీలోకి రావాలనే ఆశతో మద్రాస్‌కు వచ్చిన కొత్తలో ఓసారి పాండిబజార్‌కు వెళ్లాను. అక్కడ ఓ వ్యక్తి నన్ను చూసి..‘‘ఏంటి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోకి వచ్చావా? సినిమాల్లోకి ప్రయత్నిద్దామనేనా? అతడిని చూడు ఎంత అందంగా ఉన్నాడో.. అతడి కంటే నువ్వు అందగాడివా? తెలిసినవాళ్లు లేకపోతే పరిశ్రమలోకి రావడం కష్టమే..! కాబట్టి నీ కలను మర్చిపో’’ అని హేళనగా మాట్లాడాడు. ఆ మాటలు నన్ను బాధకు గురి చేశాయి. ఇంటికి వెళ్లిపోయి దేవుడి ముందు కూర్చొని.. ఇలాంటి వాటికి బెదరకూడదని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ఏడాదిపాటు ఆ పాండిబజార్‌ వైపు వెళ్లలేదు.  ఇప్పుడు ఎవరైనా నన్ను విమర్శిస్తే నేను వాటిని పట్టించుకోను. చూసి నవ్వుకుంటాను. గుర్తింపు పొందడం కోసమే ఆ వ్యక్తి అలా మాట్లాడుతున్నాడని అనుకుంటా’’

24 గంటలు భయపడ్డా..!

‘‘నేను నటించిన పాత సినిమాలు చూస్తే నా మెడలో హనుమంతుడి వెండి లాకెట్‌తో కూడిన ఓ గొలుసు ఉంటుంది. గతంలో ఆ లాకెట్‌ మా నాన్నకు ఎక్కడో దొరికితే.. దాన్ని తీసుకువచ్చి నా మెడలో వేశారు. కెరీర్‌ మొదలైన సమయంలో అదే నన్ను కాపాడుతుందని గట్టిగా నమ్మాను. ఓ సినిమా షూట్‌లో అది ఎక్కడో పడిపోయింది. ఆరోజు చాలా కంగారుపడ్డా. రోజంతా నిద్రపోలేదు. భయాందోళనకు గురయ్యాను. ఆ తర్వాత అది దొరికింది. కానీ, ‘అన్నయ్య’ (Annayya) సినిమా షూట్‌లో దాన్ని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు’’

నా మాటలు నచ్చలేదు..!

‘‘ప్రశంసలకు పొంగిపోకూడదని, విమర్శలకు కుంగిపోకూడదని.. ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. స్టార్‌గా ఉన్నప్పుడు ప్రశంసలే కాదు విమర్శలూ ఎదురవుతాయని స్వతహాగా తెలుసుకున్నాను. ‘ప్రజారాజ్యం’ స్థాపించి జగిత్యాలలో యాత్ర చేస్తోన్న తరుణంలో అక్కడవారు నాపై పూలవర్షం కురిపించారు. అదే సమయంలో కొంతమంది కోడిగుడ్లూ విసిరారు. నా మాటలు నచ్చకపోవడం వల్లే వాళ్లు ఇలా చేసి ఉండొచ్చు. ఇదే జీవితమంటే.. విమర్శలు.. ప్రశంసలను సమానంగా తీసుకుని ముందుకు అడుగువేసినవాడే నాయకుడు’’ అని చిరంజీవి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని