బహుముఖ ప్రజ్ఞాశాలి.. ఎస్పీబీ

సృష్టిలో సంగీతానికి ప్రకృతి కూడా పరవశిస్తుంది. దానికున్న సమ్మోహనశక్తి అలాంటిది. ఘంటసాల వంటి ఎందరో మహానుభావులు తెలుగు సినీ సంగీతానికి పునాది వేస్తే, తదనంతరకాలంలో

Updated : 25 Sep 2020 14:55 IST

సృష్టిలో సంగీతానికి ప్రకృతి కూడా పరవశిస్తుంది. దానికున్న సమ్మోహనశక్తి అలాంటిది. ఘంటసాల వంటి ఎందరో మహానుభావులు తెలుగు సినీ సంగీతానికి పునాది వేస్తే, తదనంతరకాలంలో ఆ పునాదిపై సంగీత సౌధాన్ని నిర్మించింది ‘బాలు’ అని ముద్దుగా పిలుచుకొనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆబాల గోపాలాన్ని కట్టిపడేసే సమ్మోనశక్తి బాలు గళానికే కాదు ఆయన వ్యక్తిత్వానికీ ఉంది. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ప్రస్థానం ప్రారంభించినా, ఆ తర్వాత గాయకుడిగా అజరామరమైన పాటలను ఎన్నో ఆలపించారాయన. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఆయన పాడిన పాటలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, బుల్లితెర వ్యాఖ్యాతగా ఇలా బాలు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. -ఇంటర్నెట్‌డెస్క్‌

తండ్రే తొలి గురువు

స్పీ బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్‌ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ.  తండ్రి హరికథా కళాకారుడు. ఆయన భక్తిరస నాటకాలు కూడా ప్రదర్శిస్తూ ఉండేవారు. అలా బాలుకి చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి పెరిగింది. దీంతో తండ్రే తొలి గురువు అయ్యారు. ఐదేళ్ల వయసులో ‘భక్తరామదాసు’ నాటకంలో తండ్రితో కలిసి నటించారు. ప్రాథమిక విద్యను నగరిలో మేనమామ శ్రీనివాసరావు ఇంట పూర్తి చేసి, స్కూలు ఫైనల్‌ విద్యను శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో కొనసాగించారు. అప్పుడు చదువులోనే కాదు, ఆటల్లో కూడా బాలు స్కూలులో ప్రథముడే.

స్కూల్లో పాటలు.. నాటకాలు..

శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో పనిచేసే జి.వి.సుబ్రహ్మణ్యం అనే మాస్టారు బాలుతో ‘చెంచులక్ష్మి’ సినిమాలో సుశీల ఆలపించిన ‘పాలకడలిపై శేషతల్పమున’ అనే పాటను పాడించి టేప్‌ మీద రికార్డు చేశారు. బాలుకు అదొక మధురానుభూతి. మరో మేష్టారు రాధాపతి ప్రోత్సాహంతో ‘ఈ ఇల్లు అమ్మబడును’, ‘ఆత్మహత్య’, వంటి నాటికల్లో నటించి ప్రేక్షకుల మన్నన పొందారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీలో పీయూసీ చదువుతుండగా మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటకంలో స్త్రీ పాత్ర ధరించే అవకాశం వచ్చింది. తర్వాత విజయవాడ ఆకాశవాణిలో తాను స్వయంగా రాసి, బాణీ కట్టి ఆలపించిన ఒక లలిత గీతానికి బహుమతి లభించింది.

ఆర్కెస్ట్రా టు ఆర్టిస్ట్‌

పీయూసీ పరీక్షలు రాసి నెల్లూరు చేరుకొన్న బాలు ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని తయారు చేశారు. మిత్రులతో కలిసి ప్రోగ్రాములు ఇచ్చేవారు. తర్వాత అనంతపురంలో ఇంజినీరింగ్‌ సీటు రావడంతో అక్కడ చేరి వాతావరణం నచ్చక మళ్లీ నెల్లూరు వచ్చేశారు. ప్రత్యామ్నాయంగా మద్రాసు వెళ్లి ఇంజినీరింగ్‌ విద్యకు సరిసమానమైన ఎ.ఎం.ఐ.ఇ.లో చేరారు. అక్కడ చదువుతో పాటు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. ఇంజినీరింగ్‌ కోర్సు రెండో సంవత్సరంలో బాలుకి సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. ‘మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌’ అనే సినిమాలో రమాప్రభ పుట్టినరోజు వేడుకలో ‘హ్యాపీ బర్త్‌ డే టు యూ’ అంటూ పాటపాడుతూ తొలిసారి బాలు వెండితెరమీద దర్శనమిచ్చారు. తరువాత ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తనలోని నటనకు పదును పెట్టారు.

గాయకుడు కావాలని...

1964లో మద్రాస్‌ సోషల్‌ అండ్‌ కల్చరల్‌ క్లబ్‌ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో పాల్గొన్న ‘బాలు’కి మొదటి బహుమతి వచ్చింది. ఆ పోటీకి ప్రఖ్యాత సంగీత దర్శక త్రిమూర్తులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అంతేకాదు మరో సంగీత దర్శకుడు కోదండపాణి కూడా ప్రేక్షకుల మధ్య కూర్చుని ఆ పాట విన్నారు. ‘బాలు’ పాటపాడిన విధానం ఆయనకు నచ్చింది. అక్కడే బాలుని అభినందించి  సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఇస్తానని మాటిచ్చారు. అలా బాలు మద్రాసులో ఇంజినీరింగ్‌ చదువు కొనసాగిస్తూ సినిమా అవకాశాల కోసం తరచూ కోదండపాణిని కలుస్తూ ఉండేవారు. సంగీతం ఎవరి దగ్గరా నేర్చుకోకపోయినా రాగ తాళాల జ్ఞానం, సంగీత పరిజ్ఞానం పుష్కలంగా ఉండటంతో ట్యూను ఒకసారి వింటే యథాతథంగా పాడగలిగే విద్వత్తు బాలుకి సొంతం.

తొలి పాట అలా..

చ్చిన మాటకు కట్టుబడి కోదండపాణి బాలుకి ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ సినిమాలో తొలిసారి పాడే అవకాశమిచ్చారు. ‘ఏమి ఈ వింత మొహం’ పాటను కోదండపాణి వారం రోజులపాటు బాలుతో ప్రాక్టీసు చేయించారు. చివరకు అది సోలో పాట కాదని నలుగురు కలిసి పాడేదని తెలిసింది. అలా పి.సుశీల, కల్యాణం రఘురామయ్య, పి.బి.శ్రీనివాస్‌తో కలిసి బాలు పాడిన తొలిపాట 1966న డిసెంబరు 15న విజయా గార్డెన్స్‌లో రికార్డిస్ట్‌ స్వామినాథన్‌ ఆధ్వర్యంలో రికార్డయింది. పాట మొదటి టేక్‌లోనే ‘ఓకే’ కావడం విశేషం. 1967 జూన్‌ 2న విడుదలైన ఈ సినిమా చలనచిత్ర సంగీత ప్రపంచంలో గానగంధర్వుడు ‘బాలు’ ప్రభంజనానికి తెరలేపింది. బాలు సగర్వంగా ఎప్పుడూ చెప్పేమాట ఒకటుంది. ‘‘కోదండపాణి గారనే వ్యక్తే ఆనాడు లేకుంటే ఈనాడు బాలు ఉండేవాడు కాదు. ఆయనకు గాయకుడిగా నా భవిష్యత్తు మీద ఎంతో నమ్మకం. నా మొదటి పాట విజయా గార్డెన్స్‌ ఇంజినీరు స్వామినాథన్‌ గారితో చెప్పి ఆ టేప్‌ చెరిపేయకుండా సంవత్సరంపాటు అలాగే ఉంచేట్లు చేశారు. ఏ సంగీత దర్శకుడు అక్కడికి వచ్చినా వారికి వినిపించి, అవకాశాలు ఇమ్మని అడిగేవారట. ఏమిచ్చినా కోదండపాణి రుణం నేను తీర్చుకోలేను’’ అని బాలు గుర్తు చేసుకుంటూ ఉండేవారు. అలా మొదలైన బాలు పాట ప్రస్థానం వందలు.. వేలు దాటింది. వివిధ భాషల్లో ఆయన 40వేలకు పైగా పాటలు పాడి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సొంతం చేసుకున్నారు.

అన్ని తరాల సంగీత దర్శకులతో..

స్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రం నెమ్మదిగా అందరికీ నచ్చడం మొదలు పెట్టింది. ఆయన పాట లేకుండా సినిమా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. స్వర్ణయుగంగా పేర్కొనే సంగీత దర్శకుల సారథ్యంలో పాటలు పాడే అవకాశం బాలసుబ్రహ్మణ్యం దక్కించుకున్నారు. 1969 నుంచే బాలు బాగా బిజీ అయ్యారు. బాలు స్వరంలో వచ్చిన పాటలు యువతను విశేషంగా ఆకట్టుకోవడం మొదలు పెట్టాయి. పెండ్యాల, సత్యం, తాతినేని చలపతిరావు, మాస్టర్‌ వేణు, ఆదినారాయణ రావు, టి.వి.రాజు, యం.యస్‌.విశ్వనాథన్, ఇళయరాజా, జి.కె.వెంకటేష్, రమేష్‌ నాయుడు, అశ్వత్థామ, చక్రవర్తి, రాజ్‌-కోటి, రాజన్‌-నాగేంద్ర, కీరవాణి వంటి సంగీత దర్శకుల వద్ద బాలు కొన్ని వేల మరపురాని మధురమైన పాటలు పాడారు. ఇక అన్ని తరాల కథానాయకులకు ఎస్పీబీ పాటలు పాడారు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్‌ సహా ఈతరంలోని అగ్ర హీరోలందరికీ ఆయన పాటలు పాడటం విశేషం.

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా..

గాయకుడిగా తీరికలేకుండా ఉన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కావడం యాదృచ్ఛికంగా జరిగింది. కె. బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘మన్మథలీల’ చిత్రానికి తెలుగులో కమల్‌హాసన్‌కు గొంతు అరువివ్వడం ద్వారా ఆయన డబ్బింగ్‌ కెరీర్‌ మొదలైంది. ఆ తర్వాత రజనీకాంత్‌, విష్ణువర్థన్‌, సల్మాన్‌ఖాన్‌, కె.భాగ్యరాజా, మోహన్‌, అనిల్‌ కపూర్‌, గిరీశ్‌ కర్నాడ్‌, జెమినీ గణేశన్‌, అర్జున్‌, నాగేశ్‌, కార్తీక్‌, రఘువరన్‌కు ఆయన డబ్బింగ్‌ చెప్పారు. ‘దశావతారం’లో కమల్‌ నటించిన ఏడు పాత్రలకు ఎస్పీబీ డబ్బింగ్‌ చెప్పడం విశేషం. ‘అన్నమయ్య’లో వేంకటేశ్వరస్వామి పాత్ర పోషించిన సుమన్‌కు డబ్బింగ్‌ చెప్పడం ద్వారా ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఎస్పీబీ నంది అవార్డు గెలుచుకున్నారు. అటెన్‌ బరో దర్శకత్వంలో వచ్చిన  ‘గాంధీ’ చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషించిన కింగ్‌ బెన్‌స్లేకు ఎస్పీబీనే డబ్బింగ్‌ చెప్పారు.

నటుడిగానూ తనదైన ముద్ర

తెర వెనుక తన సుమధుర గానంతో అలరించిన బాలసుబ్రహ్మణ్యం.. నటుడిగా తెరపైనా అలరించారు. ఆయన నటించిన వాటిలో ఎక్కువగా అతిథిగా పాత్రలైనా అన్నీ గుర్తుండిపోయేవే. ‘ప్రేమికుడు’, ‘రక్షకుడు’, ‘పవిత్రబంధం’, ‘మిథునం’ తదితర చిత్రాల్లో ఆయన నటనతోనూ మెప్పించారు. చివరిగా నాగార్జున-నాని కథానాయకులుగా నటించిన ‘దేవదాస్‌’లో తళుక్కున మెరిశారు.

బుల్లితెర వ్యాఖ్యాతగానూ..

ప్పటి వరకూ గాయకుడిగా, నటుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా మాత్రమే ప్రేక్షకులకు పరిచయమైన బాల సుబ్రహ్మణ్యంలో గొప్ప వ్యాఖ్యాత ఉన్నారన్నది ‘పాడుతా తీయగా’తో బయటపడింది. ‘ఈటీవీ’లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులైన కొత్త గాయనీ గాయకులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. 1996లో మొదలైన ఈ కార్యక్రమం అనేక రూపాల్లో ప్రేక్షకులను రంజింప చేసింది. అమెరికాలోనూ ‘పాడుతా తీయగా’కు విశేష స్పందన లభించింది.

బాలు గానానికి అవార్డులు ఫిదా

స్పీ బాలసుబ్రహ్మణ్యం గానానికి మంత్రముగ్ధులు కాని వారంటూ ఎవరూ లేరు. అవార్డులు సైతం ఆయన వెంట వచ్చాయి. భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాలైన ‘పద్మభూషణ్‌’, ‘పద్మశ్రీ’ అవార్డులను బాలు అందుకున్నారు. ‘శంకారభరణం’(1979) చిత్రానికి గానూ తొలిసారి బాలు జాతీయ అవార్డును దక్కించుకున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు బాలీవుడ్‌కు వెళ్లిన ఆయనకు ‘ఏక్‌ తుజే కే లియే’ చిత్రానికి కూడా జాతీయ అవార్డు వచ్చింది. ‘రుద్రవీణ’, ‘సంగీత సాగర గానయోగి పంచాక్షర గవాయ్‌’ (కన్నడ), ‘మిన్సర కన్నవు’ (తమిళం) ( తెలుగులో మెరుపు కలలు) చిత్రాలకు జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ‘మైనే ప్యార్‌కియా’ చిత్రానికి గానూ తొలిసారి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. 2012లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం సహా, ఎనిమిది నంది అవార్డులు ఆయన సొంతమయ్యాయి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts