keeravani: అదరహో ఆస్కీరవాణి
keeravani: హిట్లు.. హిట్లు..ఎన్నెన్నో హిట్లు ! అవే ఆయన హార్మోనియం మెట్లు ! ‘మరకత మణి’గా తమిళులకూ, ఎమ్.ఎమ్.క్రీమ్‌గా హిందీ ప్రేక్షకులకూ చిరపరిచితుడైన మన మధుర రాగాల మాంత్రికుడు ఎమ్.ఎమ్. కీరవాణి..
హిట్లు.. హిట్లు..ఎన్నెన్నో హిట్లు ! అవే ఆయన హార్మోనియం మెట్లు ! ‘మరకత మణి’గా తమిళులకూ, ఎమ్.ఎమ్.క్రీమ్‌గా హిందీ ప్రేక్షకులకూ చిరపరిచితుడైన మన మధుర రాగాల మాంత్రికుడు ఎమ్.ఎమ్. కీరవాణి(keeravani).. అచ్చ తెలుగు పాటల తోటలో స్వచ్ఛమైన శుకవాణి! ఇప్పుడు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’’ కేటగిరిలో ప్రపంచ చలన చిత్ర అత్యున్నత ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న ‘ఆస్కీరవాణి’!
రాజమౌళి గారి దర్శకత్వంలో రూపొందిన ‘రౌద్రం రణం రుధిరం’(RRR) చిత్రంలోని ‘నాటు నాటు’ పాట సంగీత దర్శకుడు కీరవాణి గారిని ఆస్కార్ విజేతగా నిలిపింది. ఆ పాట రాసిన చంద్రబోస్ కూడా ఆ విజయంలో భాగస్వామి అయ్యారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల అద్భుతమైన ఆటకు అడుగులు కూర్చిన నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ ఆ పాట ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడంలో ముఖ్య పాత్ర పోషించారు. సినిమాలో ఆ పాట పాడిన కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ వేదికపై కూడా ప్రత్యక్షంగా ఆలపించి హోరెత్తించారు.
ఒక చేత ఆస్కార్‌నూ, మరో చేత గోల్డెన్ గ్లోబ్‌నూ, జేబుల్లో వివిధ ప్రఖ్యాత సంస్థల ప్రశంసా పురస్కారాలనూ పట్టుకుని, భారత దేశపు జెండానూ, తెలుగు వాడి ప్రాభవాన్ని సగర్వంగా పైకెత్తుకు వస్తున్న కీరవాణి గారి జీవితం, ప్రయాణం..ఎత్తుపల్లాల మార్గంలో సాగిన ఓ గొప్ప విజయ గాథ.
సుదీర్ఘ ప్రయాణం..
1990 నుంచి ఇప్పటి వరకూ గడచిన ముప్పై మూడేళ్లలో కొన్ని వందల చిత్రాలు.. కొన్ని వేల పాటలు.. పాటల్లో అధిక శాతం ఆణిముత్యాలు. సంగీత దర్శకుడిగానే కాదు..గాయకుడిగా....గీత రచయితగా ఆయన ముద్ర అపూర్వం. హార్మోనియం పెట్టె ముందు కూర్చోగానే ఆయన నోట సుస్వరాలతో పాటు సందర్భోచితమైన పదాలు అలవోకగా జాలువారతాయి. చాలా సందర్భాలలో ఆ పదాలే పల్లవులై నాబోటి గీత రచయితల చరణాలకు మకుటాలవుతాయి. అయినా ఏనాడూ ఆయన ఫలానా పల్లవి రాసింది నేనని చెప్పి, గీత రచయితను చిన్నబుచ్చరు. ఒకవేళ ఎప్పుడైనా ఆయన రాసిన పాటలో మా ‘మాట సాయం’ ఎంత చిన్నదైనా.. ఆ లైను ఫలానా వారు అందించారు అని సందర్భం వచ్చిన ప్రతిసారీ చెప్తారు. అంతటి సంస్కారి కీరవాణి.
ఆ పాట కోడి కూత నుంచి పుట్టింది...
ఒకసారి- కర్ణాటకలో కీరవాణి గారు తాను వ్యవసాయం చేసిన కేంప్ దగ్గర ఒక ఊళ్లో తెలిసిన వారి ఇంటికి భోజనానికి తీసుకెళ్లారు. భోజనం చేస్తూండగా, ‘అల్లరి అల్లుడు’ సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ ‘ఒక్కసారే...వన్స్ మోరే’ గుర్తుందా?ఆ పాట ఇక్కడే పుట్టిందన్నారు. ఎలా? అని అడిగాను. వీళ్ల కోడి దగ్గర నుంచి కాపీ కొట్టాను అని ముసిముసిగా నవ్వుతూ అసలు సంగతి చెప్పారు. ‘ఇలాగే భోంచేస్తుంటే ఈ ఇంటి వాళ్ల కోడిపుంజు పెరట్లోంచి వరసగా కూత పెడుతూనే ఉంది. ఆ కూత విచిత్రంగా ఉంది. ఎలా ఉందంటే- మీరు విన్న ఒక్కసారే..వన్స్ మోరే బాణీలో కొక్కొరోకో.. కొక్కొరోకో అనుకోండి. సేమ్ టు సేమ్. అదే ఆ పాట బాణీకి ఆధారం’’అని చెప్పారు. ఇది నిజమే అయినా కీరవాణి గారి హాస్యప్రియత్వంలో భాగమే.
మనిషిని మనిషిలాగే చూడాలి...
మనిషిని మనిషిగా చూడనప్పుడు ఆయనకు కోపం వస్తుంది. డ్రైవర్‌ను పేరు పెట్టి పిలవకుండా డ్రైవర్ అని పిలిచినందుకు ఒక దగ్గర బంధువుతో మాట్లాడటం మానేశారు. వినమని ఎవరైనా తమ పాటల క్యాసెట్లు తెచ్చి ఇస్తే, వాటిని పక్కన పారెయ్యకుండా ఒక పెట్టెలో దాచి, దూర ప్రయాణాకు వెళ్లినప్పుడు కారులో ప్రతి క్యాసెట్ నూ ఆయన వింటారు. ఎవరి పాటైనా నచ్చితే, వాళ్ల ఫోన్ నంబర్ ఉంటే అప్పటికప్పుడే ఫోన్ చేసి అభినందిస్తారు. ఈ ప్రక్రియ అంతా నేను చూసాను. ఒక సినిమాలో ఒక కొత్త సంగీత దర్శకుడు చేసిన, నేను రాసిన పాట నచ్చి అతణ్ని పిలిచి అభినందించడం నాకు తెలుసు. అది ఆ సంగీత దర్శకుడి మొదటి సినిమా. ఆ పాటను తన ఫోన్ కాలర్ ట్యూన్‌గా ఏడాది పాటు పెట్టుకుని గౌరవించిన గొప్ప వ్యక్తి కీరవాణి. బయటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు చిన్నపిల్లలు కనిపిస్తే వారి కులమతాలూ అంతస్థులతో నిమిత్తం లేకుండా గబుక్కున ఎత్తుకుని, ముద్దు చేయడం పలుమార్లు చూసాను. ఆయన దగ్గర అవకాశాల కోసం వంగి సలాములు పెట్టక్కరలేదు. అవకాశం ఇచ్చాక లొంగి ఉండక్కరలేదు. ఎవరు ఎప్పుడు
ఏ పాటకు పనికొస్తారో ఆయనకు తెలుసు. ఆ ప్రకారమే ఆవకాశాలు వస్తాయి గానీ, కేవలం వినయ విధేయతల వల్ల అక్కడ పని జరగదు.
ఆ వీడ్కోలు ఆదర్శప్రాయం..
ఇవన్నీ అలా ఉంచితే.. ఇటీవల కీరవాణి గారి మాతృమూర్తి భౌతికంగా నిష్క్రమించినప్పుడు ఆవిడకు తుది వీడ్కోలు పలికిన విధానం ఆయన పట్లా, ఆయన కుటుంబం పట్లా నా గౌరవాభిమానాల్ని ఇనుమడింపజేసింది. అనవసరమైన తంతును పరిహరించి, అందరూ ఆవిడకు నమస్కరించి, చివరి రోజుల్లో కుటుంబ సభ్యుల గురించి...తనకు సేవలందించిన వారి గురించి పేరు పేరునా ఒక పుస్తకంలో ఆవిడ రాసిన పేజీలను కీరవాణి స్వయంగా చదివి వినిపించి, తల్లి పార్థివ దేహాన్ని సగౌరవంగా అగ్నికి సమర్పించి, సాగనంపారు. కొన్ని రోజుల తరవాత ఆత్మీయులనూ, సన్నిహితులనూ పిలిచి, అమ్మగారి అన్ని వయసుల ఫోటోలనూ, ఆవిడ అభిరుచులను తెలిపే వస్తువులనూ వ్యాఖ్యలతో సహా చిన్న ప్రదర్శన ఏర్పాటు చేసి, భోజనం పెట్టి, ఆవిడ స్మృతులను అందరికీ పంచారు. ఈ క్రమం నాకెంతో ఆదర్శప్రాయంగా అనిపించింది.
ఎవరికైనా పని ఒకటే..
కీరవాణి... రాజమౌళి సినిమాలకు మాత్రమే మంచి పాటలిస్తారనే సిల్లీ ఆరోపణ ఒకటి నేను కొన్ని చోట్ల విన్నాను. నిజానికి రాజమౌళి గారి సినిమాలలో ఉన్న హిట్ సాంగ్స్‌లో ఎక్కువ శాతం ఇతరులు తిరస్కరించిన ట్యూన్‌లంటే నమ్మగలరా? కానీ అది నిజం. ఇది ఆయా దర్శకుల అభిరుచులలో, ఎంపిక సామర్థ్యంలో తేడాయే గానీ కీరవాణి పనిలో తేడా ఏంలేదు.
ఒకసారి కీరవాణితో రెండు సినిమాలకు పని చేస్తున్నాను. అందులో ఒకటి రాజమౌళి గారిది. ఇంకోటి వేరే దర్శకుడిది. నేనేదో మాటల్లో ‘మన సినిమాలో పాటా..’ అని ఏదో చెప్పబోయాను. నామాట పూర్తి కాకుండానే ఆయన ‘మన సినిమా అంటే ఏదండీ?’ అన్నారు. నేను రాజమౌళి గారు సినిమా పేరు చెప్పాను. ‘అంటే..మనం పని చేస్తున్న ఆ రెండో సినిమా మనది కాదాండీ?’ అన్నారు. నాకు ఫ్యూజులు ఎగిరి పోయాయి. ఒక ముఖ్యమైన పాఠాన్ని ఆయన రెండు చిన్న ప్రశ్నలతో నా తలకెక్కించారు. అదీ కీరవాణి గారంటే.
కీరవాణి గారూ, రాజమౌళి గారూ అన్నదమ్ములైనా కలిసి పనిచేసేటప్పుడు ఆ సినిమాకు ఒకరు దర్శకుడూ, ఇంకొకరు సంగీత దర్శకుడూ. అంతే, నేను పాట రాసిన మర్యాద రామన్న, ఈగ, బాహుబలి,(రెండు భాగాలు) సమయంలో వారిద్దరూ కలిసి పని చేసే విధానాన్ని చాలా దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. ఆ అనుభవంతోనే ఈ మాట అనగలుగుతున్నాను.
రామోజీ తొలి అవకాశం
గోదావరి తీరం కొవ్వూరులో శివశక్తి దత్తా, భానుమతి దంపతుల ఆరుగురు సంతానంలో అగ్రజుడిగా సంపన్నమైన ఉమ్మడి కుటుంబంలో పుట్టి, కళాభిమానుల నిలయమైన ఆ ఇంట్లో చిన్నతనంలోనే సంగీత సాహిత్యాల పట్ల మక్కువ పెంచుకున్నారు కీరవాణి. ప్రతిష్ఠాత్మక చిత్ర నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ ‘మనసు మమత’ చిత్రంతో సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చింది. ఆ చిత్రంతో తనకు తొలి అవకాశం ఇచ్చిన ఉషా కిరణ్ మూవీస్ అధినేత రామోజీ రావు ఇప్పటికీ కీరవాణి గారికి ప్రాతఃస్మరణీయులు. కీరవాణి గారి ఇంట్లోకి వెళ్లగానే మనకు కనిపించే మూడు ఫోటోలు: చక్రవర్తి గారు-వేటూరి గారు- రామోజీ రావు గారు. తొలి సినిమా తర్వాత ఇక కీరవాణి వెనుదిరిగి చూడలేదు. రామ్‌గోపాల్ వర్మ ‘క్షణక్షణం’ ఆయనను బిజీ మ్యూజిక్ డైరెక్టర్‌ని చేసేసింది. రాఘవేంద్రరావు గారితో కాంబినేషన్ కుదరగానే ఆయన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు.
అంతర్జాతీయ వేదికపై ఆ ఉద్వేగం.... అమితానందం
‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కి నామినేట్ అయిన సమయంలో నేను కీరవాణి గారి పక్కనే ఉన్నాను. అప్పుడు కూడా ఆయనలో పెద్ద తేడా ఏం కనబడలేదు. ..చిన్న నవ్వు తప్ప. కాసేపటికే పనిలో పడిపోయారు. కానీ ఆస్కార్ అవార్డు అందుకుంటున్నప్పుడు కీరవాణి ముఖంలో ఆ వెలుగు.. కళ్లల్లో ఆ మెరుపు.. ఆ హావభావాల్లో తొణికిసలాడిన ఉద్వేగం ఎంతో కొత్తగా అనిపించి, అమితానందం కలిగింది.
ఇది సాధారణమైన విజయమా! చలనచిత్ర చరిత్రలో తొలిసారి ఒక ఆసియావాసి, ఒక భారతీయుడు, ఒక తెలుగు వాడు అందుకున్న ఆస్కార్ పురస్కారమిది. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమయ్యే సరికొత్త అధ్యాయమిది. ఆ నవ చరిత్ర ఆవిష్కరణకు బీజం వేసి, మార్గాన్వేషణ చేసి, ఇంతవరకు మనకు తెలియని ద్వారాలు తెరిచి, శ్రమించి, గమించి, ఆస్కార్‌ను సాధించి, భారతీయ చిత్ర పరిశ్రమకు దారి చూపించిన దర్శక ధీరుడు రాజమౌళి, వారి బృందానికీ జేజేలు పలుకుదాం. సగౌరవంగా స్వదేశానికి స్వాగతిద్దాం..
వ్యక్తిత్వం సమున్నతం..
కీరవాణి గారి సంగీతానికి మొదటి నుంచీ నేను అభిమానిని. ఆయనను దగ్గర నుంచి చూశాక వీరాభిమానిని అయిపోయాను. అందుకు ఆయన వ్యక్తిత్వమే కారణం. ఆయనకు ఎన్నో నమ్మకాలున్నాయనీ, వాటికి భిన్నంగా ఉన్నవారిని దగ్గరకు రానివ్వరనీ ఆయనను కలవక ముందు విన్నాను. ఆయనను మొదటిసారి 1996లో చెన్నైలో కలిశాను. పాటలు రాసాను. ఆ తర్వాత పదేళ్లకు ఆయన హైదరాబాద్‌లో స్థిరపడ్డాక ‘గుండె ఝల్లుమంది’ చిత్రం కోసం కలిశాను. అప్పటి నుంచీ ఆయనతో పని చేస్తూనే ఉన్నాను. నేను విన్నవి వేరు. కంటున్నవి వేరు. నేను ఆయన అభిమానినైనా ఎన్నో విషయాలపై మా మధ్య సంభాషణలూ, చర్చలూ జరిగినప్పుడు చాలా సార్లు ఆయనతో విభేదిస్తుంటాను. నేను జర్నలిజం నుంచి వచ్చిన వాణ్ని గనుక రాజకీయ సామాజిక అంశాలపై కూడా నాతో మాట్లాడతారు. అనేక సందర్భాలలో ఇద్దరి అభిప్రాయాలు పరస్పరం భిన్నంగా ఉంటాయి. ఆ వైరుధ్యాన్ని వైవిధ్యంగా ఆమోదించారు కానీ...నన్ను దూరం పెట్టడం, అవకాశాలు నిరాకరించడం గానీ ఎప్పుడూ జరగలేదు.
చైతన్య ప్రసాద్, ప్రముఖ గీత రచయిత
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్