Gundu Sudarshan: ‘ఆవిడని కూర్చోపెట్టండి.. ఎంతసేపు నిలబెడతారు’ అని అరిచాడు...
ప్రముఖ కమెడియన్ గుండు సుదర్శన్ (Gundu Sudarshan) ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తన మాటలతో, విలక్షణ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు కమెడియన్ గుండు సుదర్శన్ (Gundu Sudarshan). ఆయన ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi) కార్యక్రమానికి అతిథిగా వచ్చి.. తన సినీ జీవితంలో జరిగిన సంఘటనల గురించి పంచుకున్నారు. మరి ఆ సంఘటనల సంగతులేంటో మీరు చూసేయండి.
మీ జీవితంలో జరిగిన ఫన్నీ సంఘటనల గురించి చెప్పండి?
సుదర్శన్: లైఫ్‌లో ఫన్నీ ఘటనలు చెప్పమన్నారు కాబట్టి సరిపోయింది.. అదే వైఫ్‌తో ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే కష్టం. ఎందుకంటే అవి ఫైర్‌తో సమానం (నవ్వుతూ). నాకు సివిల్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చిన కొత్తల్లో మాకు తెలిసిన ఒకాయన ‘ఏం ఉద్యోగం చేస్తున్నావు’ అని అడిగారు. సివిల్ ఇంజనీర్‌ని.. బిల్డింగ్‌లకు ప్లాన్‌లు చెబుతూ కట్టిస్తుంటా అని వివరంగా చెప్పా. వెంటనే నాతో ఆయన ‘ఓహో మేస్త్రీ వా’ అని వెళ్లిపోయారు. ఆ దెబ్బకు నేను జాబ్ మానేసి లెక్చరర్‌గా జాయిన్ అయ్యా.
మీ అసలు పేరేంటి గుండు సుదర్శన్ అని ఎందుకు అంటారు?
సుదర్శన్: మాది భీమవరం. పుట్టి పెరిగింది అంతా అక్కడే. మా నాన్న అడ్వకేట్. నాకు సైకాలజీ, లా అంటే ఇష్టం. కానీ మా తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదవమన్నారు. అందుకే అది చదివాను. తర్వాత కొన్నిరోజులకు నాకు ఇష్టమైన కోర్సులు కూడా చేశాను. నా అసలు పేరు సూరంపూడి సుదర్శన్ (Surampudi Sudarshan). బాపు గారు సుదర్శనం అని పిలిచేవారు. ఆ తర్వాత ఏదో మీడియాలో నా పాత్ర పేరు చెబుతూ గుండు సుదర్శన్ అని రాశారు. ఇక అదే కొనసాగుతోంది. ఇప్పుడు గుండు ఓ బ్రాండ్ అయిపోయి.. ట్రేడ్ మార్క్‌గా మారిపోయింది.
లెక్చరర్‌గా చేసేటప్పుడు పాఠాలు కూడా నవ్విస్తూనే చెప్పేవారా?
సుదర్శన్: పాఠాలు, పరీక్షలు, ప్రాక్టికల్స్ ఇవన్నీ సీరియస్ మ్యాటర్స్. కాలేజీల్లో కామెడీ ఎప్పుడైనా బల్లకు అవతలి వైపు (స్టూడెంట్స్ వైపే) ఉంటుంది తప్ప లెక్చరర్స్ వైపు ఉండదు. అందుకే సీరియస్‌గానే పాఠాలు చెప్పేవాడిని. అప్పుడప్పుడు నవ్వించేవాడిని. లెక్చరర్‌గా 17సంవత్సరాలు పనిచేశాను.
‘మిధునం’ రచయిత శ్రీరమణగారిని ఎందుకు కలవాలనిపించింది? అప్పుడు ఏం జరిగింది?
సుదర్శన్: నేను ఇంటర్ చదివేటప్పుడే రమణగారికి వీరాభిమానిని. ఆయన రచనలంటే చాలా ఇష్టం. వాళ్ల బంధువులబ్బాయి నాకు మంచి స్నేహితుడు. ఆయన్ని అలా కలిశాను. మా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అలా తరచుగా ఆయన్ని కలుస్తుండేవాడిని. ఓరోజు రాత్రి నాకు ఆయన ఫోన్ చేశారు. ‘నవ్వితే నవ్వండి’ అని బాపు గారు ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అందులో నటించడానికి మీకు ఆసక్తి ఉందా అని అడిగారు. నేను ఆశ్చర్యపోయాను. మరుసటి రోజు స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఓకే చేశారు.
‘శ్రీనాథ కవి సార్వభౌముడు’ (Srinatha Kavi Sarvabhoumudu) సినిమా అనుభవాలు చెప్పండి?
సుదర్శన్: బాపు-రమణలు, ఎన్టీఆర్ (NTR) కాంబినేషన్‌లో వచ్చిన సినిమా అది. అలాంటి లెజెండ్స్ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. వాటిని అనుభవాలు అని చెప్పను.. అనుభూతులు అంటాను. నన్ను బాపు గారు ఎన్టీఆర్‌కు పరిచయం చేసి నా పాత్ర గురించి చెప్పారు. ఆయన వెంటనే ఇక్కడే ఉండండి అన్నారు. అది ఇంకో అద్భుతం. ఆయనతో ఉంటూ, ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం దక్కింది. ఆతర్వాత రాజేంద్ర ప్రసాద్ ‘మిస్టర్ పెళ్లాం’ (Mister Pellam) సినిమాలో డ్యూయల్ రోల్ చేశా. అదొక ఆశ్చర్యకరమైన అదృష్టం.
బాపు గారి ‘రాంబంటు’లో పాత్ర గురించి చెప్పండి ?
సుదర్శన్: బాపుగారి సినిమాలు నాకు హ్యాట్రిక్. మొదట ‘శ్రీనాథ కవి సార్వభౌముడు’. తర్వాత ‘మిస్టర్ పెళ్లాం’. వెంటనే ‘రాంబంటు’ (Rambantu). మధ్యలో భాగవతంలో కూడా కనిపించాను. రాంబంటు సినిమాలో నా పాత్రకు మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. బాపు గారి క్రియేషన్ అలా ఉంటుంది. కోటా శ్రీనివాస్‌గారితో, కైకల సత్యనారాయణతో కలిసి పనిచేయడం మంచి అనుభూతి. వాళ్ల డైలాగ్స్ విని చాలా నేర్చుకున్నా. మిస్టర్ పెళ్లాం సినిమాలో ‘అంతా విష్ణుమాయ’ అనే డైలాగ్ కూడా బాగా పండింది.
తనికెళ్ల భరణి (Tanikella Bharani) గారిని ఎలా కలిశారు?
సుదర్శన్: ఆయన్ని మొదట ఏదో సభలో క్యాజువల్‌గా కలిశాను. ఆతర్వాత మంచి అనుబంధం ఏర్పడింది. ఇద్దరం మిత్రులమయ్యాం. నా రచనలు ఆయన ఇష్టపడతారు. ఆయనతో కలిసి చాలా టూర్స్‌కు వెళ్లా. ఓ సారి దుబాయ్‌లో కార్యక్రమం కోసం నాతో బామ్మ వేషం వేయించారు. తనికెళ్ల భరణిగారు ఆడియన్స్‌తో నన్ను వాళ్ల బామ్మగా పరిచయం చేశారు. నేను మాట్లాడుతుండగా మధ్యలో ఒకతను లేచి నన్ను నిజంగానే ముసలావిడని అనుకొని ‘ఆవిడని కూర్చొపెట్టండి. ఎంతసేపు నిలబెడతారు’ అని అరిచాడు. అప్పుడు భరణిగారు బామ్మకాదు అంటూ నన్ను పరిచయం చేశారు. ఆ దెబ్బకు స్టేజ్ అంతా చప్పట్లతో మారుమోగింది.
సినిమాల్లో వరసగా అవకాశాలు వచ్చేవా?
సుదర్శన్: దాసరి నారాయణగారు, జంధ్యాల గారు, ఈవీవీ గారు.. వీళ్లందరి నుంచి అవకాశాలు వచ్చేవి. కానీ నేను లెక్చరర్‌ని అవ్వడంతో నాకు నటించడం కుదిరేది కాదు. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు అలా 5 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది.
‘చిత్రం’ సినిమాలో అవకాశం గురించి చెప్పండి?
సుదర్శన్: అది ఉషా కిరణ్ మూవీస్ పుణ్యమే. సెకండ్ ఇన్నింగ్స్‌లో చిత్రం సినిమాతో మొదలైంది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వరసగా అవకాశాలు వచ్చాయి. ‘కబడ్డీ కబడ్డీ’, ‘ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం’... అలా మంచి పాత్రలు వచ్చాయి. కబడ్డీ కబడ్డీ సినిమా తర్వాత చాలా సినిమాల్లో నేను పురోహితుడి పాత్రలు వేశా.
‘అతడు’ (Athadu) సినిమాలో మీ డైలాగ్ చాలా ఫేమస్ అయింది కదా.. అనుకున్నారా అలా అవుతుందని?
సుదర్శన్: అతడు సినిమాలో నాకు ఒక్కటే సీన్. ఎమ్మార్వోగా చేశా. ‘ఎకార్డింగ్ టూ ద సర్వే నంబర్..’ అని ఒక్క డైలాగ్ ఎంత హిట్ అయిందో. ప్రతిచోటా అదే డైలాగ్ వినిపించేది. నేను, భరణి గారు వెళ్తుంటే ఒకతను వచ్చి ఆ డైలాగ్ చెప్పి వెళ్లిపోయాడు. తర్వాత చాలాసేపు నవ్వుకున్నాం. ఆ సంఘటన మర్చిపోలేను.
ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు. మీకు ఇష్టమైన పాత్ర ఏది?
సుదర్శన్: నేను మాములుగా లెక్కల్లో చాలా పూర్ (నవ్వుతూ). సుమారుగా 350 సినిమాల్లో నటించి ఉంటా. గొప్ప గొప్ప పాత్రలు చెయ్యకపోయినా.. మంచి గుర్తింపు ఉన్న పాత్రలు చేశాను. నేను మంచి నటుడిని అని ఆడియన్స్ అనుకునే పాత్రలు చేశా. రీసెంట్‌గా హ్యాపీ బర్త్‌డే సినిమా చేశా. మంచి రివ్యూస్ వచ్చాయి. ‘గుంటూర్ టాకీస్’ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాను. ఆ పాత్ర చాలా బాగుంటుంది.
సినిమాల్లో నటిస్తూనే రాయడం కూడా చేస్తున్నారు.. అలా రాయాలని ఎందుకనిపించింది?
సుదర్శన్: నేను ఏదో సరదాగా మొదలు పెట్టాను. ‘హాస్యానందం’ పేరుతో ప్రేక్షకుల ప్రశ్నలకు హాస్యంగా సమాధానాలు ఇస్తుంటా. అది 10 సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. అది సూపర్ హిట్ చాలా మంది ప్రముఖలు కూడా ప్రశ్నలు పంపేవాళ్లు.
‘చిత్తం.. చిత్తం ప్రాయశ్చిత్తం’ అనే కార్యక్రమంలో మీరు చిత్రగుప్తుడి వేషం వేశారు కదా దాని గురించి చెప్పండి?
సుదర్శన్: అది భలే ప్రోగ్రాం. ఓ ప్రముఖ ఛానల్‌లో టెలికాస్ట్ అయ్యేది. సినిమా రేంజ్‌లో హిట్ అయింది. అదే టైంకు మరో ఛానల్‌లో సుమ ప్రోగ్రామ్ వచ్చేది. ఇంకో ఛానల్‌లో బాలుగారి ప్రోగ్రామ్ వచ్చేది. వీటి మధ్యలో నా కార్యక్రమం సూపర్ హిట్ అయింది.
సినిమాల కంటే ఉద్యోగమే నయం అని ఎప్పుడైనా అనుకున్నారా?
సుదర్శన్: విధి నన్ను సినిమాల వైపు తీసుకువెళ్లింది. నాకు దానిపై ఉన్న కోరికతో అది నా వృత్తిగా మారిపోయింది. సాధారణంగా ఇష్టంతో పనిచేస్తే అది కష్టంగా అనిపించదు. నేను చదువు చెప్పిన చాలా మంది స్టూడెంట్స్ నా కామెడీ చూసి నవ్వుకుంటున్నామంటూ ఫోన్‌లు చేసి చెబుతుంటారు.
మీ కుటుంబం గురించి చెప్పండి?
సుదర్శన్: నా భార్య పేరు విజయలక్ష్మి. ఆమె సపోర్ట్ వల్లే నేను ఇలా కొనసాగుతున్నా. నాకు ఇద్దరు పిల్లలు. వాళ్లిద్దరూ సెటిలయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Atlee: ‘రాజారాణి’ టు ‘జవాన్’.. నేనెంతో గర్వపడుతున్నా: అట్లీ సతీమణి పోస్ట్
-
Airtel: ఎయిర్‌టెల్‌కు ట్రాయ్ రూ.2.81 కోట్ల జరిమానా
-
Gold Robbery: రూ.25 కోట్ల నగల చోరీ కేసులో కీలక పురోగతి
-
IPO: ఐపీఓకు క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దరఖాస్తు
-
Crime: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిందని.. నిప్పంటించిన తల్లి, సోదరుడు
-
ICC World Cup: వరల్డ్ కప్ లక్ష్యంగా.. ‘ఖలిస్థానీ ఉగ్రవాది’ పన్నూ బెదిరింపులు..!