అలీ పక్కన చేయనన్న సౌందర్య!

బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి, హాస్య నటుడిగా రాణించి, కథానాయకుడిగా ఎదిగిన వ్యక్తి అలీ. ప్రస్తుతం తనదైన నటనతో నవ్వులు పంచుతున్నారు.

Published : 03 Apr 2023 16:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి, హాస్య నటుడిగా రాణించి, కథానాయకుడిగా ఎదిగిన వ్యక్తి అలీ. ప్రస్తుతం తనదైన నటనతో నవ్వులు పంచుతున్నారు. అలీ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘యమలీల’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు. నటుడిగా అలీ స్టార్‌డమ్‌ను పెంచింది. సంగీత పరంగానూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ కథకు అలీని కథానాయకుడిగా తీసుకుందామని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అనుకున్నప్పుడు చాలా మంది వద్దని సలహా ఇచ్చారట. అయితే, ఎస్వీ కృష్ణారెడ్డి మాత్రం అలీ అయితేనే ఈ కథకు సరిపోతాడని భావించి, ఆయననే ఓకే చేశారు. ఇక కథానాయిక ఎంపిక విషయంలో తొలి ప్రాధాన్యం సౌందర్యకు ఇచ్చారు. ఇదే విషయాన్ని ఆమె వద్ద ప్రస్తావిస్తే, తొలుత ఒప్పుకొన్నా, ఆ తర్వాత అలీ హీరో అని తెలియడంతో తన తండ్రి సూచనమేరకు సినిమా నుంచి తప్పుకొన్నారు. దీంతో ఇంద్రజను కథానాయికగా తీసుకున్నారు.

1994 ఏప్రిల్‌ 28న విడుదలైన ‘యమలీల’ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ‘భవిష్యవాణి’ చూసి తన తల్లి చనిపోతుందని తెలిసినప్పుడు అలీ పలికించిన హావభావాలు చూసి, ఆయనను కథానాయకుడిగా తీసుకోవద్దన్న వారు సైతం హ్యాట్సాఫ్‌ అనేలా చేశారు అలీ. అయితే, ఆ తర్వాత అలీతో కలిసి సౌందర్య ఓ డ్యుయెట్‌లో ఆడిపాడారు. ‘శుభలగ్నం’ చిత్రంలో ‘చినుకు చినుకు అందెలతో’ పాట కోసం సౌందర్యను అడిగితే మరో ఆలోచన లేకుండా ఆమె ఒప్పుకొన్నారట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని