అక్షరమంటే... మాటంటే... భాషంటే ఇష్టం

యాభై ఏళ్లుగా జీవనదిలా ప్రవహిస్తున్న బాలు పాటకు ఆసేతుహిమాచలమంతా అభిమానులే. సాహిత్యాన్ని అర్థం చేసుకుని.. పాట ఆత్మను ఆవాహనం చేసుకుని ఆలపించే అరుదైన గాయకుడిగా ఆయనది ఓ ప్రత్యేక పథం.

Updated : 26 Sep 2020 00:24 IST

యాభై ఏళ్లుగా జీవనదిలా ప్రవహిస్తున్న బాలు పాటకు ఆసేతుహిమాచలమంతా అభిమానులే. సాహిత్యాన్ని అర్థం చేసుకుని.. పాట ఆత్మను ఆవాహనం చేసుకుని ఆలపించే అరుదైన గాయకుడిగా ఆయనది ఓ ప్రత్యేక పథం. అంతేనా! ‘పాడుతాతీయగా’తో ఔత్సాహిక గాయనీ గాయకులకు ఓ గురువుగా తన అనుభవ జ్ఞానాన్నీ పంచిపెట్టారు. ఇటీవల ఆయన ‘తెలుగువెలుగు’తో తన అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నారు. మాతృ భాష పట్ల ఉన్న మమకారాన్ని వ్యక్తం చేశారు. బహుశా ఇదే ఆయన పత్రికలకు ఇచ్చిన ఆఖరి ఇంటర్వ్యూ. దివికేగిన గానగంధర్వుడిని గుర్తు చేసుకుంటూ... ఆ ఇంటర్వ్యూ మీ కోసం!

నా జీవితం తెరచిన పుస్తకం. నా గురించి అందరికీ అంతా తెలుసు. ఏదో గొప్ప గొప్ప బిరుదులు ఇచ్చేస్తూ ఉంటారు.. నాకు అది ఇష్టం ఉండదు. నా పేరు ముందర అవి పెట్టి రాయడమూ నచ్చదు. గొప్ప గాయకుణ్ని కాకపోవచ్చు కానీ, నేను మంచి గాయకుణ్ని. సంగీత సాహిత్యాల్లో అభినివేశం లేకపోతే గాయకులు కాలేరు. సాహిత్యాన్ని ఆకళింపు చేసుకుని పాడితేనే ఎవరైనా రాణిస్తారు. అందుకే ఆ దిశగా నన్ను నేను సానబెట్టుకుంటూ వస్తున్నాను. నిజం చెప్పాలంటే అది చాలా అవసరం. ‘పాడుతా తీయగా’ వేదిక మీద కానీ, మరోచోట కానీ అవకాశం వచ్చినప్పుడల్లా పాటల సాహిత్యం గురించి మాట్లాడతాను.. అక్షరం పట్ల నా ప్రేమ అది. ఎక్కువగా చదవడం వల్ల అబ్చిన లక్షణమది.. చదవడం అంటే పుస్తకాలొక్కటే కాదు. వ్యక్తులను చదువుతాను. వారి మాటలను శ్రద్ధగా వింటాను. ఏ సభకు నాకు ఆహ్వానం వచ్చినా రెండు విషయాలు ఆలోచిస్తాను. ఆ సభకు నావల్ల ఏదైనా ఉపయోగం ఉందా.. లేకపోతే అక్కడి నుంచి నేనేమైనా కొత్తవి తెలుసుకోగలుగుతానా అని! అలా వెళ్లినప్పుడల్లా గొప్ప వక్తల మాటలను వింటాను. వాళ్లు మాట్లాడే మంచి విషయాలను ఆకళింపు చేసుకుని పదిమందికీ చెబుతూ ఉంటాను.  

యాభై నాలుగేళ్ల నా గాన ప్రస్థానంలో దాదాపు నలభై ఎనిమిదేళ్లు అసలు తీరిక లేకుండా ఉన్నాను. ఒక రోజులో పది పాటలకు పైగా పాడిన సందర్భాలున్నాయి. గత ఆరేడేళ్లుగా రోజుకు కనీసం ఒక్క పాటైనా పాడుతు న్నాను. అంటే, ఇప్పటికీ వృత్తిపరంగా చురుగ్గానే ఉన్నాను. అయితే, ఓ పాట పూర్తిచేయడానికి చాలా సమయం పడుతుంది. నా గళానికి సరిపోయే శ్రుతులను చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే, మంచి సాహిత్యం ఉండే పాటలనే ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. అందరూ మల్లాది, వేటూరి, సిరివెన్నెలలా రాయాలనుకోను కానీ, ఏ పాట సాహిత్యంలోనైనా ఓ పద్ధతి ఉండాలి. అది గమనిస్తాను. అలాగే, అర్థంపర్థం లేని బాణీలు ఉన్నా కూడా ఒప్పుకోవట్లేదు. ఈ కారణాలేవీ వారికి చెప్పను. ‘ఈ పాటను నేను పాడలేనేమోనండీ’ అని చెప్పి తప్పించుకుంటాను. సాహిత్యం లేకపోతే సంగీతం లేదు. ఒక భావాన్ని, సందర్భాన్ని సినిమాలో చెప్పాలన్నప్పుడు ఓ మంచి బాణీతో చక్కటి అక్షరాల మాలికగా కలిపితేనే వినేవాడికి అది అందంగా చేరుతుంది. అందుకే మాటల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తాను. 

ఆషామాషీగా పాడకూడదు

పాటల్లోని పదాలను నేను తప్పుగా ఉచ్చరించిన సందర్భాలూ ఉన్నాయి. వాటి గురించి ‘పాడుతా తీయగా’లో లేదా కచ్చేరీల్లోనూ చెబుతుంటాను. ‘ఈ పొరపాటు జరిగింది.. ఆ రోజు నన్ను ఎవరూ సరిదిద్దలేదు’ అంటూ ఇలా పాడకండని పిల్లలకు చెబుతుంటాను. నేనే కాదు నాకంటే పెద్దవాళ్లు పాడిన పాటల్లో కూడా ఉచ్చారణ దోషాలు ఉన్నాయి. కానీ, వాటిని సరిదిద్దాల్సిన వాళ్లు అప్పట్లో ఎందుకు పట్టించుకోలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. గాయకులకు భాషపట్ల అవగాహన లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలి.. దాన్ని ఆనందించాలి. ఆ ఆస్వాదనలోంచి పాటను బయటికి తీసుకురావాలి. అప్పుడే ఆ పాట చాలా అందంగా తయారవుతుంది. ఒక పాట కోసం సంగీత దర్శకులు, రచయితలు చాలా కసరత్తు చేస్తారు. అలా పాటంతా సిద్ధమైన తర్వాతే మా దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత గాయకులు తమ వంతు కసరత్తు చేసి పాడాలి. ఒప్పుకున్న ప్రతి పాటకూ ఇలాగే న్యాయం చేయాలి. సంగీత దర్శకుడు చిన్నవాడనో లేదా మన పాటకు నటించే వారు చిన్న కళాకారులనో చెప్పి గాయకులు అల్లాటప్పాగా పాడేయకూడదు. మన పాటకు అభినయించేది ఎవరు? అతని ముఖంలో ఏ భావమూ ఉండదు. మనం ఎలా పాడితే ఏంటి అని పాడేసి వెళ్తే అర్థముండదు. శ్రోతలను దృష్టిలో పెట్టుకోవాలి. సినిమా పోయిన తర్వాత కూడా పాట బతికుంటుంది. దాన్ని వినేవాళ్లకు రసాను భూతిని కలిగించాలి. అప్పుడే గానానికి సార్థకత. సంగీత దర్శకుడు నన్ను నమ్మి పాట ఇచ్చినందుకు తగిన న్యాయం చేశాననే సంతృప్తి మనకుండాలి. ఇష్టం లేకపోతే అసలు ఒప్పుకోకూడదు.

పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్‌ చేయండి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని