Tollywood: ఓవర్సీస్‌లో అదరగొడుతున్న తెలుగు హీరోలు.. వసూళ్ల రికార్డులు..

ప్రస్తుతం టాలీవుడ్‌ సినిమాలు సాధిస్తున్న విజయాల గురించి ప్రపంచవ్యాప్తంగ మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌తో సహా ప్రముఖ హీరోలు నటించిన దక్షిణాది సినిమాలు తరచూ అమెరికా బాక్సాఫీస్‌ వద్ద భారీగా వసూళ్లు చేస్తున్నాయి.

Published : 17 May 2022 12:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం తెలుగు సినిమాలు వసూళ్ల సునామీని సృష్టిస్తున్నాయి. ప్రభాస్‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌తో సహా ప్రముఖ హీరోలు నటించిన దక్షిణాది సినిమాలు అమెరికా బాక్సాఫీస్‌ వద్ద కూడా భారీగా వసూళ్లు చేస్తున్నాయి. మన హీరోలకు అక్కడ ఎన్నారైల్లో ఉన్న క్రేజ్ ఇందుకు కారణం. మరి అమెరికాలో 2మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు చేసిన తెలుగు హీరోల సినిమాలేంటో చూద్దాం!

ప్రభాస్‌: ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఆ క్రేజ్‌ ఇక్కడికే పరిమితం కాలేదు అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో సైతం ఈ హీరోకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’ సినిమాల షూటింగ్‌లో ఉన్న ప్రభాస్‌ నటించిన నాలుగు సినిమాలు అమెరికాలో 2 మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేశాయి. ఈ హీరో నటించిన ‘బాహుబలి1’, ‘బాహుబలి2’, ‘సాహో’, అలాగే తాజా చిత్రం ‘రాధే శ్యామ్‌’ సినిమాలు అక్కడ కలెక్షన్ల వర్షం కురిపించాయి. 

మహేశ్‌ బాబు: అమెరికాలోని ప్రవాస తెలుగువారు అమితంగా ఇష్టపడే తెలుగు హీరోల్లో మహేశ్‌బాబు ఒకరు. ఈ హీరో నటించిన నాలుగు సినిమాలు అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకొని 2 మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేశాయి. అవే ‘భరత్‌ అనే నేను’, ‘శ్రీమంతుడు’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘సర్కారు వారి పాట’. ఇక త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రానున్న మూవీ సైతం అక్కడ భారీగా వసూళ్లు రాబడుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రజనీకాంత్‌: తన స్టైల్‌తో, నటనతో అందరినీ ఆకట్టుకునే సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఓవర్సీస్‌లోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. రజనీ నటించిన నాలుగు సినిమాలు అక్కడ కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ‘2.0’, ‘కబాలి’, ‘రోబో’, ‘పేట’ సినిమాలు ఓవర్సీస్‌లో సూపర్‌హిట్‌గా నిలిచాయి.

ఎన్టీఆర్‌: ఎన్టీఆర్‌ నటించిన మూడు సినిమాలు అమెరికాలో మంచి విజయాన్ని సాధించాయి. రామ్‌చరణ్‌తో కలిసి ఆయన నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఏకంగా ఓవర్సీస్‌లో 14.5 మిలియన్‌ డాలర్లు(సుమారు రూ.112కోట్లు) వసూలు చేసింది. గతంలో వచ్చిన ‘అరవిందసమేత’, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. 

చిరంజీవి: అగ్ర కథానాయకుడు చిరంజీవి తెలుగులోనూ కాదు, ఓవర్సీస్‌లో అభిమానులు ఎక్కువే. ఆయన నటించిన రెండు సినిమాలు అమెరికాలో 2మిలియన్ల మార్కును దాటాయి. ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఖైదీ నం.150’ సినిమాలు అమెరికాలో ఘన విజయం సాధించాయి.

అల్లు అర్జున్‌: తాజాగా ‘పుష్ప’ సినిమాలో ‘తగ్గేదేలే’ అంటూ అలరించిన అల్లుఅర్జున్‌ సినిమా వసూళ్ల విషయంలోనూ అదే డైలాగ్‌ రిపీట్‌ చేస్తున్నారు. ‘పుష్ప’ అమెరికాలో 2 మిలియన్‌ డాలర్లు వసూళ్లు చేసింది. అంతకుముందు ‘అల వైకుంఠపురంలో’ సినిమా కూడా ఓవర్సీస్‌లో భారీగానే కలెక్షన్లు రాబట్టింది. 

విజయ్‌దేవరకొండ: అర్జున్‌ రెడ్డి సినిమా తర్వాత విజయ్‌ దేవరకొండ రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ హీరో నటించిన 2 సినిమాలు అమెరికాలో 2 మిలియన్ల డాలర్లుకు పైగా వసూళ్లు చేశాయి. ‘గీతగోవిందం’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలు అక్కడి ప్రేక్షకులను అలరించి భారీ కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని