Shiva Balaji: జాతకాలు కుదరలేదని బ్రేకప్‌ చెప్పేసుకున్నాం..: శివ బాలాజీ

సెలబ్రిటీ టాక్‌ షో ‘అలా మొదలైంది’కి నటుడు శివ బాలాజీ (Shiva Balaji) ఆయన భార్య మధుమిత (Madhumitha)తో కలిసి వచ్చారు. వారి జీవితంలో జరిగిన సరదా సన్నివేశాలను పంచుకున్నారు.

Updated : 08 Jun 2023 10:19 IST

టాలీవుడ్‌లో క్యూట్‌ కపుల్స్‌ అనగానే శివ బాలాజీ, మధుమిత (Madhumitha) గుర్తొస్తారు. వీళ్లిద్దరూ ‘అలామొదలైంది’ కార్యక్రమానికి అతిథులుగా వచ్చి వాళ్ల లైఫ్‌లో జరిగిన సంఘటనలను పంచుకున్నారు. సినిమాల్లో లాగానే వాళ్ల ప్రేమలో ఎన్ని ట్విస్ట్‌లు ఉన్నాయో చెప్పారు. మధుమిత కోసం శివ బాలాజీ (Shiva Balaji) ఎలాంటి కొంటె పనులు చేశాడు.. ఇక అతడిని పెళ్లి చేసుకోవడం కోసం మధు ఎలాంటి పనులు చేసింది.. వాళ్లిద్దరూ ఒక్కటవ్వడం కోసం ఏం చేశారు.. ఇలాంటి ఎన్నో విషయాలను వెన్నెల కిషోర్‌తో షేర్‌ చేసుకున్నారు. అవేంటో మీరు చదివేయండి..

మీ ప్రయాణం ఎలా మొదలైంది?
శివ బాలాజీ: ‘ఇంగ్లిష్‌ కరన్‌’ సినిమాలో మేమిద్దరం కలిసి నటించాం. అప్పుడు దర్శకుడు పరిచయం చేశారు. కానీ నాకు మధు అంతకు ముందే తెలుసు. ఆ సినిమా సమయంలో పరిచయం ఏర్పడింది.
మధుమిత: ‘ఇది మా అశోక్‌గాడి లవ్‌ స్టోరీ’లో శివని చూసినప్పుడే.. ఈ అబ్బాయి ఎవరో బాగున్నాడనుకున్నాను. కానీ తనతో కలిసి నటించే అవకాశం వస్తుందనుకోలేదు. ‘ఇంగ్లిష్‌ కరన్‌’ సమయంలో దర్శకుడు పరిచయం చేయగానే నేను చాలా ఆశగా పలకరించాను. శివ మాత్రం ఏదో సాధారణంగా హలో చెప్పి వెళ్లిపోయాడు. కొంచెం ఫీలయ్యాను. ఏంటి ఇలా పలకరించాడు అనుకున్నా.

మాటలు ఎప్పుడు మొదలయ్యాయి?
మధుమిత: మొదట్లో నేను హాయ్‌ అంటే హాయ్ అనేవాడు. ఆ తర్వాత నాపై ఆయనకు ఆసక్తి కలిగింది.
శివ బాలాజీ: ఆ సెట్‌లో మేమిద్దరమే తెలుగు వాళ్లం. తన మనస్తత్వం కూడా చాలా నచ్చింది. అప్పటి నుంచి ట్రై చేశాను. ఒకసారి ఔట్‌డోర్‌ షూటింగ్‌కు వెళ్లినప్పుడు తనకు రూమ్‌లో ఏదో ప్రాబ్లమ్‌ వచ్చింది. నా రూమ్‌ ఇచ్చాను. అదే రోజు తన ఫోన్‌ కూడా పాడైంది. అసిస్టెంట్‌ ఫోన్‌ తీసుకెళ్లి నాదని చెప్పి ఇచ్చాను. ఇవ్వన్నీ చూసి నాకు సాయం చేసే గుణం ఎక్కువనుకుంది.

ప్రేమ మొదలైందని ఎప్పుడనిపించింది?
మధుమిత: నేను మొదటిసారి చూసినప్పుడే ఈ అబ్బాయి బాగున్నాడనుకున్నా. ఆ తర్వాత చాలాసార్లు సాయం చేసే సరికి మంచి వాడనే భావన కలిగింది. తను కూడా నన్ను చాలా గమనించేవాడు. నేను లిప్‌స్టిక్‌ వేసుకున్న తర్వాత తుడుచుకున్న టిష్యూ తీసుకుని దాచుకునే వాడు. అలాంటి పనులు నాకు కనిపించాలని చేసేవాడు. ఒకసారి నేను చెన్నై వెళ్లగానే మిస్‌ అవుతున్నట్లు మెసేజ్‌ పెట్టాడు. అది చూసి నాకు సందేహం వచ్చి దూరం పెట్టడం మొదలుపెట్టా.
శివ బాలాజీ: నేను కూడా దూరం పెడుతున్నట్లు నటిస్తూ దగ్గరయ్యాను.

మొదట ఎవరు ప్రపోజ్‌ చేశారు?
శివ బాలాజీ: ఎవరైనా ప్రపోజ్‌ అనగానే ఐ లవ్‌ యూ అని చెబుతారు. నేను అందరిలా కాకుండా పెళ్లి చేసుకుందామా అని అడిగేశా. 
మధుమిత: తను చాలా కొంటె పనులు చేసేవాడు. (శివ బాలాజీ: ప్లీజ్‌ ఇప్పుడు అవ్వన్నీ చెప్పకు).. నేను తనతో క్లోజ్‌గా మూవ్ అవుతున్నానంటే.. ఇది ఫ్రెండ్‌షిప్‌ దాటి వెళ్లిపోతే పెళ్లి చేసుకోవడమే అని అనుకున్నా. మా తల్లిదండ్రులు ఏమంటారు. శివ వాళ్ల పేరంట్స్‌ ఏమంటారు అని భయం వేసింది. కానీ తను ‘పెళ్లి చేసుకుందామా’ అని అడగ్గానే వెంటనే ఓకే చెప్పేశాను. 

మధ్యలో బ్రేకప్‌ ఎప్పుడైంది? ఎందుకు విడిపోయారు?
శివ బాలాజీ: మా ఇంట్లో జాతకాలు ఎక్కువగా చూస్తారు. మా ఇద్దరి జాతకాలు కలవవు అని చెప్పారు. ఇదే విషయం ఫోన్‌ చేసి మధుకు చెప్పాను. జాతకాలు కలవడం లేదట.. అని చెప్పగానే తనకు కోపం వచ్చి ఫోన్‌ పెట్టేసింది. అలా ఏడాదిన్నర మాట్లాడుకోలేదు. 
మధుమిత: ఆయన అలా అనేసరికి నేనేం మాట్లాడలేకపోయాను. మా ఇద్దరికీ పెళ్లి అయితే మా అత్తగారికి ప్రాణగండం అని చెప్పారట. ఆ మాటకు నేనేం మాట్లాడలేదు. నాకు మళ్లీ కలుస్తాం అని నమ్మకం పోయింది.

ఆ తర్వాత ఎలా కలిశారు?
శివ బాలాజీ: నేను చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. ఏడాది వరకు వేచి ఉందాం. మధుకు అప్పటికీ పెళ్లి కుదరకపోతే ఏమైనా సరే పెళ్లి చేసేసుకుందాం అనుకున్నా. సంవత్సరం తర్వాత తన అసిస్టెంట్‌ ద్వారా తను ఎక్కడుంది.. ఏం చేస్తుంది అని కనుక్కొన్నాను. తన దగ్గరకు వెళ్లి పలకరించగానే.. ఏం స్పందించలేదు. నాకేం మాట్లాడాలో అర్థం కాక వచ్చేశాను. ‘నా లైఫ్‌ నుంచి వెళ్లిపోయావ్‌ కదా.. ఎందుకు వచ్చావు’ అని ఆ రోజు నైట్‌ మెసేజ్‌ పెట్టింది. అప్పుడు జరిగినదంతా చెప్పి.. ఇక లైఫ్‌లో నిన్ను విడిచిపెట్టనని చెప్పాను. ఏడాదిన్నర తర్వాత మా జాతకాలు చూపిస్తే కలిశాయని చెప్పారు. 

మీ తల్లిదండ్రులు ఏమన్నారు?
శివ బాలాజీ: నాకు పెళ్లి చేయాలని సంబంధాలు చూశారు. నేను వచ్చిన ప్రతి సంబంధాన్ని వద్దు అని చెప్పాను. దాంతో మా అమ్మ నువ్వు ఎవర్నైనా ప్రేమించావా.. మధుమితనా.. అని అడిగింది. అవును అని చెప్పగానే. వాళ్లు ఓకే అన్నారు. కానీ మధు వాళ్ల అమ్మ మాత్రం నో అన్నారు. 
మధుమిత: శివ కోపం మా అమ్మ చూశారు. షూటింగ్‌లో ఎవర్నో కోప్పడుతుంటే చూశారట. ఆ అబ్బాయికి కోపం ఎక్కువ వద్దు అన్నారు. తర్వాత నేను మూడు రోజులు అన్నం తినలేదు. అప్పుడు మా నాన్న ‘నువ్వు అన్నం తిను మాట్లాడదామన్నారు’. అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఓకే చేశారు. కానీ చాలా కష్టపడ్డాను. అలా పెళ్లి అయింది. 

పెళ్లికి ముందు మర్చిపోలేని సంఘటన ఏంటి?
మధుమిత: ఒకసారి నా పుట్టినరోజు నాడు నేను కేరళలో షూటింగ్‌లో ఉన్నాను. సడెన్‌గా రాత్రి 12 కాగానే ఒకతను వచ్చి బొకే ఇచ్చాడు. అందులో హ్యాపీ బర్త్‌డే మధు అని ఉంది. ఆ ఫ్లవర్‌ బొకేని ఫ్రేమ్‌ కట్టించి దాచుకున్నా.
శివ బాలాజీ: బ్రేకప్‌ తర్వాత మొదటిసారి కలిశాను కదా అదే (నవ్వులు).

పెళ్లి తర్వాత ఎలా ఉంది?
మధుమిత: చాలా గొడవలు అయ్యాయి. శివ ఎప్పుడూ నాతోనే ఉండాలని కోరుకున్నాను. తను ఫ్రెండ్స్‌ దగ్గరకు వెళ్లినప్పుడల్లా ఏదో గోల అయ్యేది. పెద్దగా అరుచుకునే వాళ్లం. ఈ విషయంలో రెండేళ్లు బాగా గొడవలు అయ్యాయి. కానీ ఆ తర్వాత అర్థం చేసుకున్నాం. శివ పక్కన ఉంటే నేనెంత సంతోషంగా ఉంటానో.. వాళ్ల ఫ్రెండ్స్‌తో ఉంటే తను కూడా అంతే ఉంటాడు కదా.. ఆ ఆనందాన్ని నేను దూరం చేయకూడదు అనుకున్నా. ఆయన కూడా నన్ను అర్థం చేసుకున్నాడు.
శివ బాలాజీ: ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. గొడవలు అందరి మధ్య వస్తూనే ఉంటాయి. కానీ వాటికి కారణాలను కనుక్కొని అర్థం చేసుకుంటే లైఫ్‌ చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో అలా ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఎంత గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నారో అంతే త్వరగా విడిపోతున్నారు. 

మీ భాగస్వామిపై ఉన్న 5 కంప్లైంట్స్‌ చెప్పండి?
శివ బాలాజీ: టీ విషయంలో నాకు చాలా కోపం వస్తుంది. నేను టీ పెట్టి ఇస్తే వంకలు పెడుతుంది. ఇచ్చిన చాలాసేపటికి తాగకుండా.. మళ్లీ వేడి చేసిస్తారా అని అడుగుతుంది. ఈ విషయంలో నాకు చాలా కోపం వస్తుంది.
మధుమిత: ఏదైనా చెబితే వినిపించుకోడు. నేనేమో విన్నాడనుకుని చెప్పేసి వెళ్లిపోతాను. అంతకు మించి కంప్లైంట్స్‌ లేవు.

శివ బాలాజీ: వెన్నెల కిషోర్‌.. నీ మీద నాకు ఒక కంప్లైంట్‌ ఉంది. (మంచు విష్ణుకు ఫోన్‌ చేస్తాడు).. విష్ణు నేను వెన్నెల కిషోర్‌ షోకు వచ్చాను మొన్న ఏదో చెప్పావు కదా.. ఇప్పుడు చెప్పు. 
మంచు విష్ణు: వెన్నెల కిషోర్‌ను చూసి వాళ్ల వీధిలోని ఆడపిల్లలంతా భయపడుతున్నారట. 
వెన్నెల కిషోర్‌: నీ గురించి కాదు చెప్పమని అడిగింది (నవ్వులు).
మంచు విష్ణు: నీవు ఏదైనా చెప్పాలంటే ‘మా’ అసోసియేషన్‌కు వచ్చి చెప్పు.. అక్కడ చూద్దాం. 
వెన్నెల కిషోర్‌: నీ ఫోన్ పాస్‌వర్డ్‌ చెబుతాను(నవ్వులు).

మీ లైఫ్‌లో జరిగిన సినిమ్యాటిక్‌ మూమెంట్‌ ఒకటి చెప్పండి?
మధుమిత: ఒకసారి చెన్నైలో బస్‌లో సీట్స్ లేక నిల్చొని ప్రయాణిస్తున్నాం. బ్రేక్‌ వేయగానే దగ్గరకు వచ్చి ముద్దుపెట్టేశాడు. అందరిలో అలా పెట్టేసరికి నాకు ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు.

శివ బాలాజీకి ఫోన్‌ రాగానే ఏం చేస్తాడో మధుమిత సరదాగా చేసి చూపించింది. దానితోపాటు వీళ్లిద్దరూ కలిసి డ్యాన్స్‌ వేసి అలరించారు. అలాగే వెన్నెల కిషోర్‌ వీళ్లతో ఆడించిన ట్రూత్‌ ఆర్‌ డేర్‌ గేమ్‌లో పంచుకున్న సరదా విశేషాలేంటో తెలియాలంటే వీళ్ల ‘అలా మొదలైంది’ ఎపిసోడ్‌ను ‘ఈటీవీ విన్‌’ యాప్‌లో వీక్షించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని