Ratnababu: విద్యార్థిలా ఎదురుచూస్తున్నా

‘‘న్యాయవ్యవస్థలోని లొసుగుల్ని ప్రశ్నించే పాత్రతోనే ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రాన్ని     తెరకెక్కించా’’ అన్నారు డైమండ్‌ రత్నబాబు. ఆయన దర్శకత్వంలో మోహన్‌బాబు కథానాయకుడిగా రూపొందిన చిత్రమిది. మంచు విష్ణు నిర్మాత. శుక్రవారం  ప్రేక్షకుల

Updated : 17 Feb 2022 09:02 IST

‘‘న్యాయవ్యవస్థలోని లొసుగుల్ని ప్రశ్నించే పాత్రతోనే ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’ చిత్రాన్ని తెరకెక్కించా’’ అన్నారు డైమండ్‌ రత్నబాబు. ఆయన దర్శకత్వంలో మోహన్‌బాబు కథానాయకుడిగా రూపొందిన చిత్రమిది. మంచు విష్ణు నిర్మాత. శుక్రవారం  ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా డైమండ్‌  రత్నబాబు బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఇదొక ప్రయోగాత్మక చిత్రం. కరోనా సమయంలో రైతుల్ని, వైద్యుల్ని పొగిడాం. వాళ్లతోపాటు సినిమావాళ్లూ గొప్పవాళ్లే అని అప్పట్లో నాకు అనిపించింది. సినిమాలవల్ల వినోదాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని గడిపినవాళ్లు చాలామందే. అలా సినిమాపై నాకున్న ప్రేమని వ్యక్త పరిచే అవకాశం ఈ చిత్రంతో వచ్చింది. ఆ సమయంలోనే నేను ఈ కథని  మోహన్‌బాబుకి వినిపించా. ఓటీటీ కోసమనే మొదలు పెట్టాం. పూర్తయ్యాక ‘థియేటర్లని ప్రేమించే వ్యక్తిగా నాకు దీన్ని ఓటీటీలో విడుదల చేయడం ఇష్టం లేద’ని మోహన్‌బాబు అన్నారు. మంచి సంభాషణలు, ఓ సరికొత్త ప్రయోగంలా రూపుదిద్దుకున్న ఈ సినిమా థియేటర్లలోనే రావాలని ఆయన చెప్పారు. 1 గంట 30 నిమిషాల నిడివున్న చిత్రమిది. విరూపాక్ష అనే పాత్రలో మోహన్‌బాబు కనిపిస్తారు. ప్రైవేట్‌ స్కూళ్లు, ఆసుపత్రుల తరహాలో ఇందులో కథానాయకుడు ప్రైవేట్‌ జైలుని నడుపుతుంటాడు. ఆ నేపథ్యమంతా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా ఫలితం కోసం పరీక్షలు రాసిన ఓ విద్యార్థిలా ఎదురుచూస్తున్నా’’అని తెలిపారు డైమండ్‌ రత్నబాబు. త్వరలోనే మోహన్‌బాబు, మంచు లక్ష్మీలతో ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు ఆయన తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని