Siva Balaji: ‘ఆర్య’లో చేయకూడదనుకున్నా.. ఎందుకంటే..: శివ బాలాజీ

ప్రముఖ సినీ నటుడు శివ బాలాజీ (Siva Balaji) ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi) కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. ఆయన సినిమా అవకాశాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Updated : 07 May 2023 19:02 IST

20 ఏళ్లకే సొంతంగా వ్యాపారాన్ని స్థాపించి.. 22 ఏళ్లకు ‘ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరి’తో వెండితెరకు పరిచయమ్యాడు శివ బాలాజీ. ఆ తర్వాత ‘చందమామ’, ‘కోకిల’, ‘శంభో శివ శంభో’ వంటి ఎన్నో సినిమాలతో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఓ రియాల్టీ షోకు వెళ్లి విజేతగా తిరిగొచ్చారు. ఇటీవల జరిగిన ‘మా’ (MAA Elections)ఎన్నికల్లో కోశాధికారిగా ఎంపికైన శివ బాలాజీ చెప్పాలని ఉంది కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. తన కెరీర్‌లోని ఆసక్తికర సంగతులను పంచుకున్నారు. 

వ్యాపారం నుంచి సినిమాల వైపు ఎందుకు వచ్చారు?

శివ బాలాజీ: మా అమ్మ చాలా సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్‌ గారితో, నాగేశ్వరావు గారితో ఇలా చాలామంది అగ్ర నటుల సినిమాల్లో ఆమె నటించింది. పెళ్లి తర్వాత నటించలేదు. మాకు ‘శివ బాలాజీ గ్రూప్స్‌ ఆఫ్‌ కంపెనీస్‌’ అని పెద్ద సంస్థ ఉంది. 2,500 మంది ఉద్యోగులు పనిచేసే వారు. మెషీన్స్‌ చాలా ఉండేవి. నేను 18 ఏళ్లకే అందులో అన్నీ నేర్చుకున్నాను. 20 ఏళ్లకు సొంతంగా కంపెనీ పెట్టాను. సినిమాల వైపు అనుకోకుండా వచ్చాను. మా ఫ్యామిలీ ఫ్రెండ్‌ కుమార్‌ గారికి తెలిసిన కెమెరా మ్యాన్‌ ఓ సినిమాలో కొత్తవారి కోసం చూస్తుంటే నన్ను తీసుకెళ్లారు.

బాల్యం, విద్యాభ్యాసం అన్ని చెన్నైలోనే జరిగాయి కదా.. మరి తెలుగు మీద పట్టు ఎలా వచ్చింది?

శివ బాలాజీ: ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకునే వాళ్లం. కానీ ఎంత మాట్లాడినా స్పష్టంగా ఉండేది కాదు. ఇండస్ట్రీకి వచ్చాక అందరూ తిట్టి తెలుగు నేర్పించారు.

వ్యాపారం వదిలిపెట్టి సినిమాల్లోకి వచ్చినప్పుడు బాధ పడ్డారా?

శివ బాలాజీ: ‘ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరి’ కోసం సౌత్‌ ఇండియా మొత్తంలో 150 మందిని ఆడిషన్స్‌ చేశారు. అది చాలా ప్రతిష్ఠాత్మకమైన సినిమా. నేను ఎంపికవుతానని అనుకోలేదు. మూడు రోజులే టైం ఇచ్చారు. మా నాన్నకు చెప్పి వెళ్లమంటారా అని అడిగాను. ‘వెళ్తే సినిమాల్లోకి వెళ్లు.. లేదంటే ఇక్కడే ఉండి వ్యాపారం చూసుకో’ అని చెప్పారు. అమ్మ కూడా నీ ఇష్టం అని చెప్పింది. సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకొని ట్రైన్‌ ఎక్కేశాను. ఆ తర్వాత అన్ని వదిలేసి వచ్చానని ట్రైన్‌లో కూర్చొని గంట సేపు ఏడ్చాను.

‘ఎలా చెప్పను’లో సపోర్టింగ్‌ యాక్టర్‌గా చేయడానికి ఎలా అంగీకరించారు?

శివ బాలాజీ: ఆ అవకాశం తేలికగా రాలేదు. ఆ సినిమా నిర్మాతలు కేబీఆర్‌ పార్కుకి వాకింగ్‌కు వచ్చినప్పుడు వాళ్లకు రివర్స్‌లో ఎదురొచ్చి హాయ్‌ చెప్పేవాడిని. ఒక్కోసారి చూడకపోతే.. 7 కిలోమీటర్లు పరిగెత్తి మళ్లీ ఎదురొచ్చి పలకరించేవాడిని. అలా వాళ్ల దృష్టిలో పడ్డాను. ఆ సినిమా కోసం చూస్తుంటే ‘కేబీఆర్‌’ పార్కులో ఓ అబ్బాయి తిరుగుతుంటాడు తనని పిలవండి అని కబురు పంపారు. ‘ఎలా చెప్పను’ నాకు మంచి గుర్తింపునిచ్చింది.

‘ఆర్య’ సినిమాలో అజయ్‌ పాత్ర ఎలా వచ్చింది?

శివ బాలాజీ: సుకుమార్‌ గారు ‘ఆర్య’ ఆడిషన్స్‌కు పిలిచారు. వెంటనే ఓకే చేసేశారు. కానీ ఆ సినిమాలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అని వద్దు అనుకున్నా. చేయనని చెప్పాను. తర్వాత వాళ్లందరూ నాకు సర్ది చెప్పారు. దీంతో ఓకే చేశాను. బన్నీ ఆ సినిమా అప్పుడు ఎంత ఆప్యాయంగా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉంటాడు.

‘ఆర్య’ తర్వాత మల్టీస్టారర్‌ మూవీస్‌లో ఎక్కువగా నటించారు.. ఎందుకు?

శివ బాలాజీ: ఆ టైంలో ఎక్కువ మల్టీస్టారర్‌ సినిమాలు నేనే చేశాను. ‘పోతే పోనీ’ (Pothe Poni ) సినిమాకు నంది అవార్డు వచ్చింది. నాకు ఉన్న అవార్డులు చూస్తే అదొక్కటే ఉంటుంది. డైరెక్ట్‌ నంది అవార్డు. నేను నటించిన సినిమాల్లో కొన్నింటికి నేనే డబ్బింగ్‌ చెప్పాను. కొన్నింటికి డబ్బింగ్‌ ఆర్టిస్టులు చెప్పారు. ‘సంక్రాంతి’కు డబ్బింగ్‌ అంతా చెప్పాక.. నా వాయిస్‌ తీసేసి వేరే వాళ్లతో చెప్పించారు. ‘పోతే పోనీ’ సినిమాలో డైలాగులు చెప్పడానికి చాలా కష్టపడ్డా.

వెంకటేష్‌ గారితో నటించడం ఎలా అనిపించింది?

శివ బాలాజీ: ‘సంక్రాంతి’లో వెంకటేష్‌ గారితో కలిసి నటించడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఆ షూటింగ్‌ టైంలో వెంకటేష్‌ గారు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే.. ‘గతంలో జరిగిన దాన్ని మార్చలేము. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ప్రస్తుతం జరుగుతున్న దానిపై దృష్టి పెట్టు’ అన్నారు. ఆ మాట ఇప్పటికీ గుర్తే.

కృష్ణవంశీ దర్శకత్వంలో ‘చందమామ’ (Chandamama)లో చేసిన అనుభవం గురించి చెప్పండి?

శివ బాలాజీ: కృష్ణవంశీ గారి దగ్గర చేయడానికి మొదట చాలా భయపడ్డాను. ఎందుకంటే.. సీన్‌ కోసం ఆయన ఆర్టిస్టుని చాలా కష్టపెడతారు అని అనుకునేవాళ్లు.  ఈ సినిమా కోసం కూడా ఆడిషన్‌ చేశారు. ‘రాఖీ’లోని క్లైమాక్స్‌ డైలాగ్ చెప్పమని అడిగారు. నేను చెప్పిన తీరు ఆయనకు నచ్చలేదు. అవకాశం రాదని ఫిక్సయ్యాను. తర్వాత కొన్ని రోజులకు షూటింగ్‌కు రావాలని ఫోన్‌ వచ్చింది. సినిమా షూటింగ్‌ జరుగుతున్నా నాకు మాత్రం నమ్మకం లేదు. నన్ను ఈ సినిమాలో ఉంచుతారా .. మధ్యలోనే తీసేస్తారా అనుకుంటూ చేశాను. ఆ సినిమా సక్సెస్‌ మీట్‌కు వెళ్లేటప్పుడు కృష్ణవంశీ పర్సనల్‌గా నా దగ్గరకు వచ్చి ‘అందరితో కలిసిపోవాలి. లేదంటే నీలో ఉన్న టాలెంట్‌ ఎవరికీ తెలీదు’ అని చెప్పారు.

బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం ఎలా అనిపించింది?

శివ బాలాజీ: నా జీవితాన్ని చెప్పాలంటే బిగ్‌బాస్‌కు ముందు.. బిగ్‌బాస్‌ తర్వాత అని చెప్తాను. బయట వ్యక్తులతో మాట్లాడని నేను అలా కొత్త వాళ్లతో అన్నిరోజులు ఉన్నాను. ఆ కార్యక్రమం వల్ల చాలా నేర్చుకున్నాను. 

మధుతో ప్రేమ గురించి చెప్పండి. మొదటిసారి ఎప్పుడు చూశారు?

శివ బాలాజీ: మధు ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చింది. నేను తన తర్వాత చాలా రోజులకు వచ్చాను. మేమిద్దరం కలిసి ‘ఇంగ్లిష్‌ కరన్‌’ అనే సినిమాలో నటించాం. అది పూర్తయ్యేటప్పుడు ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నామని అర్థమైంది. కానీ ఇద్దరం ఓపెన్‌ అవ్వలేదు. అలా ఫోన్‌లు మాట్లాడుకుంటూ ఉండే వాళ్లం. ఒకరోజు పెళ్లి చేసుకుందామా అని అడిగేశాను.  వాళ్ల అమ్మ అంగీకరించలేదు. జాతకాలు సెట్‌ అవ్వలేదని వద్దన్నారు. సంవత్సరం కష్టపడితే ఇంట్లో వాళ్లు ఓకే అన్నారు. నేను వంట బాగా చేస్తాను. ఇప్పుడు ఇంట్లో పిల్లలతో కలిసి నేను కూడా అల్లరి చేస్తాను.

‘శంభో శివ శంభో’లో ఛాన్స్‌ ఎలా వచ్చింది?

శివ బాలాజీ: ఆ సినిమా కోసం ఆడిషన్స్‌ ఏం చేయలేదు. డైరెక్ట్‌గా సెలక్ట్‌ చేసేశారు. సముద్రఖని నా వీడియో ఏదో చూసి ఛాన్స్‌ ఇచ్చారు. ఆ షూటింగ్ సమయంలో చాలా ఎంజాయ్‌ చేశాం. ఒక కుటుంబంలా కలిసిపోయాం. ‘కాటమరాయుడు’లో (Katamarayudu) పవన్‌ కల్యాణ్‌ (Katamarayudu) గారితో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేను. చాలా సరదాగా ఉండేవారు.  ‘రెక్కి’ అని వెబ్‌సిరీస్‌ చేశాను. అది ఓటీటీలో ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అయింది. అది చూసి ఎక్కడెక్కడి నుంచో ఫోన్‌ చేశారు. నేను చేసిన సినిమాల్లో ‘సింధూరం’ కాంట్రవర్సీ అవుతుందేమోనని భయపడ్డా.

‘స్నేహమేరా జీవితం’ సినిమాకు నిర్మాతగా ఉండాలని ఎందుకు అనిపించింది?

శివ బాలాజీ: ఆ సినిమా మొదలు పెట్టాక చాలా రోజులు ఆపాల్సి వచ్చింది. నాకు ‘కాటమరాయుడు’ సినిమాలో అవకాశం రావడం.. వెంటనే బిగ్‌బాస్‌కు వెళ్లిపోయా. అక్కడి నుంచి వచ్చాక ఒక డిస్టిబ్యూటర్‌ దగ్గరకు వెళ్లి.. వాళ్లనే రిలీజ్‌ చేయమని చెప్పాను. దాన్ని రూ.కోటి పెట్టి తీస్తే.. ప్రమోషన్స్‌ కోసం రూ.80లక్షలు ఖర్చు చేశా. ఆ సినిమాను నేను హ్యాండిల్‌ చేయలేకపోయానేమోనని డిప్రెషన్‌కు వెళ్లిపోయా. ఏడుపు వచ్చేది కానీ.. కన్నీళ్లు వచ్చేవి కాదు. అప్పుడు మధు ఓ మాట చెప్పింది. మీ వల్ల ఆరు నెలలు ఇండస్ట్రీలో చాలా మందికి పని దొరికింది. వాళ్లకు ఇచ్చేశాననుకోండి అని చెప్పింది. ఆ మాటతో డిప్రెషన్‌ నుంచి బయటకు వచ్చా.

‘మా’  (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎలక్షన్స్‌లో పాల్గొనాలని ఎందుకు అనుకున్నారు?

శివ బాలాజీ: ఒకరోజు నరేష్‌ గారు ఫోన్‌ చేసి రమ్మన్నారు. వెళ్తే ‘మా’లో జాయింట్‌ సెక్రటరీగా ఎంపిక చేశామన్నారు. కానీ ఆ ఎలక్షన్‌ చినికిచినికి గాలివాన అయింది. చిరంజీవి గారు, పవన్‌ కల్యాణ్ గారి వద్దకు వెళ్లాయి.

మీరు, మధు కలిసి స్క్రీన్‌ మీద కనిపించే ఛాన్స్‌ ఉందా.. పిల్లల్ని ఇండస్ట్రీలోకి తెస్తారా?

శివ బాలాజీ: మంచి కథ ఉంటే నేనూ మధు కలిసి కచ్చితంగా చేస్తాం. పిల్లలకు ఏ రంగంపై ఆసక్తి ఉంటే అటు వెళ్తారు అంతే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు