Soppana Sundari Review: రివ్యూ: స్వప్న సుందరి.. లాటరీలో కారు దక్కితే పరిస్థితేంటి?

ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు ఎస్‌.జి. చార్లెస్‌ తెరకెక్కించిన చిత్రం ‘స్వప్న సుందరి’. ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

Updated : 12 May 2023 17:44 IST

soppana sundari review: చిత్రం: స్వప్న సుందరి; తారాగణం: ఐశ్వర్య రాజేశ్‌, లక్ష్మీప్రియ చంద్రమౌళి, దీపా శంకర్‌, కరుణాకరన్‌, సతీశ్‌ కృష్ణన్‌, గోపి తదితరులు; సంగీతం: అజ్మల్‌ తాసీన్‌ (పాటలు), విశాల్‌ చంద్రశేఖర్‌ (బీజీఎం); ఎడిటింగ్‌: కె. శరత్‌కుమార్‌; సినిమాటోగ్రఫీ: బాలమురుగన్‌, విఘ్నేశ్‌ రాజగోపాలన్‌, నిర్మాతలు: బాలాజీ సుబ్బు వివేక్‌, రవిచంద్రన్‌; కథ, దర్శకత్వం: ఎస్‌.జి. చార్లెస్‌; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: డిస్నీ+ హాట్‌స్టార్‌.

కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే వరుసగా నాయికా ప్రాధాన్య చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి.. ఐశ్వర్య రాజేశ్‌ (Aishwarya Rajesh). గతంలో.. ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘డ్రైవర్‌ జమున’ తదితర ఉమెన్‌ సెంట్రిక్‌ మూవీస్‌తో అలరించిన ఆమె.. ఇటీవల ‘స్వప్న సుందరి’ సినిమాతో కోలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. థియేటర్లలో ఏప్రిల్‌లో విడుదలైన ఈ తమిళ చిత్రం మే 12 నుంచి ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తమిళనాట మంచి స్పందన దక్కించుకున్న ఈ సినిమా కథేంటంటే (soppana sundari review)..?

లాటరీ స్టోరీ: మధ్య తరగతి కుటుంబానికి చెందిన అహల్య (ఐశ్వర్య రాజేశ్‌) నగల దుకాణంలో పనిచేస్తుంటుంది. ఆమె తండ్రి అనారోగ్యానికి గురై మంచాన పడతాడు. అక్క మూగది. ఫ్యామిలీకి అండగా ఉండాల్సిన ఆమె అన్నయ్య దొర (కరుణాకరన్‌) ప్రేమపెళ్లి చేసుకుని ఇల్లు విడిచి వెళ్లిపోతాడు. తన చెల్లి పేరు చెప్పి ఆమె పనిచేసే షాపులో ‘స్టాఫ్‌ డిస్కౌంట్‌’ను ఉపయోగించుకుంటుంటాడు. డబ్బున్నవారితో పరిచయం పెంచుకుని, నగలు కొంటానంటూ వారి దగ్గర కమీషన్‌ తీసుకుని జీవనం సాగిస్తుంటాడు. ఆ క్రమంలో ఓ రోజు చెల్లి కంటపడతాడు. నువ్వేంటిక్కడ? అని ఆమె ప్రశ్నించగా లాటరీ కూపన్‌ ముఖంపై విసిరి ఇడ్లీ బండి పెట్టుకోమని ఎగతాళి చేస్తాడు. కట్‌చేస్తే, లక్కీడ్రాలో అహల్య రూ.10 లక్షల విలువైన కారుని బహుమతిగా అందుకుంటుంది. విషయం తెలిసిన దొర తన భార్య, బావ (మైమ్‌ గోపి)తో కలిసి అహల్య దగ్గర కారుని స్వాధీనం చేసుకోవాలనుకుంటాడు. ఆ వివాదం కాస్తా పోలీసు స్టేషన్‌కు చేరుతుంది. మరి, ఆ కారును సొంతం చేసుకునేందుకు ఎవరెలాంటి ప్రయత్నాలు చేశారు? చివరకు అది ఎవరికి దక్కింది? కారుతో ముడిపడిన అహల్య అక్క పెళ్లి జరిగిందా, లేదా? అంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా సాగింది? దేనికీ ఉపయోగపడదని పారేసిన ఏదైనా వస్తువు ఇతరులకు ఉపయోగపడుతుంటుంటే కొందరు సంతోషిస్తారు.. మరికొందరు దాన్ని చూసి తట్టుకోలేరు. ఈ రెండో వర్గం వారు కుటుంబ సభ్యుల విషయంలోనూ అంతేనని తెలియజేసే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రమిది. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాన్ని వదిలేసి ఇల్లరికానికి వెళ్లిన అన్నయ్య.. చెల్లికి తన కూపన్‌ వల్లే కారు దక్కిందని జీర్ణించుకోలేకపోవడం, దాని వల్ల ఇద్దరూ సమస్యల్లో చిక్కుకోవడం ఈ సినిమా కథాంశం. లక్కీడ్రా పేరుతో ఓ జ్యువెలరీ షాప్‌ చేసే ప్రచారం, కథానాయిక కుటుంబాన్ని పరిచయం చేసే సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. తర్వాత, కలలో కూడా ఊహించని గిఫ్ట్‌రావడంతో అహల్య ఫ్యామిలీ ఓ పాట పాడుకుంటుంది. వారి ఆనందం బాగానే ఉందిగానీ పాటే అలరించదు. పెళ్లి అనంతరం తొలిసారి దొర తన ఇంటికి వచ్చిన సీన్‌ నుంచి కథపై ఆసక్తి పెరుగుతుంది. చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని ఇంటి ముందే అహల్య, తన తల్లి.. దొరపై ఆగ్రహించడం, మరోవైపు దొరను తన బావ సమర్థించడం, ఇరు వర్గాల మధ్య వాగ్వాదానికి దారితీసే సందర్భం నవ్వులు పంచుతుంది.

వేరే కాపురం పెట్టాలనే ఉద్దేశంతో దొర భార్య.. తన అత్తయ్య, మరదలితో చేసే హంగామా సగటు మధ్య తరగతి జీవితాల్ని ప్రతిబింబిస్తుంది. హాస్యాన్ని పండించే ఆయా సన్నివేశాలు చాలామందికి కనెక్ట్‌ అవుతాయి. ప్రేమ వివాహం కారణంగా చోటుచేసుకున్న కుటుంబ కలహాలతో హాస్యాన్ని పండిస్తూ ప్రథమార్ధాన్ని నడిపించిన దర్శకుడు ద్వితీయార్థంలో కాస్త సస్పెన్స్‌ జోడించారు. నాదంటే నాదనే అన్నాచెల్లెళ్ల వివాదంతో కారును పోలీసులు స్వాధీనం చేసుకోవడం, నగలు ఎవరుకొంటే వారు రసీదు చూపించి కారు తీసుకెళ్లొచ్చని పోలీసులు చెప్పడం, ఆ నగలు కొన్న యజమాని ఇంటికెళ్లి బిల్‌ తీసుకొచ్చేందుకు అన్నాచెల్లెళ్లు ప్రయత్నాలు చేయడం.. ఇలా ప్రతి సీన్‌ ఆకట్టుకుంటుంది. కారులో శవం ఉందని తెలిసిన క్షణం నుంచి.. పోలీసులకు తెలియకుండా అహల్య దాన్ని ఎలా బయటకు తీసుకొస్తుందనే ఉత్సుకత పెరుగుతుంది. అయితే, ఆ క్రమంలో ఆమె చేసే ప్రయత్నం పేలవంగా ఉంటుంది. పోలీసులు కూడా గుర్తించలేని కారు డిక్కీలోని ఆ శవం ఏమైందన్న ప్రశ్నకు ప్రత్యేక పాత్ర ద్వారా సమాధానం చెప్పించడం థ్రిల్‌ పంచుతుంది. శారీరకంగా తనను సొంతం చేసుకోవాలన్న సదరు పోలీసు స్టేషన్‌ ఎస్‌.ఐ. కి అహల్య ఇచ్చే వార్నింగ్‌ అల్లరి మూకల వల్ల వర్కింగ్‌ ఉమెన్స్‌ ఎంత ఇబ్బంది పడుతున్నారో కళ్లకు కడుతుంది. ‘దురాశ దుఃఖానికి చేటు’ అనే నానుడితో క్లైమాక్స్‌ ప్రశాంతంగా ముగుస్తుంది. 

ఎవరెలా చేశారంటే? కుటుంబ బాధ్యతలు మోసే అమ్మాయిగా ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన ఐశ్వర్య ఇందులో అహల్యగా ఒదిగిపోయింది. తల్లి పాత్ర పోషించిన దీపా శంకర్‌, దొరగా కరుణాకరన్‌, బావ పాత్రలో మైమ్‌ గోపి మెప్పిస్తారు. రెండు పాటలున్నా అవి ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం ఓకే. ఇతర సాంకేతిక నిపుణల పని ఫర్వాలేదనిపిస్తుంది. రచయితగా, దర్శకుడిగా చార్లెస్‌ తన ప్రతిభ చాటారు. సందేశాత్మక కథను కామెడీ+ సస్పెన్స్‌ స్క్రీన్‌ప్లేతో నడిపించి, అలరించారు.

  • బలాలు
  • + కథ
  • + ఐశ్వర్య రాజేశ్‌ నటన
  • + కామెడీ
  • బలహీనతలు
  • - పాటలు
  • - ప్రథమార్ధంలోని కొన్ని సాగదీత సన్నివేశాలు
  • చివరిగా: ఈ ‘స్వప్న సుందరి’.. వినోదం పంచి, సందేశం ఇస్తుంది.
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని