రవితేజ గురించి ఈ విషయాలు తెలుసా?

‘ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌.. నేనేంటో నిరూపించుకుంటూ’ అంటూ ‘ఖడ్గం’లో సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగే

Updated : 26 Jan 2021 10:21 IST

హైదరాబాద్‌: ‘ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌.. నేనేంటో నిరూపించుకుంటూ’ అంటూ ‘ఖడ్గం’లో సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగే యువనటుడి పాత్రలో రవితేజ నటన అందరినీ అలరిస్తుంది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించి, సహ నటుడిగా, కథానాయకుడిగా ఏకంగా ‘మాస్‌’ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నారు రవితేజ. ఆయన సినిమా అంటే ఇంటిల్లిపాదీ హాయిగా ఆస్వాదించేలా ఉంటుంది. అందుకే చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఆయన్ను అభిమానిస్తారు. మంగళవారం రవితేజ పుట్టిన రోజు. ఈ ఏడాది సంక్రాంతికి ‘క్రాక్‌’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఆయనకు ఈ బర్త్‌డే మరింత స్పెషల్‌. మరి ఈ సందర్భంగా రవితేజ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా!

రవితేజ 1968, జనవరి 26న ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గంపేటలో జన్మించారు. ఆయన అసలు పేరు భూపతిరాజు రవి శంకర్‌ రాజు . తండ్రి ఫార్మాసిస్ట్ కావడంతో చాలా ఊళ్లు తిరిగేవారు. అలా రవితేజ విద్యాభ్యాసం జయపుర, దిల్లీ, ముంబయి, భోపాల్‌లో జరిగింది.

విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. చిన్నతనంలో రవితేజ తెగ అల్లరి చేసేవారట. సినిమాలెక్కువ చూసేవారట. ఇంట్లో అందరికన్నా చదువు పట్ల ఆసక్తి తక్కువ తనకే అంటుంటారు రవితేజ. ఆయన ఇంట్లో అందరూ పట్టభద్రులే.

చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి పెరిగి హీరో అవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నారు ఈ మాస్‌ మహారాజ్‌. రోజుకి ఒక్క సినిమా అయినా చూసేవారట. ఒక్కోసారి నాలుగు సినిమాలు చూసిన సందర్భాలూ ఉండేవి. అదే తనకు కిక్‌ ఇచ్చేదని చెబుతారు. అంతకు మించి ఏ ఆలోచనలు, ఆశలూ ఉండేవి కావట.

సినిమాలు చూడటానికి నాన్న ఇచ్చిన పాకెట్‌ మనీతో పాటు, అమ్మ బ్యాగులోంచి చిల్లర కొట్టేసేవారట. పాపం.. వాళ్ల అమ్మకి లెక్కలు తెలీవు. డబ్బులు లెక్కపెట్టుకునేది కాదట.

తొలినాళ్లలో పలు సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అంతేకాదు, ‘అభిమన్యు’, ‘కర్తవ్యం’, ‘చైతన్య’, ‘ఆజ్‌ కా గూండా రాజ్‌’, తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. దర్శకుడు వైవీఎస్‌ చౌదరి, గుణశేఖర్‌ రవితేజ రూమ్మేట్స్‌.

‘నిన్నే పెళ్లాడతా’చిత్రానికి కృష్ణవంశీ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేయడమే కాదు, అందులో చిన్న పాత్రను కూడా పోషించారు. ఆ తర్వాత  ‘సింధూరం’లో మంచి పాత్ర చేశారు.

సింధూరం తరవాత.. ఓ షూటింగ్‌ పనిమీద విశాఖపట్నం వెళ్లారట రవితేజ. అక్కడ ఒకతను ‘మీ సినిమా చూశాను సార్‌.. బాగా చేశారు. మీలాంటివాళ్లే పరిశ్రమలోకి రావాలి సార్‌.. వస్తే తప్పకుండా సాధిస్తారు’ అన్నాడట. ఆ మాటలు తనలో చెప్పలేనంత నమ్మకాన్ని కలిగించాయని చెబుతారు.

అలా ‘సీతారామరాజు’, ‘ప్రేమకు వేళాయరా’ తదితర చిత్రాల్లో నటించిన రవితేజకు శ్రీనువైట్ల ‘నీకోసం’ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో ఇతర హీరోలతో కలిసి నటించారు.

2001లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ నటించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ మంచి హిట్‌ అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇడియట్‌’ రవితేజ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇక రవితేజ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఇడియట్‌’ విడుదలైన రోజు ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతారు రవితేజ. ఆ రోజు హైదరాబాద్‌లోని గోకుల్‌ థియేటర్‌ ఎదురుగా ఉన్న గుళ్లో షూటింగ్‌కు కార్లో వెళ్తుంటే... థియేటర్‌కు విపరీతంగా జనం వచ్చారట. వాళ్లని అలా చూడటంతో ఆ రోజు చాలా కిక్‌ వచ్చిందని ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటారు.

రవితేజ సాధారణంగా వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి ఆసక్తి చూపించరు. ఆయనకు ఓ బాబు, పాప. బాబు పేరు మహాధన్‌, పాప పేరు మోక్షత.

1999లో ‘నీ కోసం’, 2002లో ‘ఖడ్గం’ చిత్రాల్లో నటనగానూ నంది స్పెషల్ జ్యూరీ అందుకున్నారు.

ఈ ఏడాది ‘క్రాక్‌’ సినిమాతో రవితేజ ఘన విజయాన్ని అందుకున్నారు. గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్‌హిట్‌ అయింది. ప్రస్తుతం రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’లో నటిస్తున్నారు. ప్రేక్షకులను అలరిస్తూ రవితేజ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని