
ఎస్పీబీ నటనా కౌశలం.. మిథునం
ఇంటర్నెట్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో కొందరు అద్భుతంగా నటిస్తారు. ఇంకొందరు డైనమైట్‌లా డైలాగులు పేలుస్తారు. మరికొందరు తనదైన కామెడీతో కితకితలు పెట్టిస్తారు. కానీ అటు గాయకుడిగా మెప్పిస్తూ ఈ మూడింట్లోనూ ప్రతిభ చాటగల వ్యక్తి ఎవరని అనడిగితే ఠక్కున వచ్చే సమాధానం శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం. అందరూ ముద్దుగా పిలుచుకునే ఎస్పీ బాలు. అటు గాయకుడిగా, ఇటు డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాదు.. అనేక చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారాయన. తండ్రి పాత్రల్లో ఒదిగిపోయారు. కామెడీతో అలరించారు. అసలు బాలు గాయకుడు కాకముందే నటుడిగా వెండితెరకు పరిచయం కావడం విశేషం. ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’లో రమాప్రభ పుట్టినరోజు వేడుకలో ‘హ్యాపీ బర్త్ డే టు యూ’ అంటూ పాటపాడుతూ తొలిసారి బాలు వెండితెరమీద దర్శనమిచ్చారు. ఆ తర్వాత గాయకుడిగా బిజీ అయినా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాల్లో కనిపించడం ఒక్క ఎస్పీబీకే చెల్లింది.
బాలు నటన అద్భుతః
బాల సుబ్రహ్మణ్యం నటన గురించి చెప్పాల్సి వస్తే ‘మిథునం’ గురించే చెప్పాలి. తనికెళ్ల భరణి దర్శకత్వంలో 2012లో వచ్చిన ఈ చిత్రం ఆయన కెరీర్‌లోనే ఓ మైలురాయి. అంతకు ముందు ఆయన ఎన్ని సినిమాల్లో నటించినా ఈ చిత్రం ఎవర్‌గ్రీన్. ఇందులో రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా అప్పదాసు పాత్రలో బాలు జీవించారనడం సమంజసం. పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడడంతో తన భార్య బుచ్చి (లక్ష్మి)తో కలిసి ఓ పల్లెటూరులో ఉంటారు. ఆ వృద్ధ దంపతులు ఎలా శేషజీవితాన్ని గడిపారన్నదే కథ. ఇందులో బాలు పలికించిన హావభావాలు నిజంగా మైమరిపిస్తాయి. చిలిపితనం, అలకబూనడం, ఆగ్రహించడం వంటి భావాలను ఆయన అవలీలగా పలికించారు. భోజన ప్రియుడిగా, ప్రకృతి ప్రేమికుడిగా ఆకట్టుకున్నారు. ‘ఆవకాయ మన అందరిదీ’ అంటూ ఆయన పాడిన పాటలో ఆయన అభినయం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి గానూ నంది స్పెషల్ జ్యూరీ అవార్డు బాలును వరించింది.
తండ్రిగా నటించి.. డ్యాన్స్‌తో మెప్పించి
బాల సుబ్రహ్మణ్యం చాలా చిత్రాల్లో తండ్రి పాత్రల్లో కనిపించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1996లో వచ్చిన ‘పవిత్ర బంధం’లో వెంకటేశ్ తండ్రి పాత్రలో ఓ పారిశ్రామికవేత్తగా బాల సుబ్రహ్మణ్యం కనిపించారు. సౌందర్యతో వెంకటేశ్ పెళ్లి ఒప్పందం విషయంలో కొడుకుకు వివాహ బంధం గురించి ఆయన చెప్పే డైలాగులు హైలైట్‌గా నిలుస్తాయి. ఈ చిత్రంలో నిజంగా తండ్రి పాత్రలో ఒదిగిపోయారాయన. ఇందులో ఆరు పాటలకు గానూ 4 పాటలు బాలు ఆలపించారు. 1996లో నాగార్జున నటించిన ‘రక్షక్షుడు’లోనూ బాలు తెరపంచుకున్నారు. అన్యాయాన్ని సహించలేని అజయ్ పాత్రలో నాగార్జున నటించగా.. ఆ దూకుడు తగ్గించేందుకు శతవిధాల ప్రయత్నించే తండ్రి పాత్రలో బాలు కనిపించారు. ఇందులో ‘లక్కీ లక్కీ’ అంటూ సాగే ఓ పాటలో తన దైన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు.
ప్రభుదేవాతో కలిసి డ్యాన్స్
ప్రభుదేవా, నగ్మా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమికుడు’. 1994లో విడుదలైన ఈ చిత్రంలో ప్రభుదేవా తండ్రి పాత్రలో బాలు నటించారు. కొడుకుతో ఓ స్నేహితుడిగా ఉంటూ అతడి ప్రేమ విజయం సాధించడానికి సలహాలు ఇస్తుంటారు. ఇందులో ‘అందమైన ప్రేమరాణి’ అంటూ సాగే పాటలో ప్రభుదేవా, బాలు కలిసి స్టెప్పులు వేశారు. ఇప్పటికీ ఈ సాంగ్ అందరి నోళ్లలో నానుతుందనడానికి కారణం బాలునే. ఆ పాటలో ప్రభుదేవాతో సమానంగా భారీ కాయంతో బాలు డ్యాన్స్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
200 రోజుల ఆడిన సినిమా..
ఎస్పీ బాలు, రాధిక ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘కేలడి కన్మాణి’. 1990లో వచ్చిన ఈ చిత్రానికి వసంత్ దర్శకత్వం వహించారు. అప్పటి వరకు అతిథి, సహాయక నటుడిగా మెప్పించిన బాలు... ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఎంతోమంది సినీ ప్రియుల హృదయాలను హత్తుకుంది. కొన్ని థియేటర్లలో 200 రోజులపాటు ఈ సినిమా ఆడింది. తెలుగులో ‘ఓ పాపాలాలీ’ పేరుతో విడుదలైంది. ఇందులోని ‘మాటేరాని చిన్నదాని’ అనే పాట అలపించింది బాలునే. ఆయన సూపర్ హిట్ పాటల్లో ఇది కూడా ఒకటి.
కామెడీలో తనదైన టైమింగ్..
బాలసుబ్రహ్మణ్యం నటనలో కామెడీ టైమింగ్ చూడాలంటే చంద్రమోహన్, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పక్కింటి అమ్మాయి’ చిత్రం చూడాల్సిందే. అందులో బాలరాజు అనే పాత్రలో ఎస్పీబీ కనిపించారు. పంచరత్న నాటక మండలి గురువుగా ఆయన చెప్పే పలు డైలాగులు నవ్వులు పూయిస్తాయి. చంద్రమోహన్‌కు వెనకుండి ఆయన పాటలు పాడుతూ కనిపించే సీన్లు ప్రేక్షకులను నవ్విస్తాయి. అలాగే 1989లో వెంకటేశ్, రేవతి కలిసి నటించిన ‘ప్రేమ’ చిత్రంలోనూ అడ్వైజర్ సత్యారావు పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలోని ఏడు పాటలకు గానూ ఒక్కటి మినహా అన్ని పాటలనూ బాలూనే ఆలపించారు. ఆ ఒక్క పాట కూడా ఆయన సోదరి శైలజ ఆలపించారు. ఈ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడిగానూ, ఉత్తమ నేపథ్య గాయకుడిగానూ ఎస్పీబీ రెండు అవార్డులు అందుకున్నారు.
ఇవే కాదు.. రాజా, భూమిక జంటగా 2006లో వచ్చిన ‘మాయబజార్’ చిత్రంలోనూ బాలు కనిపించారు. ఇందులో కుబేరుడి పాత్రలో సరిగ్గా అతికిపోయారు. ‘దేవుళ్లు’ చిత్రంలో వినాయకుడిగానూ కనిపించారు. ఇందులో ‘జయ జయ శుభకర వినాయక’ అంటూ భక్తిరస గీతాన్ని బాలూనే ఆలపించారు. ఇవేకాక అనేక చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెప్పించారు. ‘రాజహంస’, ‘పెళ్లివారమండీ’, ‘వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్’, ‘ఆరో ప్రాణం’, ‘దీర్ఘ సుమంగళీభవ’, ‘గొప్పింటి అల్లుడు’, ‘మెకానిక్ మామయ్య’, ‘చిరుజల్లు’, ‘ఇంద్ర’, ‘శక్తి’ వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో చివరిగా నాగార్జున, నాని కలిసి నటించిన ‘దేవదాస్’ చిత్రంలో కాసేపు తెరపై కనిపించారాయన.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.