Published : 16 Oct 2021 14:48 IST

Tollywood: ఓటీటీ నిండుగా.. సినిమా పండగ

ఓటీటీ వేదిక ఇప్పుడు సొంతింటి వెండితెరలా మారిపోయింది. ఒకప్పుడు థియేటర్లలో విడుదలయ్యాకే ఓటీటీ బాట పట్టే సినిమాలు.. కొంతకాలంగా నెట్‌ఫ్లిక్స్‌, ఆహా, అమెజాన్‌ ప్రైమ్‌ లాంటి డిజిటల్‌ వేదికలపై నేరుగా వినోదాల విందును పంచుతున్నాయి. ఈ ఏడాది చిన్నచితకా హీరోలే కాదు, స్టార్‌ కథానాయకుల సినిమాలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. అలా ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు ఏ ప్లాట్‌ఫామ్‌పై అందుబాటులో ఉన్నాయో చూద్దాం.

నారప్పను చూసి తీరాలప్ప

కమర్షియల్‌ సినిమాలకు టాలీవుడ్‌లో కొదవలేదు.  సామాజిక అంశానికి కమర్షియల్‌గా చెప్పడంలో నారప్ప’ విజయం సాధించింది. తమిళ చిత్రానికి రీమేక్‌ అయినప్పటికీ వెంకటేశ్‌ నటనతో కట్టిపడేశాడు. ‘నారప్ప’గా వయసుమీరిన పాత్రలో విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఓటీటీలో విడుదలై విజయం సాధించింది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. ప్రియమణి కథానాయిక. అమెజాన్‌ ప్రైమ్‌లో ఉందీ చిత్రం.


టక్‌ జగదీశ్‌

నాని గతేడాది ‘వి’ అనే యాక్షన్‌ థ్రిల్లర్‌ని అమెజాన్‌ ప్రైమ్‌లో డైరెక్ట్‌గా విడుదల చేశాడు. ‘టక్‌ జగదీశ్‌’ను థియేటర్లలో అందించాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఓటీటీ బాట పట్టిందీ చిత్రం. స్టైలిష్‌ లుక్‌తో నాని అదరగొట్టాడు. ప్రస్తుత  పండగ వాతావరణానికి ఇది సరైన చిత్రం. సినిమా నిండా కుటుంబ భావోద్వేగాలను పండించాడు దర్శకుడు.   మిశ్రమ స్పందన లభించినప్పటికీ కుటుంబ ప్రేక్షకులను మెప్పించింది. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది!


కితకితల చోరుడు

సినిమా ఏదైనా అందులో ఎంతో కొంత కొత్తదనం ఉండేలా జాగ్రత్తపడతాడు శ్రీవిష్ణు. అలా ఈ ఏడాది థియేటర్లలో విజయం సాధించిన చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాశ్‌, సునైన హీరోయిన్లుగా చేశారు.  కథనంతోనే ఆకట్టుకునే ఈ సినిమాలో వచ్చే కామెడీ సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇది బుల్లితెర మీద అలరించేందుకు జీ5లో విడుదలైంది.


థ్రిల్లింగ్‌‌.. మాస్ట్రో

కమర్షియల్‌, రొమాంటిక్‌ లవ్‌స్టోరీలతో ఆకట్టుకున్న హీరో నితిన్‌. ఈ సారి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హిందీ సూపర్‌ హిట్‌ ‘అంధాదూన్‌’ కి ఇది రీమేక్‌. నభా నటేష్‌ హీరోయిన్‌. తమన్నా లేడీ విలన్‌గా నటించారు. ఓ హత్య చుట్టూ జరిగే ఈ సినిమా కథలోని మలుపులు వీక్షకులకు ఊపిరాడనివ్వవు. ప్రస్తుతం  డిస్నీ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.


నవ్వుల రత్నాలు

కరోనా తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ‘జాతిరత్నాలు’  విజయవంతమైంది. కొవిడ్‌ విలయ తాండవానికి విలవిల్లాడిన జనాలకు కామెడీ టానిక్‌లా పనిచేసిందీ చిత్రం. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామక్రిష్ణ జోగిపేట్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చి చేసిన హంగామాను చూసి తీరాల్సిందే. మీరూ ఆ హాస్యపు జల్లుల్లో తడవాలంటే అమెజాన్‌ ప్రైమ్‌లో ఉంది చూసేయండి. 


తిమ్మరుసు న్యాయం

సత్యదేవ్‌ నిజాయతీపరుడైన లాయర్‌ రామ్‌గా నటించిన సినిమా ‘తిమ్మరుసు’. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన క్యాబ్‌ డ్రైవర్‌ మర్డర్‌ కేసును రామ్‌ రీఓపెన్‌ చేస్తాడు. అప్పటి నుంచి అడుగడుగున ఆటంకాలు ఏర్పడతాయి. ఆ కేసులో శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? తన ప్రయత్నాలకు ఎవరు అడ్డుపడుతున్నారనేది తెలుసుకునే కొద్ది ఉత్కంఠ రేగుతుంది. ఈ థ్రిల్‌ను ఆస్వాదించాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది చూసేయండి. 


నరేశ్‌ నాంది

హాస్య చిత్రాలను చేస్తూ వచ్చిన అల్లరి నరేశ్‌ రూటు మార్చి తీసిన సీరియస్‌ క్రైమ్‌ డ్రామా ‘నాంది’. నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో నటించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీగా నరేశ్‌ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు. ఇది ఆహాలో ఉంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని