నిశ్శబ్ద సంగీతంలో కన్నీళ్లు రాలిన శబ్దం

కరోనా కారణంగా గతేడాది థియేటర్లే తెరుచుకోకున్నా, తక్కువ సంఖ్యలోనే సినిమాలు విడుదలైనా ఆస్కార్‌ పోరు మాత్రం ఆసక్తిని రేపుతోంది. విభిన్న కథాంశాలతో పోటీ రసవత్తరంగా మారింది. అందులో ‘సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌’ చిత్రం భిన్నమైన కథాంశంతో...

Published : 16 Apr 2021 12:42 IST

ఆస్కార్‌ సినిమా-4

సినిమా: సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌; భాష: ఇంగ్లీష్; విడుదల : 2020; దర్శకత్వం: డారియస్‌ మార్డర్‌; నటీనటులు: రిజ్‌ అహ్మద్‌, ఒలివియా కుక్‌ పాల్‌ రేసి; సినిమాటోగ్రఫీ: డానియల్‌ బోకెట్‌; నిడివి: 120; నిమిషాలు; ఎక్కడ చూడొచ్చు: అమెజాన్‌

కరోనా కారణంగా గతేడాది థియేటర్లే తెరుచుకోకున్నా, తక్కువ సంఖ్యలోనే సినిమాలు విడుదలైనా ఆస్కార్‌ పోరు మాత్రం ఆసక్తిని రేపుతోంది. విభిన్న కథాంశాలతో పోటీ రసవత్తరంగా మారింది. అందులో ‘సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌’ చిత్రం భిన్నమైన కథాంశంతో తెరకెక్కిందే. వినికిడి శక్తి కోల్పోయిన డ్రమ్మర్‌ పాత్రలో రిజ్‌ అహ్మద్‌ నటించగా డారిస్‌ మార్డర్‌ దీన్ని తెరకెక్కించారు. నైట్‌ క్రాలర్‌ సినిమాతో హాలీవుడ్‌లో గుర్తింపు పొందిన రిజ్‌ మంచి ర్యాపర్‌ కూడా. సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌లో వినికిడి లోపంతో బాధపడే డ్రమ్మర్‌గా నటించి ప్రశంసలు పొందాడు. అంతేకాదు ఉత్తమ నటుడి విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్న తొలి ముస్లిం నటుడిగా నిలిచాడు. దర్శకుడు డారియస్‌ మార్డర్‌కు ఇదే తొలిచిత్రం. మొదటి చిత్రంతోనే ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచాడు. గతేడాది నవంబర్‌లో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. పలు అంతర్జాతీయ వేదికలపై అవార్డులు, ప్రశంసలు దక్కించుకుంది.

కథ: రూబెన్‌ ఒక డ్రమ్మర్‌. లూయి అతని ప్రేయసి. తన బ్యాండ్‌లోనే గాయకురాలు కూడా. వీరిద్దరూ కలిసి అమెరికాలో వివిధ ప్రాంతాలకు తిరుగుతూ సంగీత ప్రదర్శనలు ఇస్తుంటారు. డ్రమ్స్‌ వాయించేటప్పుడు వచ్చే భారీ శబ్దాల కారణంగా రూబెన్‌ చెవులు దెబ్బతిని వినికిడి శక్తిని కోల్పోతుంటాడు. వైద్యుడిని సంప్రదిస్తే శస్త్రచికిత్స చేసి ఓ పరికరాన్ని అమరిస్తే తిరిగి ఎప్పటిలాగే వినే అవకాశం ఉందంటాడు.. అందుకు భారీగా ఖర్చు అవుతుంది. దీనికితోడు కచ్చితమైన ఫలితాలిస్తాయన్న నమ్మకం లేదంటాడు వైద్యుడు. వీలైనంత మేర భారీ శబ్దాలకు దూరంగా ఉండమని సలహా ఇస్తాడు. సంగీతమే ప్రాణమైన రూబెన్‌ దానికి ఒప్పుకోకుండా తిరిగి డ్రమ్స్‌ వాయించేందుకు వెళ్తాడు. ఈ సారి పూర్తిగా చెవిటి వాడిగా మారిపోతాడు. దీంతో అతని ప్రపంచమంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఎవరు ఏం చెబుతున్నారో అర్థం కాదు. ప్రేయసి లూయి సలహాతో వినికిడి శక్తి కోల్పోయిన వారికి ఆశ్రయమిచ్చే చోటుకు వెళ్తాడు. అది జో అనే వ్యక్తి సారథ్యంలో నడుస్తోంది.    చెవిటితనం ఒక వైకల్యం కాదు అని నమ్ముతారు అక్కడి సభ్యులు. రూబెన్‌కి శస్త్రచికిత్స చేసుకొని తిరిగి తనదైన ప్రపంచంలోకి వెళ్లాలనుంటుంది. అలా హోరెత్తే శబ్దాల సంగీత ప్రపంచం నుంచి నిశ్శబ్ద లోకంలోకి రూబెన్‌ అడుగుపెడతాడు. అక్కడ ఆయన పయనం ఎలా సాగింది? ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? శబ్దానికి, నిశ్శబ్దానికి మధ్య జరిగిన సంఘర్షణను ఎలా ఎదుర్కొన్నాడనేది మిగతా కథ.

ఆ ప్రపంచంలోకి: వినికిడి లోపంతో బాధపడే డ్రమ్మర్‌గా రిజ్‌ అహ్మద్‌ నటన సినిమాకు ప్రధాన బలం. తన కళ్లు, హావభావాలతోనే మొత్తం కథని నడిపించాడు. డ్రగ్‌ బానిసగా, సంగీతాన్ని, ప్రేయసిని వీడలేని నిస్సహాయుడిగా అతడి నటన కట్టిపడేస్తుంది. జోని లోన్‌ అడిగే సన్నివేశం, లూయ్‌తో విడిపోయే సందర్భం, ఆ ఆశ్రమంలో ఒంటరిగా గడిపే సన్నివేళాలు ఇలా చాలా చోట్ల కంటతడిపెట్టిస్తాడు. అలా నటించినందుకే ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్‌ నామినేషన్‌ దక్కింది. రెజ్‌ అహ్మద్‌ తర్వాత అంతటి బలం సౌండ్‌ డిజైనింగ్‌ది. వాస్తవ ప్రపంచం నుంచి రూబెన్‌ నిశ్శబ్ద ప్రపంచంలోకి తీసుకెళ్లి మనల్ని కొంతసేపు ట్రాన్స్‌లోకి నెడుతుంది ఈ సౌండ్‌ డిజైనింగ్‌. శబ్దం కోసం ఆరాటపడే కథానాయకుడి బాధంతా ప్రేక్షకులు అనుభవించేలా చేయడంలో సౌండ్‌ డిజైనర్లు నికోలస్‌ బేకర్‌, జైమీ, ఫిలిప్‌ తదితర బృందం పనితీరు ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. బెస్ట్‌ సౌండ్‌ విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్నారు. రూబెన్‌కి సంజ్ఞల భాషను నేర్పించే ఆశ్రమ నిర్వాహకుడు జోగా నటించిన పాల్‌ రేసి బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌ విభాగంలో పోటీ పడుతున్నారు. ఎడిటింగ్‌, బెస్ట్‌ పిక్చర్‌ ఇలా మొత్తం ఆరు విభాగాల్లో సౌండ్‌ ఆఫ్‌ మెటల్‌ పోటీలో నిలిచింది. రెజ్‌ అహ్మద్‌కి అవార్డు దక్కితే ఉత్తమ నటుడి పురస్కారం పొందిన తొలి ముస్లిం వ్యక్తిగా చరిత్రలో నిలుస్తాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని