హీరోగా నో చెప్పిన బాలు!

తన సుమధుర గానంతో శ్రోతలకు వీనుల విందును పంచిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం ఈలోకాన్ని విడిచి వెళ్లారు. గాయకుడిగానే

Published : 25 Sep 2020 18:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన సుమధుర గానంతో శ్రోతలకు వీనుల విందును పంచిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం ఈలోకాన్ని విడిచి వెళ్లారు. గాయకుడిగానే కాదు, డబ్బింగ్‌ కళాకారుడిగా, నటుడిగా వెండితెర ముందూ వెనుక తనదైన ముద్రవేశారు. గాయకుడిగా బిజీగా ఉన్న సమయంలోనూ చక్కని పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. బాలూ తొలిసారిగా వెండితెరపై కనిపించిన చిత్రం మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌(1972).

ఆ సినిమాలో ఒక పుట్టిన రోజు వేడుక ఉంది. ఆ వేడుకలో ఒకరు పాట పాడాలి. ఆ పాటను బాల సుబ్రహ్మణ్యంతో పాడించి రికార్డు చేయించారు. అయితే, ఆ సన్నివేశంలో ఎవరు నటిస్తే బాగుంటుందా? అని తర్జనభర్జనలు పడ్డారు దర్శక-నిర్మాతలు. షూటింగ్‌ చేసే సమయానికి సినిమాలో కూడా బాలూతోనే పాట పాడిస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయం ఆయనకు చెబితే అంగీకరించారు. అలా గాన గంధ్వరుడు తొలిసారి తెరపై కనిపించారు. నటుడిగా ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను చేసిన బాలసుబ్రహ్మణ్యం బాపు-రమణల రెండో చిత్రం ‘బంగారు పిచిక’లో కథానాయకుడిగా చేసేందుకు మాత్రం అంగీకరించలేదు.

‘బంగారు పిచిక’ (1968)కి కొత్త నటుల్ని నాయికానాయకులుగా తీసుకుందామనుకున్నారు. సినిమా నాయిక లక్షణాలు లేకుండా సహజంగా ఉంటారని ప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణిని అనుకున్నారు. ఆ పాత్ర కోసం ఆమెను సంప్రదించగా, అందుకు సులోచనారాణి ఒప్పుకోలేదు. తనకి నటన తెలియదని, ఆ ఉత్సహం లేదనీ చెప్పారు. నాయక పాత్రకి యస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం అయితే బాగుంటారని అనుకున్నారు. ఆయనను కూడా కలిసి విషయం చెప్పారు. అయితే, ఎందుకనో ఇద్దరూ కుదరక, చంద్రమోహన్‌, విజయ నిర్మలతో తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని