సంగీత సామ్రాట్‌కు పద్మవిభూషణ్‌తో సత్కారం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఆయన కేవలం వ్యక్తి మాత్రమే కాదు.. 16 భాషల నిఘంటువు.. 40వేలకు పైగా పాటలకు గొంతుక.. అంతకుమించి మంచి మనసున్న మనిషి.. గుణమున్న గురువు. సంగీత ప్రపంచానికి ఆయన అందించిన సేవలను కొనియాడాలంటే మాటలు సరిపోవేమో.

Updated : 26 Jan 2021 15:05 IST

ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్‌ ప్రకటించిన ప్రభుత్వం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఆయన కేవలం వ్యక్తి మాత్రమే కాదు.. 16 భాషల నిఘంటువు.. 40వేలకు పైగా పాటలకు గొంతుక.. అంతకుమించి మంచి మనసున్న మనిషి.. గుణమున్న గురువు. సంగీత ప్రపంచానికి ఆయన అందించిన సేవలను కొనియాడాలంటే మాటలు సరిపోవేమో. 1946 జూన్‌ 4న నెల్లూరులో శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి, శంకుతల దంపతులకు జన్మించారాయన. తన అమృత గానంతో దశాబ్దాల పాటు ప్రజలను రంజింపజేసి 2020 సెప్టెంబర్‌ 25న 74ఏళ్ల వయసులో దివంగతులయ్యారు. ఆ వార్త యావత్‌ సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మవిభూషణ్‌ ప్రకటించి గౌరవించింది. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని పలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

ఎస్పీ బాలును వరించిన పురస్కారాలు..
భారతీయ భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలతో బాలు అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా రికార్డు సృష్టించారు. ఆయన తన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నారు. 1979లో వచ్చిన సంగీత ‘శంకరాభరణం’ చిత్రానికి ఆయనకు తొలిసారిగా జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ‘ఏక్ దూజే కేలియే’ హిందీ చిత్రానికి గానూ రెండోసారి పురస్కారాన్ని అందుకున్నారు. తర్వాత 1983లో సాగర సంగమం,  1988లో రుద్రవీణ చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. 
* 2001లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీతో గౌరవించింది.
* 1999లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌.
* 2011లో పద్మభూషణ్ 
* 2016లో శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారం.
* 2012లో మిథునం చిత్రానికి గానూ నంది పురస్కారం.

మనం పోయినా పాట బతికే ఉంటుంది..

భారతీయ సంగీత చరిత్రలో ఎంతో అనుభవజ్ఞులుగా పేరుతెచ్చుకున్న బాలు తుదిశ్వాస వరకూ నిత్యవిద్యార్థిలాగే ఉండేవారు. అంతటి ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ తన పొరపాటును నిర్మొహమాటంగా ఒప్పుకొనేవారు. గాయకులకు భాషపట్ల అవగాహన లేకపోతే చాలా ఇబ్బంది వస్తుందనేవారాయన. ‘సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి.. దాన్ని ఆనందించాలి. ఆ ఆస్వాదనలోంచి పాటను బయటికి తీసుకురావాలి.. అప్పుడే ఆ పాట అందంగా తయారవుతుంద’ని చెప్పేవారు. సంగీత దర్శకుడు చిన్నవాడనో లేదా మన పాటకు నటించే వారు చిన్న కళాకారులనో చెప్పి గాయకులు అల్లాటప్పాగా పాడేయకూడదు. మన పాటకు అభినయించేది ఎవరు? అతని ముఖంలో ఏ భావమూ ఉండదు. మనం ఎలా పాడితే ఏంటి అని పాడేసి వెళ్తే అర్థముండదు. శ్రోతలను దృష్టిలో పెట్టుకోవాలి. సినిమా పోయిన తర్వాత కూడా పాట బతికుంటుందన్నది బాలు విశ్వాసం. అందుకే ‘నేను గొప్ప గాయకుడిని కాకపోవచ్చు.. కానీ మంచి గాయకుడిని’ అని గర్వంగా చెప్పేవారు.

బాలు జీవితం తెరిచిన పుస్తకం..

బాలు అంతటి గొప్ప వ్యక్తులు సాధారణంగా గోప్యత కోరుకుంటారు. కానీ.. ఆయన జీవితం మాత్రం తెరిచిన పుస్తకంలాంటిది. ఆయనేంటో అందరికీ తెలుసు. యాభై నాలుగేళ్ల ఆయన గాన ప్రస్థానంలో దాదాపు నలభై ఎనిమిదేళ్లు అసలు తీరిక లేకుండా ఉన్నారు. ఒక రోజులో పది పాటలకు పైగా పాడిన సందర్భాలూ ఉన్నాయి. గత ఆరేడేళ్లుగా రోజుకు కనీసం ఒక్క పాటైనా పాడుతూ వచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ.. ఇలా లెక్కకు మించిన భాషల్లో పాటలు పాడిన ఘనత బాలుకే చెల్లింది. హీరోకు తగ్గట్లు గొంతు సవరించి పాటలు పాడటమే కాదు.. డబ్బింగ్‌ చెప్పడం, నటన పండించడంలోనూ బాలు సిద్ధహస్తుడు. ‘మిథునం’లో బాలు నటన అమోఘమన్న నటులెందరో ఉన్నారు. ఆయన పాడిన ఎన్నో పాటలకు ఎన్నో అవార్డులు వచ్చాయి.

ఇదీ చదవండి..

ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్‌

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని