Chinmayi: పెళ్లంటూ చేసుకుంటే చిన్మయినే చేసుకోవాలని అప్పుడే అనుకున్నా: రాహుల్ రవీంద్రన్

సెలబ్రిటీ టాక్‌ షో ‘అలా మొదలైంది’కి నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ (Rahul Ravindran) ఆయన భార్య చిన్మయి శ్రీపాదతో (Chinmayi Sripaada) కలిసి వచ్చారు. వారి జీవితంలో జరిగిన సరదా సన్నివేశాలను పంచుకున్నారు. 

Updated : 01 Jun 2023 10:21 IST

‘అందాల రాక్షసి’లో అందంగా డైలాగులు చెప్పి అందరికీ చేరువయ్యారు రాహుల్‌ రవీంద్రన్‌ (Rahul Ravindran). తన భార్య గాయని చిన్మయి శ్రీపాదతో (Chinmayi Sripaada) కలిసి ‘అలా మొదలైంది’ (ala modalaindi) కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్లిద్దరి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది..? రాహుల్‌ని మొదటిసారి చూడగానే చిన్మయి ఏమనుకుంది..? ఇలాంటి మధుర జ్ఞాపకాలను వెన్నెల కిషోర్‌తో పంచుకున్నారు. వాళ్లిద్దరూ సరదాగా చెప్పిన సంగతులు మీకోసం..

మీ కథ ఎలా మొదలైంది?
చిన్మయి: ‘అందాల రాక్షసి’లో లావణ్య త్రిపాఠికి నేను డబ్బింగ్‌ చెప్పాను. ఆ సినిమా గురించి వివరాలు చెప్పడానికి రాహుల్‌ వచ్చాడు. అప్పుడు మొదటిసారి చూశాను. (రాహుల్‌: నన్ను మొదటిసారి చూడగానే ఈ అబ్బాయి బాగున్నాడే అనుకుందట) 
రాహుల్‌ : నాకు మొదటి నుంచి తన వాయిస్‌ అంటే ఇష్టం. ‘అందాల రాక్షసి’ సమయానికే తను పెద్ద సింగర్‌. నేను రెండు సినిమాలు చేశానంతే. ఆ సినిమా డబ్బింగ్‌ చెప్పడం అయ్యాక చిన్మయి మా మూవీ యూనిట్‌ అందరినీ ట్యాగ్‌ చేస్తూ.. సినిమా బాగుందని రామాయణంలో కొటేషన్‌ ఏదో పెట్టింది. అమ్మాయితో పాటు తన ఆలోచనలు కూడా బాగున్నాయనిపించింది. అప్పుడు మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాను.  ‘చిన్మయి సింగిల్‌గా ఉందా.. ఇంత అందమైన.. శ్రావ్యమైన గొంతు ఉన్న అమ్మాయి ఇంకా సింగిల్‌గానే ఉందంటే.. ప్రపంచంలోని అబ్బాయిలందరూ వేస్ట్‌..’’ అని భయపడుతూ పెట్టాను. దానికి పాజిటివ్‌గా రిప్లై రావడంతో అలా కొనసాగించాను.

మొదటిసారి బయటకు ఎప్పుడు వెళ్లారు. ఏం మాట్లాడుకున్నారు?
రాహుల్‌: బయటకు వెళ్దామని కూడా నా స్టైల్లో అడిగాను..‘‘మీరు నన్ను గన్‌తో కాల్చనంటే.. నాతో కలిసి బయటకు వస్తారా అని అడగాలనుకుంటున్నా’’ అని మెసేజ్‌ పెట్టాను. ‘నా దగ్గర గన్‌ లేదు.. కచ్చితంగా వెళ్దాం’ అని తను రిప్లై పెట్టింది. అలా ఇద్దరం కలిసి బయటకు వెళ్లాం. మూడు సార్లు డేట్‌కు వెళ్లినా రొమాంటిక్‌గా ఏం జరగలేదు. ఒకసారి తను మాట్లాడుతూ.. ‘మనమిద్దరం ఫ్రెండ్స్‌ అవుతున్నాం’ అని చెప్పింది. నాకు గుండె పగిలింది. వామ్మో ఇంత అందమైన అమ్మాయి కేవలం స్నేహానికే పరిమితం అవుతుందా అనుకున్నా. అందుకే ఓపెన్‌గా మెసేజ్‌ పెట్టాను. నేను నిన్ను ఫ్రెండ్‌గా అనుకోవడం లేదు. నువ్వు నన్ను అలా అనుకుంటే మాత్రం ఈసారి నేను బయటకు వెళ్దాం అని అడిగితే ఓకే చెప్పకు. నేను నీతో రొమాంటిక్‌ డిన్నర్‌ కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పాను. 2 వారాల తర్వాత డేట్‌కు వెళ్దామా అని అడిగాను వెంటనే ఓకే అనేసింది. (వెన్నెల కిషోర్‌: ఈ రెండు వారాలు నువ్వు ఎలా ఫీలయ్యావు చిన్మయి) 
చిన్మయి: తను అలా ఓపెన్‌గా చెప్పకపోతే ఫ్రెండ్‌గానే ఉంచేసే దాన్ని. నాకు అప్పట్లో అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు. 

ఆ తర్వాత ఇద్దరి మధ్యలో గ్యాప్‌ ఎందుకు వచ్చింది?
రాహుల్‌: ఏదో మెసేజ్‌ పెడితే తన రిప్లైకు నేను కొంచెం బాధపడ్డాను. అయినా తనంటే ఎంతో గౌరవం ఉంది. కొన్నిరోజులు ఆగాక మాట్లాడదాం అని సైలెంట్‌ అయ్యాను. తర్వాత ఒకసారి తను హైదరాబాద్‌ వచ్చి ‘వాతావరణం బావుందని’ ట్వీట్‌ పెట్టింది. అది చూసి నాకు చాలా కోపం వచ్చింది. హైదరాబాద్‌ వస్తున్నట్లు ఒక్క మెసేజ్‌ కూడా చేయలేదని బాధేసింది. చివరిసారి మెసేజ్‌ పెడతాను. తనకు ఆసక్తిలేదంటే ఇక జన్మలో చిన్మయిని కదిలించకూడదని ఫిక్స్‌ అయ్యాను. విచిత్రం ఏంటంటే తనకు మెసేజ్‌ పెట్టగానే తను చాలా పాజిటివ్‌గా స్పందించింది. 
చిన్మయి: ఒకసారి నేను, సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) కలిసి ఆడియో ఫంక్షన్‌కు యాంకరింగ్‌ చేశాం. అప్పుడు రాహుల్ గురించి సందీప్‌ కిషన్‌ చెప్పాడు. చాలా మంచివాడు అని ఏదేదో చెప్పాడు. తనకెందుకో మేమిద్దరం కలిస్తే బాగుండనిపించింది. 

పెళ్లి ఎలా జరిగింది?
చిన్మయి: ఒకరోజు రాహుల్‌ సడెన్‌గా పెద్ద మెసేజ్‌ పెట్టాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. చాలా సీరియస్‌గా అడుగుతున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా..? అని అడిగాడు. నేను వెంటనే మా అమ్మకు చెప్పాను. మా అమ్మ ఓకే అనడం నిశ్చితార్థం.. వెంటనే పెళ్లి అలా జరిగిపోయాయి.
రాహుల్‌: పెళ్లి చేసుకుంటా అని అడిగితే నాకు ఆన్సర్‌ చేయకుండా వాళ్ల అమ్మకు వెళ్లి చెప్పేసింది. మా పెళ్లి జరిగి 9 ఏళ్లు అవుతుంది. 

పెళ్లికి ముందు మర్చిపోలేని సంఘటన?
చిన్మయి: పెళ్లికి ముందు ప్రేమికుల దినోత్సవం రోజు 12 గంటలకు 12 గిఫ్ట్‌లు ప్లాన్‌ చేశాడు. ప్రతి దాంట్లో ఒక కవిత రాసి పెట్టాడు. ఆ కవితలో గిఫ్ట్‌కు సంబంధించిన క్లూ ఉంది. నేను దాన్ని కనుక్కోవాలి. అలా చక్కగా కవితలు రాసి పెట్టాడు. అది ఎప్పటికీ మర్చిపోలేను.
రాహుల్‌: ఒకసారి తన కళ్లల్లోకి చూశాను. పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. ఎప్పుడు చూశానని మాత్రం అడగొద్దు. అది చాలా పర్సనల్‌ (నవ్వులు).  

పెళ్లి తర్వాత మర్చిపోలేని విషయం?
రాహుల్‌: పిల్లలు. ఈ ప్రశ్నకు మేమిద్దరం ఒకటే సమాధానం చెబుతాం. పిల్లలు మా జీవితాల్లోకి వచ్చిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పుడు కళ్లు మూసుకున్నా.. కళ్ల ముందు వాళ్లే కనిపిస్తారు. 

మీరెందుకు ప్రతిచిన్న విషయానికి భావోద్వేగానికి గురవుతారు?
రాహుల్‌: పిల్లలు పుట్టిన దగ్గరి నుంచి అలా మారిపోయా. చిన్మయికి మరో 10రోజుల్లో డెలీవరి డేట్‌ ఇచ్చారు. నార్మల్‌ చెకప్‌ కోసం హాస్పటల్‌కు వెళ్లాం. డాక్టర్‌ వెంటనే డెలివరీ చేయాలన్నారు. ఆపరేషన్‌ బెడ్‌పై చిన్మయి ఉంది. నేను తన పక్కనే కూర్చున్నా. నాకేమో తనకు ఆపరేషన్‌ చేయడం అంతా కనిపిస్తోంది. తనేమో మత్తు ఇచ్చేసరికి ఏం తెలియక హాయిగా పాటలు పాడుతుంది. అలా డెలివరీ అయ్యాక ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు. మా అమ్మాయి వెంటనే నవ్వింది. చిన్మయి వైపు చూస్తే తను కూడా నవ్వుతూ కనిపించింది. ఈ జీవితానికి అది చాలనుకున్నాను. అప్పటి నుంచి చిన్న విషయానికి కూడా ఎందుకో ఎమోషనల్‌ అవుతున్నాను.

మీ భాగస్వామి మీద మీకున్న కంప్లైంట్స్‌ చెప్పండి?
రాహుల్‌: ఫోన్‌. చిన్మయి ఒకసారి ఫోన్‌ పట్టుకుందంటే ప్రపంచం కనిపించదు. అందులోకి దూరిపోతుంది. కోపంలో ట్వీట్లు పెట్టొద్దు అని చాలా సార్లు చెప్పాను. కానీ ఒక్కోసారి పెట్టేస్తుంది. అది తన తప్పు అని నేను అనను.  
చిన్మయి:  నేను కోపంగా ఏదైనా చెబుతుంటే రాహుల్ చాలా సింపుల్‌గా తీసుకుంటాడు. నాకు బీపీ పెరిగిపోతుంది. 

మీ ఇద్దరిలో ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చుపెడతారు?
రాహుల్‌: నేను అసలు ఖర్చు చేయను. అవసరం ఉన్న వస్తువు కొనాలన్నా చాలాసార్లు ఆలోచించి కొంటాను. 
చిన్మయి: అవసరం అనుకున్న వస్తువును వెంటనే కొంటాను. అంతేకానీ అనవసరంగా డబ్బులు ఖర్చుపెట్టను. 

రాహుల్‌ రవీంద్రన్‌- చిన్మయిలను వెన్నెల కిషోర్‌ పర్‌ఫెక్ట్‌ కపుల్‌ అని ఎందుకు అన్నాడు. రాహుల్‌ కోసం చిన్మయి ఏ పాటను అంకితమిచ్చింది. అసలు వీళ్లిద్దరూ ఒక్కసారి కూడా అబద్ధం ఎందుకు చెప్పలేదు. ఇలాంటి సరదా కబుర్లతో సాగిన వీళ్ల ‘అలా మొదలైంది’ ఎపిసోడ్‌ను  ‘ఈటీవీ విన్‌’ యాప్‌లో వీక్షించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు